Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌కు నం.3 బ్యాటర్ చిక్కు
- కోహ్లి, శ్రేయస్, సూర్య నడుమ పోటీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ఇంకా 8 మాసాల సమయం ఉంది. వరల్డ్‌కప్ విజయమే లక్ష్యంగా కొత్త కెప్టెన్ రోహిత్, కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ రోడ్‌మ్యాప్ తయారు చేశారు. ఆ దిశగా తుది జట్టుకు రూపకల్పన ఇస్తూ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో దుమ్ము రేపుతున్నారు. 2022 టీ20 ప్రపంచకప్ ముంగిట టీమ్ ఇండియా పలు అంశాల్లో చిక్కు ప్రశ్నలు ఎదుర్కొంటుంది. అందులోకి తాజాగా నం.3 బ్యాటర్ చిక్కుముడి చేరింది!
నవతెలంగాణ క్రీడావిభాగం
భారత క్రికెట్ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి శ్రీలంకతో పొట్టి సిరీస్‌కు విశ్రాంతి తీసుకోగా.. సూర్యకుమార్ యాదవ్ గాయంతో దూరమయ్యాడు. విరాట్, సూర్య లేని వేళ నం.3 బ్యాటర్‌గా అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు శ్రేయస్ అయ్యర్. సంప్రదాయ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న శ్రేయస్ అయ్యర్‌ను నిజానికి భారత్ గతంలో టీ20 తుది జట్టు ప్రాధాన్య ఆటగాడిగా చూడలేదు. ఓ దశలో ఐపీఎల్ ప్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ సైతం శ్రేయస్ అయ్యర్ సేవలను విస్మరించింది. ఐపీఎల్లో ఎదురైన అనుభవమో, భారత జట్టులో పోటీ తట్టుకోవాలంటే ఏం చేయాలనే తపనో కానీ.. శ్రేయస్ అయ్యర్ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో లంక బౌలర్లను తుక్కుతుక్కుగా కొట్టాడు. టీ20 సిరీస్‌లో లంక బౌలర్లు అయ్యర్ వికెట్ తీయలేకపోయారు. మూడు మ్యాచుల్లోనూ శ్రేయస్ అయ్యర్ అజేయంగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ ధనాధన్ అవతారంతో టీ20 ప్రపంచకప్‌లో భారత్ నం.3 బ్యాటర్ ఎవరనే ప్రశ్న ఉదయిస్తోంది. విధ్వంసక విన్యాసాలతో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌లకు శ్రేయస్ అయ్యర్ గట్టి పోటీదారుగా తయారయ్యాడు.
నయా శ్రేయస్ : శ్రీలంకతో టీ20 సిరీస్‌తో శ్రేయస్ అయ్యర్ కనీవినీ ఎరుగుని ప్రదర్శన చేశాడు. వన్డే, టెస్టు ఫార్మాట్లలో శ్రేయస్ అయ్యర్ సత్తా, సామర్థ్యంపై ఎవరికీ సందేహం లేదు. కానీ టీ20ల్లో అతడి స్ట్రయిక్‌రేట్, నిలకడగా బౌండరీల మోతపై విమర్శకులు ప్రశ్నించేవారు. శ్రీలంకపై దండయాత్ర చేసిన అయ్యర్ విమర్శకులకు సమాధానంతో పాటు తుది జట్టు ఎంపికలో జట్టు మేనేజ్మెంట్కు తీయని తలనొప్పి తీసుకొచ్చాడు. తొలి టీ20లో అజేయంగా 57 పరుగులు, రెండో టీ20లో అజేయంగా 74 పరుగుల, మూడో టీ20లో అజేయంగా 73 పరుగులు చేశాడు అయ్యర్. ఇందులో తొలి టీ20లో స్ట్రయిక్‌రేట్ 200 పైచిలుకు ఉండగా... చివరి రెండు మ్యాచుల్లో 160కి పైగా ఉంది. ఈ సిరీస్‌లో 20 ఫోర్లు, 7 సిక్సర్లు బాదిన శ్రేయస్ అయ్యర్ ధనాధన్ రేసులో తనెంటో నిరూపించుకున్నాడు. 36 టీ20ల్లో 36.77 సగటుతో 809 పరుగులు చేసిన శ్రేయస్.. 141.43 స్ట్రయిక్ రేట్ కలిగి ఉన్నాడు. ప్రపంచకప్ కౌంట్‌డౌన్ మొదలు కానున్న తరుణంలో శ్రేయస్ అయ్యర్ మెరుపులు భారత్‌కు అదనపు వనరులు అందించగా.. జట్టు సెలక్షన్‌కు సంబంధించిన క్లిష్టమైన సవాళ్లను మిగిల్చింది.
2021 టీ20 ప్రపంచకప్ చేదు అనుభవం నేపథ్యంలో రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ జోడీ కోర్ గ్రూప్ సృష్టించేందుకు కసరత్తులు చేస్తుంది. నాయకత్వ బృందంలో ఉంటూ, జట్టు విజయాల్లో పాలుపంచుకునే ఆటగాళ్లను ఎంచుకుంటున్నారు. తుది జట్టుపై అంచనాతో పాటు రిజర్వ్ బలంపైనా దృష్టి నిలిపారు. సంజు శాంసన్, దీపక్ హుడా వంటి ఆటగాళ్లను విలువైన అవకాశాలను కల్పిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ బృందంపై ఓ అవగాహనతో ఉన్న జట్టు మేనేజ్మెంట్ అందరికీ సముచిత మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించేందుకు సంకల్పించింది. జట్టులో ప్రతి స్థానం కోసం ఆరోగ్యవంతమైన పోటీ నెలకొంది. రేసులో ఉన్న ఆటగాళ్లు అందరికీ జట్టులో చోటుపై భరోసా కల్పిస్తూనే.. ప్రపంచకప్ సైన్యాన్ని సిద్ధం చేసేందుకు రెఢ అవుతున్నారు. విరాట్ కోహ్లి స్థాయి ఆటగాడికి పోటీదారుగా నిలిచిన శ్రేయస్ అయ్యర్ తనను తాను నం.3 రేసులో ముందంజలో నిలబెట్టుకోవటం అసాధారణం
ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు తుది జట్టులో చోటు కోసం పోటీపడటం ఎల్లప్పుడూ మంచిదే. జట్టు రిజర్వ్ బలం అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాం. అందుకే రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించటం ముఖ్యమని భావించాం. జట్టులో స్థానం కోసం ఆందోళన వద్దని ఆటగాళ్లకు భరోసా ఇస్తున్నాం. తుది జట్టులో ఖాళీలను భర్తీ చేసుకుంటు ముందుకు సాగాలని అనుకుంటున్నాం' - రోహిత్ శర్మ, భారత కెప్టెన్
మూడు మ్యాచుల్లోనూ నాటౌట్‌గా నిలువటం నాకు గొప్ప ప్రదర్శన. టీ20 ఫార్మాట్లో టాప్-3లో బ్యాటింగ్‌కు వస్తేనే మెరుగ్గా ఆడేందుకు వీలుంటుంది. దిగువన బ్యాటింగ్‌కు వస్తే పెద్దగా సమయం చిక్కదు. తొలి బంతి నుంచే బాదాల్సి వస్తుంది. నా వరకు నం.3 పొజిషన్లో బాగా ఆడగలను. జట్టులో ప్రతి స్థానానికి ఎంతో పోటీ నెలకొంది. ప్రతి ఒక్కరూ ఒంటిచేత్తో విజయాలను అందించగల సమర్థులే. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నాను. జట్టుకు విజయాలను అందించటమే నా ఆలోచన'
- శ్రేయస్ అయ్యర్