Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెరీర్ వందో టెస్టుకు మొహాలీ ముస్తాబు
- అభిమానులకు ప్రవేశం లేకపోవటంపై విమర్శలు
ప్రపంచ క్రికెట్‌కు భారత క్రికెట్ ఎంతో మంది గొప్ప క్రికెటర్లను అందించింది. లక్ష్యం దిశగా బలమైన ఆశయం, సంకల్పంలో ఎవరూ విరాట్ కోహ్లికి సాటిరారు. నైపుణ్యంలో సచిన్ టెండూల్కర్‌ను అందిపుచ్చుకున్న విరాట్ కోహ్లి.. ఫిట్నెస్ ప్రపంచ మేటి అథ్లెట్ల స్థాయిలో కసరత్తులు చేశాడు. ఆధునిక క్రికెట్లో మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటగాడిగా విరాట్ కోహ్లి కీర్తి గడించాడు. ప్రత్యేకించి సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు వన్నె తీసుకొచ్చిన అపూర్వ ఘనత కోహ్లికి దక్కుతుంది. టెస్టు క్రికెట్‌కు జీవం పోసిన విరాట్ కోహ్లి కెరీర్ వందో టెస్టు సమరానికి సిద్ధమవుతున్నాడు. మొహాలీలో శ్రీలంకపై విరాట్ కోహ్లి చారిత్రక 100వ టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధం చేసుకున్నాడు.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఆధునిక టెస్టు క్రికెట్ ప్రస్తావనలో విరాట్ కోహ్లికి ముందు, తర్వాత అని చరిత్ర చెప్పుకోవాలి!. గణాంకాల పరంగా వైట్‌బాల్ క్రికెట్‌పై విరాట్ కోహ్లి చెరగని ముద్ర వేశాడు. వన్డేల్లో 43 శతకాలు, 64 అర్థ సెంచరీలతో 12311 పరుగులు బాదాడు. ఈ ఫార్మాట్లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలు కొట్టేందుకు అత్యంత చేరువలో ఉన్నాడు కోహ్లి. గణాంకాల మాత్రమే వాస్తవాలను ప్రతిబింబించవు. విరాట్ కోహ్లి ప్రభావం టెస్టు క్రికెట్‌పై ఏ స్థాయిలో ఉందనేందుకు గణాంకాలు సరిపోవు. దశాబ్ద కాలంగా టెస్టు క్రికెట్‌ను దగ్గర్నుంచి పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అవగతం అవుతుంది. టీ20 ఫార్మాట్‌తో టెస్టు క్రికెట్ మనుగడ ప్రశ్నార్థకమైన తరుణంలో.. ఆటతో, నాయకత్వంతో ప్రపంచ టెస్టు క్రికెట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన క్రికెటర్ విరాట్ కోహ్లి. కెరీర్లో 99 టెస్టులు ఆడేసిన విరాట్ కోహ్లి.. సొంతగడ్డ మొహాలీలో చారిత్రక 100వ టెస్టుకు సిద్ధమవుతున్నాడు.
వన్నె తెచ్చిన మొనగాడు : 2011, జూన్ 20న వెస్టిండీస్‌పై కింగ్స్టన్ టెస్టులో సంప్రదాయ క్రికెట్ అరంగ్రేటం చేసిన విరాట్ కోహ్లి.. ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. భారత క్రికెట్ దిగ్గజాల వీడ్కోలు అనంతరం టీమ్ ఇండియా ముఖచిత్రంగా తనను తాను మలచుకున్న విరాట్ కోహ్లి అనితర సాధ్య రికార్డులు సాధించాడు. 27 శతకాలు, 28 అర్థ సెంచరీలతో 7962 పరుగులు నమోదు చేశాడు. మూడు ఫార్మాట్లలో 50కి పైగా సగటు సాధించిన ఏకైక ఆధునిక క్రికెటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లి టెస్టుల్లో 50.39 సగటుతో పరుగుల మోత మోగించాడు. బంగ్లాదేశ్‌ను మినహాయిస్తే.. ప్రతి టెస్టు దేశంపై ఇంటా, బయటా శతక గర్జన చేశాడు. అత్యుత్తమ బ్యాటర్‌గా ప్రత్యర్థి బౌలర్లపై ఎదురులేని ఆధిపత్యం చెలాయించాడు. టెస్టు క్రికెట్‌కు సరికొత్త శోభ తీసుకొచ్చాడు. ఐదు రోజుల ఆటకు విరాట్ కోహ్లి నాయకత్వం చిరస్మరణీయం. ఓటమి ఎదురైనా వెనక్కి తగ్గేది లేదు.. గెలుపు కోసమే చివరి బంతి వరకు పోరాటమే స్ఫూర్తిని రగిల్చాడు. విజయాల వేటలో కొన్నిసార్లు తడబాటుకు లోనైనా.. అంతిమంగా టెస్టు క్రికెట్‌పై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో ఆసక్తి జ్వాల రగిల్చాడు. బ్యాటర్‌గా బౌలర్లపై ఆధిపత్యం చూపించినా.. నాయకుడిగా ప్రత్యర్థులను కవ్వించినా.. మైదానంలో అభిమానులను ఉత్తేజపరిచేలా విన్యాసాలు చేసినా అది విరాట్ కోహ్లికే దక్కింది.
వంద వేడుక : విరాట్ కోహ్లి 100వ టెస్టుకు మొహాలీ వేదిక కానుంది. నిజానికి దక్షిణాఫ్రికా పర్యటనలోనే విరాట్ కోహ్లి కెరీర్ 100వ టెస్టు ఆడేయాల్సి ఉంది. ఫిట్నెస్ సమస్యతో ఓ టెస్టుకు బెంచ్‌కు పరిమితమైన విరాట్ కోహ్లి.. స్వదేశంలో వంద వేడుకకు రంగం సిద్ధం చేసుకున్నాడు. మార్చి 4న శ్రీలంకతో తొలి టెస్టుతో విరాట్ కోహ్లి చారిత్రక 100వ టెస్టు ఆడనున్నాడు. వెస్టిండీస్‌తో చివరి టీ20, శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరమైన విరాట్ కోహ్లి.. విరామం అనంతరం నూతన ఉత్సాహంతో వందో టెస్టుకు సన్నద్ధం అవుతున్నాడు. రెండేండ్లుగా అంతర్జాతీయ శతకం సాధించని విరాట్ కోహ్లి..చారిత్రక వంద వేడుకలో అభిమానులకు వంద పండుగ అందించేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకున్నాడు.