Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 శాతం సామర్థ్యానికి అనుమతి
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 అభిమానుల నడుమ సందడి చేయనుంది. ఐపీఎల్ 15 సీజన్‌కు మహారాష్ట్రలోని ముంబయి, పుణె నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ మ్యాచుల నిర్వహణ, అభిమానులకు ప్రవేశం, కోవిడ్-19 మార్గదర్శకాలపై బీసీసీఐ ఉన్నతాధికారుల బృందం బుధవారం మహారాష్ట్ర పర్యాటకం, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య థాకరెతో సమావేశమైంది. ఐపీఎల్ సీఈవో హేమంగ్ ఆమిన్, ముంబయి, థానె, నవీ ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరమైన సమావేశంలో.. ఐపీఎల్ తొలి దశ మ్యాచులకు 25 శాతం సామర్థ్యంతో అభిమానులకు ప్రవేశానికి అనుమతులు లభించాయి. మార్చి 26-ఏప్రిల్ 15న జరిగే ఐపీఎల్ మ్యాచులకు ఈ అనుమతులు వర్తిస్తాయి. ఆ తర్వాత రెండో దశ ఐపీఎల్ మ్యాచ్‌లపై నిర్ణయం తర్వాత తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది. మార్చి 26న డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత నైట్‌రైడర్స్ మ్యాచ్‌తో ఐపీఎల్ 15 ఆరంభం కానుంది. మే 22న ఐపీఎల్ ఫైనల్ నిర్వహిస్తారు. ఐపీఎల్ 15 పూర్తి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.
ముంబయి వాంఖడే స్టేడియం, డివై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం, పుణె ఎంసీఏ స్టేడియంలు ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. వాంఖడే, డివై పాటిల్ స్టేడియాల్లో 20 చొప్పున మ్యాచులు జరుగనుండగా.. బ్రబౌర్న్, ఎంసీఏ మైదానాల్లో 15 చొప్పున మ్యాచులు నిర్వహించనున్నారు. ఐపీఎల్లో పది జట్ల ప్రాక్టీస్ కోసం ముంబయిలో ఐదు ప్రపంచ శ్రేణి నెట్స్‌ను ఎంపిక చేశారు. బయో బబుల్‌లో జరుగనున్న ఐపీఎల్ 15లో నాలుగు స్టేడియాలకు పది జట్లు బస్‌లోనే ప్రయాణం చేయనున్నాయి. కోవిడ్-19 ప్రభావం తప్పించేందుకు ఈ సారి విమాన ప్రయాణాలకు బోర్డు విముఖత చూపింది.