Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుండెపోటుతో థారులాండ్‌లో తుది శ్వాస
- స్పిన్ మాంత్రికుడి మృతి పట్ల ప్రపంచ క్రికెట్ షాక్
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ రొడ్నీ విలియం మార్ష్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన స్పిన్ మాంత్రికుడు... గంటల వ్యవధిలోనే తుది శ్వాస విడిచి క్రికెట్ ప్రపంచాన్ని షాక్ చేశాడు. 52 ఏండ్ల క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ శుక్రవారం థారులాండ్‌లోని తన విల్లాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు!. షేన్ వార్న్ గుండె పోటుతో తుది శ్వాస విడిచినట్టు అతడి కుటుంబం ఓ ప్రకటనలో తెలిపింది. విజ్డెన్ శతాబ్దపు ఐదుగురు క్రికెటర్లలో ఒకడిగా నిలిచిన షేన్ వార్న్ 15 ఏండ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 708 టెస్టు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 1992-2007 సమయంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించిన షేన్ వార్న్.. 1999 ప్రపంచకప్ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. 'థారులాండ్‌లోని తన విల్లాలో షేన్ వార్న్ స్పందనలు లేకుండా కనిపించాడు. డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినా.. షేన్ వార్న్‌ను తిరిగి తీసుకురాలేకపోయారు. మరిన్ని వివరాలు త్వరలోనే అందిస్తాం. కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం' అని షేన్ వార్న్ మేనేజ్మెంట్ సంస్థ ప్రకటన విడుదల చేసింది.
స్పిన్ మాంత్రికుడు : వార్నీగా ప్రపంచ క్రికెట్‌కు సుపరిచితుడు. నిస్సందేహంగా ప్రపంచ క్రికెట్లో దిగ్గజం. 1990వ దశకంలో ఒంటిచేత్తో లెగ్‌స్పిన్ కళకు జీవం పోషిన మాంత్రికుడు. పాకిస్తాన్ అబ్దుల్ ఖాదిర్ లెగ్ స్పిన్‌ను సజీవంగా నిలిపినా.. లెగ్ స్పిన్‌కు దాడిచేసే లక్షణం జోడించిన మాంత్రికుడు షేన్ వార్న్. 1991-92లో భారత్‌పై అరంగ్రేటం చేసిన షేన్ వార్న్.. తొలి టెస్టులో తేలిపోయాడు. ఓ వికెట్‌కు ఏకంగా 150 పరుగులు సమర్పించుకున్నాడు. శ్రీలంకపై పూర్తి స్థాయి మాయజాలం ప్రదర్శించి ఆస్ట్రేలియాకు ఊహించని విజయం కట్టబెట్టాడు. కెరీర్ ఐదో టెస్టులోనే వెస్టిడీస్పై 1992-93 బాక్సింగ్ డే టెస్టులో ఏడు మ్యాచ్ విన్నింగ్ వికెట్లు కూల్చి సొంత మైదానం మెల్బోర్న్లో అద్వితీయ విజయాన్ని అందించాడు. ఆరంభంలో మ్యాజిక్ చూపించినా.. షేన్ వార్న్ దిగ్గజ ప్రస్థానానికి పునాది పడింది 1993 యాషెస్ సిరీస్‌లోనే. ఓల్డ్ ట్రాఫోర్డ్ తొలి టెస్టులోనే షేన్ వార్న్ ప్రపంచ క్రికెట్ ఆశ్చర్యపోయే మాయ చేశాడు. బాల్ ఆఫ్ ది సెంచరీతో మైక్ గెట్టింగ్ను బోల్తా కొట్టించిన వార్న్.. లెగ్‌సైడ్ నుంచి రెండు అడుగులు గిర్రున తిరుగుతూ వికెట్లను గిరాటేసిన ఆ బంతి ప్రపంచ క్రికెట్లో ఇప్పటికీ ప్రత్యేకమే. షేన్ వార్న్ మ్యాజిక్ దెబ్బకు ఆ తర్వాత పుష్కర కాలం యాషెస్ సిరీస్ విజయం ఆలోచనే ఇంగ్లాండ్‌కు దూరమైంది.
ఆటతో ఎంత ఆదరణ సాధించాడో, ఆటేతర వివాదాలతోనూ షేన్ వార్న్ ఎంతో పాపులర్. వివాదాలతో నిత్యం వార్తల్లో కనిపించేవాడు. సహచర ఆటగాడు మార్క్ వాతో కలిసి శ్రీలంక పర్యటన వివరాలను ఓ భారత బుక్ మేకర్‌కు చెప్పినందుకు భారీగా జరిమానాకు గురయ్యాడు. 2003లో నిషేధిత మాదక ద్రవ్యాలను తీసుకున్నందుకు ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. ఏడాది సస్పెన్షన్‌తో 2003 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. వ్యక్తిగత జీవితంలోని అంశాలతోనే వార్న్ ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. 2006-07 యాషెస్ సిరీస్‌తో షేన్ వార్న్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌ను చాంపియన్‌గా నిలిపిన షేన్ వార్న్.. ధనాధన్ లీగ్‌లో తనదైన ముద్ర వేశాడు.