Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో చితకబాదిన అయ్యర్, జడేజా
- 2-0తో సిరీస్ భారత్ సొంతం
భారత్ రికార్డు సిరీస్ విజయం సాధించింది. టీ20ల్లో వరుసగా 11వ ద్వైపాక్షిక సిరీస్ విజయం సొంతం చేసుకుంది. ధర్మశాలలో శ్రీలంకపై 184 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలోనే ఊదేసిన టీమ్ ఇండియా.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్ ఉండగానే టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. నేడు నామమాత్రపు మూడో టీ20 ధర్మశాలలోనే జరుగనుంది.
నవతెలంగాణ-ధర్మశాల
శ్రేయస్ అయ్యర్ (74 నాటౌట్, 44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (45 నాటౌట్, 18 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగారు. 184 పరుగుల భారీ ఛేదనలో ఈ ఇద్దరి విజృంభణతో టీమ్ ఇండియా ఏకపక్ష విజయం నమోదు చేసింది. 17.1 ఓవర్లలోనే 184 పరుగుల లక్ష్యాన్ని ఊదేసింది. ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 183/5 పరుగులు చేసింది. పథుమ్ నిశాంక (75, 53 బంతుల్లో 11 ఫోర్లు), కెప్టెన్ దశున్ శనక (47 నాటౌట్, 19 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఓపెనర్ ధనుష్క గుణతిలక (38, 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
అయ్యర్, జడ్డూ షో : 184 పరుగుల భారీ లక్ష్యం. కెప్టెన్ రోహిత్ శర్మ (1), ఓపెనర్ ఇషాన్ కిషన్ (16) పవర్ ప్లేలోనే నిష్క్రమించారు. మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పడింది. ఆరంభంలో పరుగులు కష్టంగా వచ్చాయి. 66 బంతుల్లో 114 పరుగులు చేయాల్సిన సమీకరణం. ఈ తరుణంలో శ్రేయస్ అయ్యర్ (75 నాటౌట్), రవీంద్ర జడేజా (45 నాటౌట్) విశ్వరూపం చూపించారు. జడేజా ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 బంతుల్లోనే 45 పరుగులు పిండుకోగా.. శ్రేయస్ అయ్యర్ నయా శైలిలో విరుచుకుపడ్డాడు. నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లతో మెరిసిన అయ్యర్ 44 బంతుల్లో 74 పరుగులు సాధించాడు. ఈ ఇద్దరి మెరుపులతో మరో 17 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఘన విజయం సాధించింది. 4.1 ఓవర్లలోనే అజేయంగా 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అయ్యర్, జడేజా జోడీ శ్రీలంక గెలుపు ఆశలపై నీళ్లు చల్లింది. మిడిల్ ఆర్డర్లో సంజు శాంసన్ (39, 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార (2/31) రాణించాడు.
నిశాంక, శనక ధనాధన్ : తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారత బౌలర్లపై విరుచుకుపడింది. ఓపెనర్లు నిశాంక (75), గుణతిలక (38) రాణించటంతో తొలి వికెట్‌కు 67 పరుగుల భారీ భాగస్వామ్యం దక్కింది. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన నిశాంక కుదురుకున్నాక విజృంభించాడు. 43 బంతుల్లో ఏడు ఫోర్లతో అర్థ సెంచరీ బాదిన నిశాంక.. ఆ తర్వాత 9 బంతుల్లోనే 25 పరుగులు పిండుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో చరిత్ అసలంక (2), కమిల్ మిశార (1), దినేశ్ చండిమాల్ (9) నిరాశపరిచినా.. టాప్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ కదం తొక్కారు. కెప్టెన్ ధశున్ శనక డెత్ ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 19 బంతుల్లోనే 47 పరుగులు పిండుకున్నాడు. ఐదు సిక్సర్లతో దండెత్తిన శనక స్లాగ్ ఓవర్లలో ఊచకోత కోశాడు. శనక జోరుతో శ్రీలంక భారీ స్కోరు నమోదు చేసింది. భారత బౌలర్లలో ఎవరూ శ్రీలంక దూకుడుకు కళ్లెం వేయలేకపోయారు. స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ 36 పరుగులు సమర్పించుకోగా.. హర్షల్ పటేల్ ఏకంగా అర్థ సెంచరీ (52) దాటాడు. స్పిన్నర్ చాహల్ (1/27), పేసర్ బుమ్రా (1/24) ఫర్వాలేదనిపంచారు.
శ్రీలంక ఇన్నింగ్స్ : నిశాంక (ఎల్బీ) భువనేశ్వర్ 75, ధనుష్క గుణతిలక (సి) వెంకటేశ్ (బి) జడేజా 38, చరిత్ అసలంక (ఎల్బీ) చాహల్ 2, కమిల్ మిశార (సి) శ్రేయస్ (బి) హర్షల్ 1, దినేశ్ చండిమాల్ (సి) రోహిత్ (బి) బుమ్రా 9, దశున్ శనక నాటౌట్ 47, చామిక కరుణరత్నె నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 183.
వికెట్ల పతనం : 1-67, 2-71, 3-76, 4-102, 5-160.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 4-0-36-1, జశ్‌ప్రీత్ బుమ్రా 4-0-24-1, హర్షల్ పటేల్ 4-0-52-1, యుజ్వెంద్ర చాహల్ 4-0-27-1, రవీంద్ర జడేజా 4-0-37-1.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (బి) చమీరా 1, ఇషాన్ కిషన్ (సి) శనక (బి) కుమార 16, శ్రేయస్ అయ్యర్ నాటౌట్ 74, సంజు శాంసన్ (సి) ఫెర్నాండో (బి) కుమార 39, రవీంద్ర జడేజా నాటౌట్ 45, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (17.1 ఓవర్లలో 3 వికెట్లకు) 186.
వికెట్ల పతనం : 1-9, 2-44, 3-128.
బౌలింగ్ : చమీరా 3.1-0-39-1, ఫెర్నాండో 4-0-47-0, కుమార 3-0-31-2, ప్రవీణ్ 2-0-19-0, కరుణరత్నె 3-0-24-0, శనక 2-0-24-0.