Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత్, శ్రీలంక టెస్టు సవాల్. రసవత్తర పోటీపై ఎవరినీ అంచనాలు లేవు. వరల్డ్ నం.2, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ రన్నరప్ భారత్ సిరీస్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై టీమ్ ఇండియా ఏకపక్ష విజయంపై ఎటువంటి అనుమానాలు కనిపించటం లేదు. మేటి ఆటగాడు విరాట్ కోహ్లి కెరీర్ వందో టెస్టు నేపథ్యంలో మొహాలిపై ఆసక్తి ఎక్కువైంది. కొంత కాలంగా శతకం సాధించలేని కోహ్లి.. మైలురాయి మ్యాచ్‌లో వందతో విజృంభిస్తాడేమో చూడాలి.
- విరాట్ కెరీర్ వందో టెస్టుకు సిద్ధం
- శ్రీలంకతో భారత్ తొలి టెస్టు నేటి నుంచి
నవతెలంగాణ-మొహాలి
క్రికెట్ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి కెరీర్ మైలురాయి మ్యాచ్‌కు మొహాలి ముస్తాబైంది. రెండేండ్లుగా శతక నిరీక్షణలో ఉన్న విరాట్ కోహ్లి.. నేడు కెరీర్ 100వ టెస్టులో వంద పరుగుల మార్కు చేరుకోవాలనే తపనతో బరిలోకి దిగుతున్నాడు. వరల్డ్ నం.2 టీమ్ ఇండియా రెండు టెస్టుల సిరీస్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. డబ్ల్యూటీసీ-2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న శ్రీలంక తాజాగా రోహిత్‌సేన టెస్టు సవాల్‌ను ఎదుర్కొనేందుకు రెఢ అయ్యింది. భారత్, శ్రీలంక తొలి టెస్టు సమరం నేటి నుంచి ఆరంభం.
విరాట్ వందోత్సాహం! : విరాట్ కోహ్లి మైలురాయి మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. శ్రీలంకతో తొలి టెస్టులో అతడు కెరీర్ వందో టెస్టు ఆడనున్నాడు. 2019 నుంచి ఏ ఫార్మాట్లోనూ శతకం బాదని విరాట్ కోహ్లి నేడు చారిత్రక టెస్టులో వంద దాహం తీర్చుకునేందుకు వస్తున్నాడు. విరాట్ కోహ్లి వంద వేడుకకు అభిమానులు సైతం రానుండటం కింగ్ కోహ్లి ఉత్సాహాన్ని రెట్టింపు చేయగలదు. పుజారా, రహానె లేని వేళ మిడిల్ ఆర్డర్లో రెండు స్థానాల కోసం ముగ్గురు పోటీపడుతున్నారు. శుభ్‌మన్ గిల్, హనుమ విహారి, శ్రేయస్ అయ్యర్లు నం.3, నం.5 బ్యాటింగ్ స్థానాల కోసం రేసులో ఉన్నారు. ఈ ముగ్గురులో ఇద్దరు తుది జట్టులో నిలువనున్నారు. బౌలింగ్ విభాగంలో జడేజా, అశ్విన్, బుమ్రా ఖాయం కాగా.. ఓ పేసర్ బెర్త్ కోసం సిరాజ్, షమి, ఉమేశ్ బరిలో ఉన్నారు. ఓ స్పిన్నర్ స్థానం కోసం కుల్దీప్, జయంత్, సౌరభ్‌లు పోటీపడుతున్నారు. స్పిన్ అనుకూల పిచ్‌పై భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. తొలి టెస్టులో భారత్ ఫేవరేట్‌గా బరిలో నిలిచింది.
మాయ చేస్తేనే..! : టెస్టు మ్యాచులను బౌలర్లు గెలిపిస్తారు. 20 వికెట్లు తీయగల సమర్థులు జట్టులో ఉంటేనే ఐదు రోజుల ఆటలో గెలుపు కోసం ఆలోచన చేయాలి. సీనియర్ల రాకతో బ్యాటింగ్ విభాగంలో లంకేయులు మెరుగ్గా కనిపిస్తున్నా.. బంతితో ఆ జట్టు అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ధనంజయ డిసిల్వ, లసిత్లపై ఆ జట్టు పెద్దగా ఆశలు పెట్టుకుంది. కరుణరత్నె, తిరిమానె, నిశాంక, మాథ్యూస్‌లతో కూడిన టాప్ ఆర్డర్ ఆశాజనకంగా కనిపిస్తోంది. మొహాలి స్పిన్ పిచ్‌పై నాణ్యమైన భారత స్పిన్నర్లను ఏ విధంగా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం.
పిచ్ రిపోర్టు : విరాట్ వందో టెస్టుకు మొహాలిలో సంప్రదాయ పిచ్ సిద్ధం చేశారు. ఇక్కడ సహజంగానే స్పిన్నర్లకు అనుకూలత ఎక్కువ. టెస్టులో ఆరంభం నుంచీ టర్న్‌కు అవకాశం లభించనుంది. ఇక్కడ ప్రస్తుతం వసంత బుతువు. ఆహ్లాదకరమైన వాతావరణం. ఎటువంటి వర్ష సూచనలు లేవు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్/విహారి/అయ్యర్ (ముగ్గురులో ఏదేని ఇద్దరు), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జశ్‌ప్రీత్ బుమ్రా.
శ్రీలంక : కరుణరత్నె (కెప్టెన్), తిరిమానె, నిశాంక, మాథ్యూస్, ధనంజయ డిసిల్వ, చండిమాల్/అసలంక, డిక్వెల్లా (వికెట్ కీపర్), లక్మల్, లసిత్, ప్రవీణ్ జయవిక్రమ, లహిరు కుమార.