Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరీస్ విజయంపై రోహిత్‌సేన గురి
- పోటీ ఇవ్వటంపై శ్రీలంక ఫోకస్
- భారత్, శ్రీలంక రెండో టీ20 నేడు
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
టీమ్ ఇండియా రికార్డు సిరీస్ విజయంపై గురి పెట్టింది. టీ20ల్లో వరుసగా 11వ సిరీస్ విజయం లక్ష్యంగా నేడు ధర్మశాలలో ధనాధన్‌కు సిద్ధపడుతోంది. కొత్త ఆటగాళ్ల చేరికతో కనీస పోటీ ఇచ్చేందుకు శ్రీలంక అస్త్రాలు రెఢ చేసుకుంటోంది. ధర్మశాలకు నేడు వర్షం ముప్పు ఉండటంతో వాతావరణంపై అందరి దృష్టి నెలకొంది. వరుణుడు సహకరిస్తే భారత్ సిరీస్ విజయం వేటకు వెళ్లనుంది. భారత్, శ్రీలంక రెండో టీ20 పోరు నేడు.
నవతెలంగాణ-ధర్మశాల
ప్రపంచ క్రికెట్లో అతి కొద్ది దేశాలకు మాత్రమే నాణ్యమైన రిజర్వ్ బలం ఉంది. భారత్ అందులో తొలి వరుసలో ఉంటుంది. ఇటు టీమ్ ఇండియా, అటు శ్రీలంక తరఫున తొలి ప్రాధాన్య ఆటగాళ్లు జట్టుకు దూరం కావటంతో తాజా సిరీస్ బెంచ్ బలానికి మధ్య పోటీగా తయారైంది!. లక్నో టీ20లో టీమ్ ఇండియా తన రిజర్వ్ బలం గట్టిగా చాటుకుంది. ప్రధాన పేసర్లు భువనేశ్వర్ కుమార్, జశ్‌ప్రీత్ బుమ్రా, యుజ్వెంద్ర చాహల్ తుది జట్టులో నిలిచినా.. ఓవర్ల కోటా పూర్తి చేయలేదు. వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడాలకు బౌలింగ్ అవకాశం కల్పించాడు రోహిత్. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమ్ ఇండియా కీలక ఆరో బౌలర్‌ను ఎంపిక చేసుకునే పనిలో ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా టాప్ ఆర్డర్‌కు పదును పెడుతోంది. 1-0 ఆధిక్యంతో ధర్మశాలకు చేరుకున్న రోహిత్‌సేన.. నేడు టీ20 సిరీస్ విజయంపై కన్నేసి బరిలోకి దిగుతోంది. భారత్‌కు పోటీ ఇవ్వటమే ధ్యేయంగా శ్రీలంక నేడు మైదానంలోకి వస్తోంది.
భువీ దూకుడు : గత కొన్నేండ్లుగా స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ పెద్దగా ఫామ్‌లో లేడు. ఓ దశలో జట్టులో అతడి చోటే ప్రశ్నార్థకంగా మారింది. ఫామ్‌లోకి వస్తే మ్యాచ్ ఫలితాన్ని ఏ స్థాయిలో శాసిస్తాడో భువనేశ్వర్ కుమార్ చాటుకున్నాడు. వెస్టిండీస్‌తో టీ20లో 19వ ఓవర్లో 4 పరుగులే ఇచ్చిన భువనేశ్వర్ మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. నిరుడు, ఇంగ్లాండ్ 225 పరుగుల ఛేదనలోనూ భువనేశ్వర్ కుమార్ 4-0-15-2 గణాంకాలతో చెలరేగాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 188/8 పరుగులకే పరిమితమైంది. టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో భువనేశ్వర్ కుమార్ దూకుడును టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ఆస్వాదిస్తోంది. శ్రీలంకతో తొలి టీ20లోనూ తొలి రెండు ఓవర్లలో 9 పరుగులకే రెండు వికెట్లు కూల్చిన లంక ఛేదన ఆశలపై నీళ్లు చల్లాడు. నేడు ధర్మశాలలోనూ భువనేశ్వర్ కుమార్ ఫోకస్ కానున్నాడు. భువిని ఎదుర్కొనేందుకు శ్రీలంక టాప్ ఆర్డర్ ఏ మేరకు సన్నద్ధమైందో చూడాలి. తొలి టీ20కి అనారోగ్యంతో దూరమైన రుతురాజ్ గైక్వాడ్ నేడు మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నది లేనిది తెలియటం లేదు. రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులో లేకుంటే భారత్ తుది జట్టులో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు.
అసలంకపైనే ఆశలు : 2021 టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్-5లో చోటు సాధించాడు చరిత్ అసలంక. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో అసలంక తేలిపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 12.80 సగటుతో 64 పరుగులే సాధించాడు. భారత్‌లో లక్నో టీ20లో శ్రీలంక తరఫున అసలంక ఒక్కడే పోరాడాడు. 47 బంతుల్లో అజేయంగా 53 పరుగులు చేశాడు. శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌లో కొత్త ఆటగాళ్ల చేరికతో ధర్మశాలలో కాస్త మెరుగైన ప్రదర్శనకు అవకాశం ఏర్పడింది. దినేశ్ చండిమాల్ స్థానంలో నిరోషన్ డిక్వెల్లా, కామిల్ మిశార స్థానంలో ధనుష్క గుణతిలకలు బ్యాటింగ్ ఆర్డర్‌లోకి రానున్నారు. ఈ ఇద్దరి చేరికతో శ్రీలంక బ్యాటింగ్ ప్రదర్శన బలపడే అవకాశం కనిపిస్తోంది.
పిచ్, వాతావరణం : భారత్ చివరగా ధర్మశాలలో ఆడాల్సిన అంతర్జాతీయ పోరు వర్షం కారణంగా సాగలేదు. ఇక్కడ చివరగా జరగాల్సిన టీ20 మ్యాచ్‌కు సైతం ఆటంకం ఏర్పడింది. నేటి మ్యాచ్‌కు సైతం వర్షం ముప్పు పొంచి ఉంది. ధర్మశాలలో శనివారం వర్షం సూచనలు ఉన్నాయి. మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ 2016లో చివరగా టీ20 మ్యాచ్ జరిగింది. నేటి మ్యాచ్‌కు పిచ్ ఏ విధంగా స్పందిస్తుందో చెప్పలేం.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, దీపక్ హుడా, వెంకటేశ్ అయ్యర్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జశ్‌ప్రీత్ బుమ్రా, యుజ్వెంద్ర చాహల్.
శ్రీలంక : ధనుష్క గుణతిలక, నిశాంక, చరిత్ అసలంక, జానిత్ లియాంగె, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), దశున్ శనక (కెప్టెన్), చామిక కరుణరత్నె, దుష్మంత చమీరా, జెఫ్రీ వాండర్సె, ప్రవీణ్ జయవిక్రమ, లహిరు కుమార.