Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి మహిళల ప్రపంచకప్
- న్యూజిలాండ్, విండీస్ మధ్య ఆరంభ పోరు
- పాకిస్థాన్‌తో పోరుతో భారత్ వేట షురూ
కరోనా ఎఫెక్ట్. స్తంభించిన ప్రపంచ క్రికెట్. సాధారణ పరిస్థితుల్లోనే పెద్దగా సందడి చేయని మహిళల క్రికెట్.. కోవిడ్ పరిస్థితుల్లోనూ ఉనికి చాటుకునేందుకు అభిమానుల ముందుకు రాబోతుంది. కోవిడ్-19తో నిరుడు జరగాల్సిన మహిళల వన్డే వరల్డ్‌కప్ నేటి నుంచి ఆరంభం కానుంది. 8 జట్లు, 30 రోజులు, 31 మ్యాచుల ఆసక్తికర షెడ్యూల్‌తో ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ అభిమానులను అలరించేందుకు వస్తోంది. నేడు ఆతిథ్య న్యూజిలాండ్, వెస్టిండీస్ నడుమ ఆరంభ మ్యాచ్‌తో వరల్డ్‌కప్ వార్‌కు తెర లేవనుంది. పొరుగు దేశం పాకిస్థాన్‌తో మ్యాచ్‌తో టీమ్ ఇండియా టైటిల్ వేటకు శ్రీకారం చుట్టనుంది.
నవతెలంగాణ- మౌంగానురు
2017 మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్. 2020 టీ20 ప్రపంచకప్ ఫైనల్స్. ఈ రెండు మెగా ఈవెంట్లలో టైటిల్ పోరుకు ప్రవేశించిన టీమ్ ఇండియా.. భారత్‌లో మహిళల క్రికెట్ పట్ల ఆదరణను భారీగా పెంచింది. అభిమానుల్లోనూ మహిళల క్రికెట్ పట్ల ఆసక్తి పెరిగింది. మహిళల క్రికెట్‌కు అత్యవసరమైన ఊపు వచ్చిన తరుణంలో కోవిడ్-19 గట్టి దెబ్బ కొట్టింది. మహిళల క్రికెట్‌కు జోశ్ తిరిగి తీసుకొచ్చేందుకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ రానే వచ్చింది. న్యూజిలాండ్ వేదికగా ఆరు మైదానాల్లో 8 జట్లు ప్రతిష్టాత్మక ప్రపంచకప్ కోసం సమరానికి సై అంటున్నాయి. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ సమరం నేటి నుంచి ఆరంభం. టైటిల్ పోరు ఏప్రిల్ 3న జరుగనుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన టాప్-4 జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించనున్నాయి.
బరిలో ఎనిమిది జట్లు :
మహిళల ప్రపంచకప్ బరిలో ఎనిమిది జట్లు నిలిచాయి. 2017-2021 మహిళల చాంపియన్‌షిప్ ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, దక్షిణాఫ్రికాలు అర్హత సాధించాయి. అర్హత టోర్నీల్లో ప్రదర్శనతో మరో మూడు జట్లను ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ.. కోవిడ్-19 పరిస్థితుల్లో శ్రీలంకలో జరగాల్సిన ఆ టోర్నీ రద్దుగా ముగిసింది. వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లను వన్డే వరల్డ్‌కప్ బెర్త్‌లను అందించారు. ఆతిథ్య జట్టుగా న్యూజిలాండ్ నేరుగా మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది. ప్రపంచకప్ బరిలో ఉన్న జట్లలో బంగ్లాదేశ్ తొలిసారి మెగా వార్ బరిలో నిలిచింది. బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌లో ఆడనుంది.
ఆరు వేదికలు :
కరోనా పరిస్థితుల్లో మహిళల ప్రపంచకప్‌ను బయో బుడగ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. కఠిన క్వారంటైన్ నిబంధనల అనంతరం ఎనిమిది జట్లు బయో సెక్యూర్ బబుల్‌లోకి ప్రవేశించాయి. లీగ్ దశలో విజయానికి రెండు పాయింట్లు, టై అయితే ఒక పాయింట్ లభించనుంది. టోర్నీ ఆరంభ దశలో పది శాతం సామర్థ్యంతో అభిమానుల ప్రవేశాని అనుమతి లభించింది. బే ఓవల్, యునివర్శిటి ఓవల్, సెడాన్ పార్క్, బేసిన్ రిజర్వ్, ఈడెన్ పార్క్, హాగ్లే ఓవల్ మైదానాలు ప్రపంచకప్ ఆతిథ్య వేదికలుగా ఎంపికయ్యాయి.
సూపర్ ఓవర్ :
మహిళల ప్రపంచకప్ లీగ్ దశ మ్యాచులకు సూపర్ ఓవర్ అందుబాటులో లేదు. కానీ నాకౌట్ దశలో సూపర్ ఓవర్ నిబంధనలు అమల్లోకి వస్తాయి. గతంలో 2019 మెన్స్ వరల్డ్‌కప్ ఫైనల్ టైగా ముగియగా.. సూపర్ ఓవర్ సైతం టై అయ్యింది. దీంతో బౌండరీల వ్యత్యాసంతో విజేతగా తేల్చారు. మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు ఐసీసీ నిబంధనలు సడలించింది. సూపర్ ఓవర్ టైగా ముగిసినా.. మరో సూపర్ ఓవర్ ఆడాల్సి ఉంటుంది. ఎన్ని సూపర్ ఓవర్లు టైగా ముగిసినా.. స్పష్టమైన విజేత తేలే వరకు సూపర్ ఓవర్ ఆడించనున్నారు. అంపైర్ నిర్ణయ సమీక్ష (డిఆర్ఎస్) కొనసాగుతుంది. ప్రతి జట్టుకు ఇన్నింగ్స్‌లో రెండు రివ్యూల అవకాశం కల్పించారు.
ప్రైజ్‌మనీ సూపర్ :
మహిళల వన్డే ప్రపంచకప్‌కు నగదు పురస్కారం భారీగా పెంచారు. ప్రపంచకప్ విజేత రూ. 10 కోట్ల భారీ ప్రైజ్‌మనీ ఎగరేసుకుపోనుంది. 2017 ప్రపంచకప్ విజేతకు దక్కిన మొత్తానికి ఇది రెట్టింపు ప్రైజ్‌మనీ. రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ.5 కోట్ల నగదు బహుమతి అందుకోనుంది. సెమీఫైనల్స్‌కు చేరిన జట్లు చెరో రూ. 2.5 కోట్లు దక్కించుకోనున్నాయి.
ఆ మూడు జట్లదే పైచేయి :
మహిళల ప్రపంచకప్‌లో ప్రధానంగా మూడు జట్లదే ఆధిపత్యం నడుస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లు సంప్రదాయంగా మహిళల క్రికెట్‌ను శాసిస్తుండగా.. ఈ రెండు జట్ల నడుమ పోటీలో ఓసారి న్యూజిలాండ్ సైతం కప్పును అందుకుంది. ఆస్ట్రేలియా అత్యధికంగా ఆరు సార్లు ప్రపంచకప్ విజేతగా అవతరించగా.. ఇంగ్లాండ్ ఏకంగా నాలుగు ప్రపంచకప్‌లు ఖాతాలో వేసుకుంది. భారత్ (2005, 2017) రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. భారత్‌కు అదే అత్యుత్తమ ప్రదర్శన.
కప్పు కల తీరేనా? : భారత మహిళల క్రికెట్ ఎంతో అభివృద్ది చెందినా.. క్షేత్ర స్థాయిలో స్ఫూర్తి రగిల్చే ఓ మెగా విజయం అవసరం ఏర్పడింది. 2017, 2020ల్లో భారత్ ప్రపంచకప్‌కు చేరువైనా.. చివరి అడుగు తడబడింది. న్యూజిలాండ్ గడ్డపై భారత్ మరోసారి ప్రపంచకప్ కోసం వేటాడనుంది. సీనియర్ బ్యాటర్, దిగ్గజ క్రికెటర్ మిథాలీరాజ్ (39) కెరీర్ చివరి ప్రపంచకప్‌కు సన్నద్ధమవుతోంది. రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్ ఆడుతున్న మిథాలీరాజ్ ఇప్పుడైనా కప్పు కల నెరవేర్చుకోవాలని ఆరాట పడుతోంది. కాగితంపై బలంగా కనిపిస్తోన్న టీమ్ ఇండియా.. అంచనాలకు తగినట్టు రాణిస్తే మహిళల ప్రపంచకప్‌కు భారత్ ముద్దు పెద్ద కష్టం కాదు!.