Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవీంద్ర జడేజా షో చూపించాడు. మొహాలి టెస్టులో శ్రీలంక బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన రవీంద్ర జడేజా (175 నాటౌట్) నం.7 స్థానంలో భారత్‌కు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అజేయ శతకంతో చెలరేగిన రవీంద్ర జడేజా లోయర్ ఆర్డర్లో కీలక శతక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. వికెట్ల వేటలోనూ మాయ చూపిన జడేజా తొలి టెస్టులో భారత్‌ను తిరుగులేని స్థానంలో నిలిపాడు. భారత్ 574/8 వద్ద డిక్లరేషన్ ప్రకటించగా.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 108/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. శ్రీలంక మరో 466 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది.
- అజేయ 175 ఇన్నింగ్స్‌తో ధనాధన్
- అశ్విన్, జడ్డూ ఆల్‌రౌండ్ ప్రదర్శన
- పీకల్లోతు కష్టాల్లో లంకేయులు
నవతెలంగాణ-మొహాలి
రవీంద్ర జడేజా (175 నాటౌట్, 228 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదరగొట్టాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో శ్రీలంకతో తొలి టెస్టులో భారత్‌ను తిరుగులేని స్థానంలో నిలిపాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రవీంద్ర జడేజా అలవోకగా పరుగులు పిండుకున్నాడు. కెరీర్ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుతో కదం తొక్కాడు. రవిచంద్రన్ అశ్విన్ (61, 82 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ సెంచరీతో రాణించాడు. జడేజా ధనాధన్ షోతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది. 574/8 పరుగుల వద్ద డిక్లరేషన్ ప్రకటించింది. బంతితోనూ మ్యాజిక్ షో చేసిన అశ్విన్, జడేజా జోడీ శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టింది. ఈ ఇద్దరి దెబ్బకు శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయింది. 108/4తో కష్టాల్లో పడింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌కు ఇంకా 466 పరుగుల వెనుకంజలో నిలిచింది.
జడేజా ధనాధన్ : ఓవర్‌నైట్ స్కోరు 45తో రెండో రోజు క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా మొహాలీలో భారత్ పొజిషన్‌ను మార్చివేశాడు. సహచర స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (61)తో 130 పరుగులు, పేసర్ మహ్మద్ షమి (20)తో 103 పరుగుల శతక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. లోయర్ ఆర్డర్లో రెండు శతక భాగస్వామ్యాలతో మ్యాచ్‌పై భారత్ తిరుగులేని పట్టు సాధించింది. జడేజా, అశ్విన్ జోడీ అలవోకగా పరుగులు పిండుకుంది. ఆరు ఫోర్లతో 87 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన జడేజా.. పది ఫోర్లతో 160 బంతుల్లో శతక మార్క్ చేరుకున్నాడు. మరో ఎండ్‌లో అశ్విన్ ఆరు ఫోర్లతో 67 బంతుల్లో అర్థ శతకం నమోదు చేశాడు. శతకం అనంతరం వేగం పెంచిన జడేజా 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 211 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. మహ్మద్ షమితో తొలి 50 పరుగుల భాగస్వామ్యంలో షమి ఒక్క పరుగూ చేయలేదు. ఆ స్థాయిలో జడేజా వన్‌మ్యాన్ షో చూపించాడు. ద్వి శతకానికి మరో 25 పరుగుల దూరంలో ఉన్న తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్ ఇచ్చాడు. శ్రీలంక బౌలర్లను చితకబాదిన రవీంద్ర జడేజా వైట్ బాల్ ఫామ్‌ను రెడ్బాల్పైనా కొనసాగించాడు. మొహాలిలో భారత్ మరోసారి బ్యాట్ పట్టాల్సిన పని లేకుండా చేశాడు!.
తిప్పేశారు : సరైన సమయంలో ఇన్నింగ్స్ డిక్లరేషన్‌తో తొలి టెస్టుపై భారత్ పట్టు సాధించింది. ఇన్నింగ్స్ తొలి పది ఓవర్లలోనే రోహిత్ శర్మ నలుగురు ప్రధాన బౌలర్లను ప్రయోగించాడు. పిచ్ ఎలా స్పందిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేసి.. శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టాడు. ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. కరుణరత్నె (28), తిరిమానె (17) తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. ట్రంప్‌కార్డ్ స్పిన్నర్ అశ్విన్ కట్టుదిట్టమైన బంతులతో తిరిమానెను ఇరకాటంలో పడేశాడు. అశ్విన్ సంధించిన 37వ బంతికి పడిపోయిన తిరిమానె తొలి వికెట్ రూపంలో నిష్క్రమించాడు. అశ్విన్ ఎండ్ నుంచి బంతి అందుకున్న జడేజా వస్తూనే వికెట్ తీశాడు. నిలదొక్కుకున్న బ్యాటర్ కరుణరత్నెను సాగనంపాడు. సీనియర్ బ్యాటర్ ఎంజెలో మాథ్యూస్ (22) భరతం బుమ్రా పట్టాడు. ఓ ఫోర్, సిక్సర్‌తో మెరిసిన మాథ్యూస్‌ను బుమ్రా ఎల్బీగా అవుట్ చేశాడు. రెండో రోజు చివర్లో మరోసారి బంతి అందుకున్న అశ్విన్ ఈసారి డిసిల్వ (1)ను సాగనంపాడు. నిశాంక (26 నాటౌట్, 75 బంతుల్లో 4 ఫోర్లు) బుమ్రా అవుట్ చేసినా.. మూడో అంపైర్ ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి నిశాంకతో చరిత్ అసలంక (1 నాటౌట్, 12 బంతుల్లో) అజేయంగా ఆడుతున్నాడు. పిచ్ స్పిన్‌కు సహకరిస్తున్న వేళ నేడు భారత స్పిన్ దాడికి ఎదురొడ్డి నిలువటం లంకేయులకు గగనమే. నేడు ఉదయం సెషన్లోనే శ్రీలంక తొలి ఇన్నింగ్స్ కథ ముగించి.. ఫాలోఆన్ ఆడించే ఆలోచనలో టీమ్ ఇండియా కనిపిస్తోంది.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : మయాంక్ (ఎల్బీ) లసిత్ 33, రోహిత్ శర్మ (సి) లక్మల్ (బి) కుమార 29, విహారి (బి) ఫెర్నాండో 58, కోహ్లి (బి) లసిత్ 45, పంత్ (బి) లక్మల్ 96, శ్రేయస్ (ఎల్బీ) డిసిల్వ 27, జడేజా నాటౌట్ 175, అశ్విన్ (సి) తిరిమానె (బి) లక్మల్ 61, జయంత్ (సి) తిరిమానె (బి) ఫెర్నాండో 2, షమి నాటౌట్ 20, ఎక్స్‌ట్రాలు : 28, మొత్తం :(129.2 ఓవర్లలో 8 వికెట్లకు) 574 డిక్లేర్డ్.
వికెట్ల పతనం : 1-52, 2-80, 3-170, 4-175, 5-228, 6-332, 7-462, 8-471.
బౌలింగ్ : లక్మల్ 25-1-90-2, ఫెర్నాండో 26-1-135-2, కుమార 10.5-1-52-1, లసిత్ 46-3-188-2, డిసిల్వ 18.2-1-79-1, అసలంక 3.1-0-14-0.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : కరుణరత్నె (ఎల్బీ) జడేజా 28, తిరిమానె (ఎల్బీ) అశ్విన్ 17, నిశాంక నాటౌట్ 26, మాథ్యూస్ (ఎల్బీ) బుమ్రా 22, డిసిల్వ (ఎల్బీ) అశ్విన్ 1, అసలంక నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (43 ఓవర్లలో 4 వికెట్లకు) 108.
వికెట్ల పతనం : 1-48, 2-59, 3-96, 4-103.
బౌలింగ్ : మహ్మద్ షమి 7-3-17-0, బుమ్రా 9-2-20-1, అశ్విన్ 13-6-21-2, జయంత్ 5-2-14-0, జడేజా 9-3-30-1