Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి టెస్టులో భారత్ అపూర్వ విజయం
- రవీంద్ర జడేజా, అశ్విన్ మాయజాలం
- మూడోరోజే చేతులెత్తేసిన శ్రీలంక
విరాట్ వందో టెస్టులో భారత్ అఖండ విజయం. స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్ మ్యాజిక్ షోతో శ్రీలంక కుప్పకూలింది. మూడో రోజు 16 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. ఇన్నింగ్స్ 222 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందించారు. అజేయ 175 ఇన్నింగ్స్ సహా 9 వికెట్లు నేలకూల్చిన స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మొహాలి టెస్టులో విజయంతో భారత్ టెస్టు సిరీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
నవతెలంగాణ-మొహాలి : భారత స్పిన్ మ్యాజిక్‌తో శ్రీలంక మతి పోయింది!. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంకను 174కు కుప్పకూల్చిన భారత్, లంకేయులను ఫాలోఆన్‌లోనూ వదల్లేదు. జడేజా, అశ్విన్ మాయజాలం కొనసాగటంతో రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్)లోనూ శ్రీలంక 178 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 574/8 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్.. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన రవీంద్ర జడేజా మొహాలీలో హ్యాట్రిక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. భారత్, శ్రీలంక రెండో టెస్టు (డే నైట్) బెంగళూర్‌లో ఆదివారం నుంచి ఆరంభం కానుంది.
జడేజా ఐదేశాడు: ఓవర్‌నైట్ స్కోరు 108/4తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక ఉదయం సెషన్లోనే చేతులెత్తేసింది. రెండో రోజు చివరి సెషన్లో టాప్ ఆర్డర్‌ను కోల్పోయిన శ్రీలంక.. మూడో రోజు ఉదయం భారత స్పిన్ పదును ముందు తేలిపోయింది. వికెట్ కీపర్ బ్యాటర్ పథున్ నిశాంక (61 నాటౌట్, 133 బంతుల్లో 11 ఫోర్లు) ఓ ఎండ్‌లో అజేయ అర్థ సెంచరీతో పోరాడినా.. మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. జడేజా (5/41) ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. అశ్విన్, బుమ్రా, రెండేసి వికెట్లు తీసుకున్నారు. 65 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలిన శ్రీలంక మరో 400 పరుగుల వెనుకంజలో నిలిచింది. దీంతో శ్రీలంకను ఫాలోఆన్‌కు పిలిచాడు రోహిత్ శర్మ .
అశ్విన్, జడేజా చెరో 4 : ఫాలోఆన్‌లోనూ శ్రీలంక కథ మారలేదు. నిరోశన్ డిక్వెల్లా (51 నాటౌట్, 81 బంతుల్లో 9 ఫోర్లు) ఓ ఎండ్‌లో అజేయ అర్థ సెంచరీతో పోరాడినా.. సహచర బ్యాటర్లలో ఎవరూ నిలువలేదు. అసలంక (20), డిసిల్వ (30), కరుణరత్నె (27) ప్రతిఘటన ఎంతో సేపు కొనసాగలేదు. రవీంద్ర జడేజా (4/46), అశ్విన్ (4/47) నాలుగు వికెట్ల ప్రదర్శనతో 60 ఓవర్లలోనే శ్రీలంక 178 పరుగులకు కుప్పకూలింది. 222 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
భారత్ తొలి ఇన్నింగ్స్ : 574/8 డిక్లేర్డ్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 174/10
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ : లహిరు తిరిమానె (సి) రోహిత్ (బి) అశ్విన్ 0, కరుణరత్నె (సి) పంత్ (బి) షమి 27, నిశాంక (సి) పంత్ (బి) అశ్విన్ 6, మాథ్యూస్ (ఎల్బీ) జడేజా 28, డిసిల్వ (సి) అయ్యర్ (బి) జడేజా 30, చరిత్ అసలంక (సి) కోహ్లి (బి) అశ్విన్ 20, నిరోషన్ డిక్వెల్లా నాటౌట్ 51, సురంగ లక్మల్ (సి) యాదవ్ (బి) జడేజా 0, లసిత్ (సి) పంత్ (బి) జడేజా 2, విశ్వ ఫెర్నాండో (ఎల్బీ) షమి 0, లహిరు కుమార (సి) షమి (బి) అశ్విన్ 4, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం :(60 ఓవర్లలో ఆలౌట్) 178.
వికెట్ల పతనం : 1-9, 2-19, 3-45, 4-94, 5-121, 6-121, 7-121, 8-153, 9-170, 10-178.
బౌలింగ్ : అశ్విన్ 21-5-47-4, మహ్మద్ షమి 8-1-48-2, రవీంద్ర జడేజా 16-5-46-4, జయంత్ యాదవ్ 11-3-21-0, జశ్‌ప్రీత్ బుమ్రా 4-1-7-0.