Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో అహ్మదాబాద్‌కు నిరాశ ొప్రైమ్ వాలీబాల్ లీగ్
హైదరాబాద్ : కోల్‌కత థండర్‌బోల్ట్స్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ విజేతగా అవతరించింది. గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో అహ్మదాబాద్ డిఫెండర్స్‌పై కోల్‌కత థండర్‌బోల్ట్స్ 3-0తో ఏకపక్ష విజయం సాధించింది. ప్రైమ్ వాలీబాల్ లీగ్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కోల్‌కత స్పైకర్లు ఆధిపత్యం చెలాయించిన ఫైనల్లో 15-13, 15-10, 15-12తో ఆ జట్టు ఘన విజయం సాధించింది. తొలి సెట్లో అహ్మదాబాద్ అనవసర తప్పిదాలు చేయగా కోల్‌కత 5-3 ఆధిక్యంలో నిలిచింది. వినీత్ కుమార్ రాణించటంతో కోల్‌కత 10-8తో ముందంజలో నిలిచింది. కోల్‌కత ఆటగాడు వినీత్ కండ్లుచెదిరే సర్వ్‌తో 15-13తో తొలి సెట్‌ను కోల్‌కత వశం చేశాడు. రెండో సెట్లో రాహుల్ సూపర్ స్పైక్‌లతో కోల్‌కత ముందంజ వేసింది. 9-5తో భారీ ఆధిక్యంలో నిలిచిన కోల్‌కత 15-10తో రెండో సెట్‌ను సైతం సొంతం చేసుకుంది. చావోరేవో తేల్చుకోవాల్సిన మూడో సెట్లో అహ్మదాబాద్ ఆశించిన పోరాటం చేయలేదు. 8-5తో ఆధిపత్యం చూపించిన కోల్‌కత.. 11-8తో ఆధిక్యం నిలుపుకుంది. 15-12తో మూడో సెట్‌ను గెల్చుకుని ప్రైమ్ వాలీబాల్ లీగ్ చాంపియన్‌గా అవతరించింది. కోల్‌కత ఆటగాడు వినీత్ కుమార్ 'సీజన్ విలువైన ఆటగాడు' అవార్డు అందుకోగా.. హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ ఆటగాడు ఎస్వీ గురు ప్రశాంత్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు దక్కించుకున్నాడు.