Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెన్మార్క్‌పై 4-0తో విజయం
- డెవిస్ కప్ వరల్డ్ గ్రూప్1లో అడుగు
న్యూఢిల్లీ : గ్రాస్‌కోర్టులో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. డెవిస్ కప్ ప్రపంచ ప్లే ఆఫ్స్‌లో డెన్మార్క్‌పై ఏకపక్ష విజయం నమోదు చేసింది. 4-0తో ఘన విజయం సాధించిన భారత్ ప్రపంచ గ్రూప్1లోకి ప్రవేశించింది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన డెవిస్ కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్స్ పోరులో భారత్ 4-0తో గెలుపొందింది. తొలి రోజు 2-0 ఆధిక్యంతో ముందంజ వేసిన భారత్.. రెండో రోజు ఆటలో ఆధిక్యం నిలుపుకుంది. కీలక డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ జోడీ అంచనాలను అందుకుంది. తొలి సెట్లో భారత జోడీ తడబడినా.. తర్వాత వరుసగా రెండు సెట్లలో గొప్ప ప్రదర్శన చేసింది. రోహన్ బోపన్న బలమైన సర్వ్‌లు, బ్యాక్‌హ్యాండ్ విన్నర్లతో చెలరేగాడు. డెన్మార్క్ డబుల్స్ జోడీ ఫ్రెడరిక్ నీల్సన్, మైకల్లపై 6-7(3-7), 6-4, 7-6(7-4)తో బోపన్న, శరణ్‌లు గెలుపొందారు. తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయిన బోపన్న, దివిజ్.. నిర్ణయాత్మక మూడో సెట్‌ను టైబ్రేకర్‌లో గెల్చుకుని డెన్మార్క్ ఆశలు ఆవిరి చేశారు. డబుల్స్ రబ్బర్ విజయంతో 3-0తో భారత్ ప్రపంచ గ్రూప్1 బెర్త్ ఖాయం చేసుకుంది. తొలి రివర్స్ సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 5-7, 7-5, 10-7తో భారత్ విజయాన్ని 4-0కు మెరుగుపర్చాడు. నామమాత్రపు రెండో రివర్స్ సింగిల్స్ (ఐదో మ్యాచ్) ఆడలేదు.