Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెస్టు క్రికెట్లో గత పదేండ్లలో చతేశ్వర్ పుజారా, అజింక్య రహానెలలో ఏ ఒక్కరూ లేకుండా భారత్ ఓ టెస్టు మ్యాచ్ ఆడలేదు. రహానె, పుజారా ఇద్దరూ లేకుండా టీమ్ ఇండియా ఈ దశాబ్దంలో తొలిసారి ఓ టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతోంది. టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్లు పుజారా, రహానె స్థానాల కోసం పోటీ మొదలైంది. రెండు స్థానాల కోసం ముగ్గురు బ్యాటర్లు పోటీపడుతున్నారు. మొహాలీ టెస్టుకు తుది జట్టు ఎంపిక ఆసక్తి రేపుతోంది.
- విహారి, శ్రేయస్, గిల్ మధ్య పోటీ
- ఆసక్తి రేపుతున్న తుది జట్టు కాంబినేషన్
నవతెలంగాణ క్రీడావిభాగం
సంప్రదాయ బ్యాటర్లు, ఆపద్బాందవులు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు భారత టెస్టులో దశాబ్ద కాలంగా నిలకడగా కొనసాగారు. పుజారా, రహానెలలో ఎవరూ తుది జట్టులో లేకుండా భారత్ చివరగా టెస్టు మ్యాచ్ ఆడిన వేళ విరాట్ కోహ్లి టెస్టు శతకమే సాధించలేదు. టెస్టుల్లో 27 శతకాలు, 28 అర్థ శతకాలు బాదిన విరాట్ కోహ్లి మొహాలీ వేదికగా చారిత్రక 100వ టెస్టు మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు. మళ్లీ, ఇప్పుడు పుజారా, రహానెలు లేకుండా మరో టెస్టుకు సిద్ధమవుతోంది. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు పుజారా, రహానెలను పక్కనపెట్టినా.. ఐదు రోజుల ఆటలో ఆ ఇద్దరి శకం ముగియలేదు. ఆ ఇద్దరు లేని వేళ వారి స్థానాల కోసం జట్టులో తీవ్ర పోటీ నెలకొంది. పుజారా నం.3 బ్యాటర్‌గా, రహానె నం.5 బ్యాటర్‌గా జట్టుకు కీలకంగా వ్యవహరించారు. రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌లు ఓపెనర్లుగా.. రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్‌లు నం.6-నం.8 బ్యాటర్లుగా ఖాయం. శతాధిక టెస్టు వీరుడు నం.4 స్థానంలో ఉండనే ఉన్నాడు. దీంతో నం.3, నం.5 స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనే ఆసక్తి రెట్టింపు అవుతోంది. ఈ రెండు స్థానాల కోసం పోటీపడుతున్న బ్యాటర్లపై ఓ లుక్కేద్దాం.
హనుమ విహారి : టీమ్ ఇండియా చాలా కాలంగా ప్రయాణం చేస్తున్న ఆటగాడు హనుమ విహారి. భారత జట్టులో నిలుస్తున్నా.. టాప్-5లో నిలవలేకపోయాడు. జట్టుకు అదనపు బ్యాటర్ సేవలు అవసరమైనప్పుడే విహారిని తుది జట్టులోకి తీసుకున్నారు. బ్యాటింగ్‌కు క్లిష్టమైన పరిస్థితుల్లో విహరి 34.2 సగటుతో పరుగులు చేశాడు. విహారి బ్యాటింగ్‌పై ఓ విమర్శ ఉంది. విహారి రక్షణాత్మక బ్యాటర్. 11 టెస్టుల్లో 42.66 స్ట్రయిక్‌రేట్, 99 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 48.74 స్ట్రయిక్‌రేట్ అందుకు నిదర్శనం. ఆధునిక బలమైన బౌలింగ్ దళాలపై, బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై ఈ శైలి అంతకు ఉపయోగ పడదు. పరుగులు సులువుగా సాధించే స్పెల్స్ రావటం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో పుజారా డిఫెన్సివ్ బ్యాటింగ్‌ను అసాధారణ స్థాయికి తీసుకెళ్లాడు. ఆ దిశగా పుజారా విజయవంతమయ్యాడు. అందుకు ఎంతో మొండి పట్టుదల, మానసిక స్థైర్యం అవసరం. విహారిలో జట్టు మేనేజ్మెంట్ ఈ లక్షణాలు చూస్తే మొహాలీలో నం.3 బ్యాటర్ స్థానం తెలుగు తేజానిదే.
శ్రేయస్ అయ్యర్ : బ్యాటింగ్ లైనప్‌లో నం.3 స్థానం శ్రేయస్ అయ్యర్‌దే అనేవాళ్లు లేకపోలేదు. దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లి వెన్నుపూస నొప్పితో బాధపడిన సందర్భంలోనే, శ్రేయస్ అయ్యర్ సైతం కడుపు నొప్పితో విలవిల్లాడాడు. అయ్యర్ అనారోగ్యం కారణంగానే ఆ టెస్టులో హనుమ విహారికి తుది జట్టులో స్థానం కల్పించిందని జట్టు మేనేజ్మెంట్ చెప్పలేదు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు శ్రేయస్ అయ్యర్ నం.3 రేసులో నిలిచేందుకు అవసరమైన పని చేశాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌పై టెస్టు అరంగ్రేటం చేసిన శ్రేయస్ తొలి ఇన్నింగ్స్‌లో శతకం, రెండో ఇన్నింగ్స్‌లో అర్థ శతకంతో భారత్‌ను కష్టాల నుంచి బయటపడేశాడు. కివీస్‌పై సిరీస్‌లో స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించిన శ్రేయస్.. మొహాలీ టెస్టుకు తనను తాను ముందంజలో నిలుపుకున్నాడు. 56 మ్యాచుల ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అయ్యర్ సగటు 52.1, స్ట్రయిక్‌రేట్ 80.22 కలిగి ఉన్నాడు. తాజాగా శ్రీలంకపై టీ20 సిరీస్‌లో అజేయంగా మూడు అర్థ సెంచరీలు బాదిన శ్రేయస్ అయ్యర్ తుది జట్టు ఎంపికలో తనను విస్మరించటం కష్టతరం చేశాడు.
శుభ్‌మన్ గిల్ : మిడిల్ ఆర్డర్లో కీలక స్థానం అసలైన పోటీదారు శుభ్‌మన్ గిల్. స్వదేశంలో న్యూజి లాండ్‌తో టెస్టు సిరీస్ సమయంలో హనుమ విహారిని భారత్-ఏ జట్టుతో పాటు దక్షిణాఫ్రికాకు పంపించారు. దీంతో శుభ్‌మన్ గిల్ మిడిల్ ఆర్డర్లో రావటం లాంఛనమే అనిపించింది. కానీ కెఎల్ రాహుల్ గాయంతో తప్పని పరిస్థితుల్లో శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేశాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు శుభ్‌మన్ గిల్ గదవ గాయం తిరగబెట్టింది. దీంతో మిడిల్ ఆర్డర్లో గిల్‌ను ప్రయోగించే ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. జట్టులో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 33 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 56.56 సగటు, 69.8 స్ట్రయిక్‌రేట్‌తో ఆకట్టుకునే గణాంకాలు నమోదు చేశాడు. 57 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో 47 సార్లు ఓపెనర్‌గానే ఆడిన శుభ్‌మన్ గిల్.. భారత్-ఏ తరఫున 13 ఇన్నింగ్స్‌ల్లో ఎనిమిదింట మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశాడు. ఆ స్థానంలో విలువైన పరుగులు చేశాడు. భారత్-ఏ మిడిల్ ఆర్డర్లో గిల్ కదం తొక్కిన వేళ రాహుల్ ద్రవిడ్ యువ జట్టు చీఫ్ కోచ్. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ జాతీయ జట్టు చీఫ్ కోచ్‌గా రావటంతో గిల్‌ను మిడిల్ ఆర్డర్లో ప్రవేశపెట్టే మిషన్‌ను మొదలుపెట్టేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది.
ఆ ఇద్దరు లేకుండా..!
భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్లు పుజారా, రహానెలు లేకుండా దశాబ్ద కాలంతో భారత్ తొలిసారి ఓ టెస్టు మ్యాచ్ ఆడనుంది.
శతధృవ యోధుడు
భారత క్రికెట్ సూపర్‌స్టార్, కింగ్ కోహ్లి చారిత్రక కెరీర్ 100వ టెస్టుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాడు. మొహాలీలో శ్రీలంకతో తొలి టెస్టుతో విరాట్ కోహ్లి వందో టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. విరాట్ వందో టెస్టుకు పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) అభిమానుల ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. అభిమానుల నడుమ విరాట్ వంద పండుగకు మొహాలీ ముస్తాబవుతున్న వేళ.. వందలో వంద కొట్టేందుకు నెట్స్‌లో విరాట్ కోహ్లి కఠోరంగా సాధన చేస్తున్నాడు.