Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విరాట్ కోహ్లి మైలురాయి టెస్టులో యువ విధ్వంసకారుడు రిషబ్ పంత్ (96) ధ్వంసరచన సాగించాడు. పంత్ దూకుడుతో మొహాలి టెస్టులో వైట్‌బాల్ వాతావరణం తళుక్కుమంది!. తెలుగు తేజం హనుమ విహారి (58), రవీంద్ర జడేజా (45 నాటౌట్) సహా విరాట్ కోహ్లి (45) రాణించటంతో తొలి రోజు భారత్ పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది.
- రాణించిన విహారి, జడేజా, కోహ్లి
- భారత్ తొలి ఇన్నింగ్స్ 357/6
నవతెలంగాణ-మొహాలి
రిషబ్ పంత్ (96, 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) విరుచుకుపడ్డాడు. శ్రీలంకపై బౌలర్లపై దండయాత్రతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు ఖాయం చేశాడు. మొహాలిలో ధనాధన్ మెరుపులతో కదం తొక్కిన రిషబ్ పంత్ తృటిలో శతకం చేజార్చుకున్నా.. ఆతిథ్య జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కెరీర్ వందో టెస్టు ఆడుతున్న విరాట్ కోహ్లి (45, 76 బంతుల్లో 5 ఫోర్లు) అర్థ శతకం ముంగిట నిరాశపరిచాడు. తెలుగు తేజం హనుమ విహారి (58, 128 బంతుల్లో 5 ఫోర్లు) అర్థ సెంచరీతో మెరువగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (45 నాటౌట్, 82 బంతుల్లో 5 ఫోర్లు) ఆకట్టుకునే ఇన్నింగ్స్‌తో రాణించాడు. శ్రీలంకతో తొలి టెస్టు తొలి రోజు భారత్ 357/6తో మెరుగ్గా నిలిచింది.
అదిరే ఆరంభం : స్పిన్ కీలక పాత్ర పోషించే పిచ్‌పై టాస్ నెగ్గిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఉదయం సెషన్లోనే ఓపెనర్లు రోహిత్ శర్మ (29, 28 బంతుల్లో 6 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (33, 49 బంతుల్లో 5 ఫోర్లు) ధాటిగా ఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆరు బౌండరీలు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం నమోదైన అనంతరం రోహిత్ శర్మ వికెట్ కోల్పోయాడు. డ్రింక్స్ విరామం అనంతరం మయాంక్ అగర్వాల్ సైతం వికెట్ పారేసుకున్నాడు. 80 పరుగులకు భారత్ ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది.
భారీ అంచనాల నడుమ కెరీర్ వందో టెస్టులో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లి (45) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చూడచక్కని కవర్ డ్రైవ్‌లతో మెప్పించిన విరాట్ కోహ్లి ఎక్కడా ఇబ్బంది పడలేదు. శ్రీలంక యువ స్పిన్నర్ లసిత్ మ్యాజిక్‌తో విరాట్ కోహ్లి మైలురాయి టెస్టులో త్వరగా నిష్క్రమించాడు. కోహ్లి వికెట్లను గిరాటేసిన లసిత్.. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. నం.3 బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం హనుమ విహారి (58) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో రాణించాడు. 93 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసిన విహారి.. మయాంక్, విరాట్లతో కలిసి కీలక భాగస్వామ్యాలను నిర్మించాడు. తొలి సెషన్‌ను 109/2తో, రెండో సెషన్‌ను 199/4తో భారత్ సంతృప్తికరంగా ముగించింది.
పంత్ దూకుడు : ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్ పంత్ (96) ఇన్నింగ్స్ స్వరూపం మార్చాడు. ఆరంభంలో నెమ్మదిగా పరుగులు రాబట్టిన పంత్.. అర్థ శతకం అనంతరం రెచ్చిపోయాడు. నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 73 బంతుల్లో అర్థ సెంచరీ బాదాడు. ఆ తర్వాత 24 బంతుల్లోనే 46 పరుగులు పిండుకున్నాడు. నాలుగు కండ్లుచెదిరే సిక్సర్లు బాదిన పంత్ మరోసారి శతకం తృటిలో చేజార్చుకున్నాడు. చివరి సెషన్లో జడేజాతో కలిసి పది ఓవర్లలోనే 80 పరుగులు రాబట్టిన పంత్ శ్రీలంక బౌలర్లపై స్పష్టమైన ఆధిపత్యం చెలాయించాడు. రవీంద్ర జడేజా (45 నాటౌట్) ఐదు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ (27) ఫర్వాలేదనిపించాడు. పుజారా, రహానె స్థానంలో విహారి, శ్రేయస్ తుది జట్టులో నిలువగా.. శుభ్‌మన్ గిల్ బెంచ్‌కు పరిమితం అయ్యాడు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : మయాంక్ అగర్వాల్ (ఎల్బీ) లసిత్ 33, రోహిత్ శర్మ (సి) లక్మల్ (బి) కుమార 29, హనుమ విహారి (బి) ఫెర్నాండో 58, విరాట్ కోహ్లి (బి) లసిత్ 45, రిషబ్ పంత్ (బి) లక్మల్ 96, శ్రేయస్ అయ్యర్ (బి) డిసిల్వ 27, రవీంద్ర జడేజా నాటౌట్ 45, రవిచంద్రన్ అశ్విన్ నాటౌట్ 10, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం : (85 ఓవర్లలో 6 వికెట్లకు) 357.
వికెట్ల పతనం : 1-52, 2-80, 3-170, 4-175, 5-228, 6-332.
బౌలింగ్ : సురంగ లక్మల్ 16-1-63-1, విశ్వ ఫెర్నాండో 16-1-69-1, లసిత్ 28-2-107-2, ధనంజయ డిసిల్వ 11-1-47-1, చరిత్ అసలంక 3.1-0-14-0.