Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విరాట్ కోహ్లి, బీసీసీఐ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించటం లేదు. విరాట్ కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన నాటి నుంచి మొదలైన రగడ.. అతడు టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై పలికే వరకు రసవత్తరంగా సాగింది. ఈ నడుమ ఈ వివాదం సద్దుమణిగినట్టు కనిపించినా... సూపర్‌స్టార్ కెరీర్ 100వ టెస్టు నేపథ్యంలో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. శ్రీలంకతో టెస్టు సిరీస్ బెంగళూర్ నుంచి ఆరంభం కావాల్సి ఉంది. బీసీసీఐ షెడ్యూల్లో మార్పులు చేసి తొలి టెస్టును మొహాలికి కేటాయించింది. ఐపీఎల్లో బెంగళూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి.. చిన్నస్వామి స్టేడియాన్ని సొంతగడ్డగా మలచుకున్నాడు. బెంగళూర్‌లో అభిమానుల మధ్య కెరీర్ వందో టెస్టు ఆడేందుకు ప్రణాళికలు చేసుకున్నాడు. విరాట్ వంద టెస్టుల వేడుక పండుగను బీసీసీఐ చల్లబరిచేసింది. తొలి టెస్టును మొహాలికి ఇవ్వటంతో పాటు చారిత్రక విరాట్ 100వ టెస్టుకు అభిమానులకు ప్రవేశం నిరాకరించింది. దీంతో బీసీసీఐపై మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లి ప్రభను తగ్గించేందుకు, అతడి వందో టెస్టుకు అభిమానులను రానివ్వటం లేదనే విమర్శలు నెటిజన్లు చేస్తున్నారు. కోవిడ్-19 పరిస్థితుల్లో కేసుల తీవ్రత దృష్ట్యా బీసీసీఐ సూచనల మేరకు మొహాలీ టెస్టుకు అభిమానులకు ప్రవేశం లేదని పంజాబ్ క్రికెట్ సంఘం పేర్కొంది. ఈ విషయంలో దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం బోర్డుపై విమర్శల బాణం ఎక్కుపెట్టాడు.