Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్‌పై భారత్ జయభేరి
- మంధాన, పూజ, స్నేహ మెరుపుల్
- ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2022
నవతెలంగాణ-మౌంట్ మంగానురు
మహిళా భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ వేటను ఘనంగా మొదలుపెట్టింది. పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో 108 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన టీమ్ ఇండియా ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. 245 పరుగుల ఛేదనలో పాకిస్థాన్‌ను 137 పరుగులకే కుప్పకూల్చిన మిథాలీసేన.. ఎదురులేని విజయం నమోదు చేసింది. రాజేశ్వరి గైక్వాడ్ (4/31), జులన్ గోస్వామి (2/26), స్నేహ రాణా (2/27) వికెట్ల వేటలో చెలరేగారు. పూజ వస్ట్రాకర్ (67, 59 బంతుల్లో 8 ఫోర్లు), స్నేహ రాణా (53 నాటౌట్, 48 బంతుల్లో 4 ఫోర్లు), స్మృతీ మంధాన (52, 75 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగుల భారీ స్కోరు సాధించింది. లోయర్ ఆర్డర్లో మ్యాచ్‌ను మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడిన పూజ వస్ట్రాకర్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకుంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో మార్చి 10న ఆతిథ్య న్యూజిలాండ్‌తో తలపడనుంది.
కుప్పకూల్చారు : పాక్ ముందున్న లక్ష్యం 245 పరుగులు. ఛేదనలో ఆ జట్టుకు గట్టి బలహీనతను భారత్ సొమ్ము చేసుకుంది. పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్‌లో ఏ బ్యాటర్‌ను సైతం క్రీజులో కుదురుకోనివ్వలేదు. సీనియర్ పేసర్ జులన్ గోస్వామి, స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ వికెట్ల వేటలో విజృంభించటంతో పాకిస్థాన్ బ్యాటర్లు విలవిల్లాడారు. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్లో ఓపెనర్ సిద్రా ఆమీన్ (30) మినహా మరో బ్యాటర్ పరుగుల వేటలో ఆకట్టుకోలేదు. జావెరియ ఖాన్ (11), బిష్మా మరూఫ్ (15), ఒమైమా సోహైల్ (5), నిదా దార్ (4), అలియా రియాజ్ (11)లు చేతులెత్తేశారు. లోయర్ ఆర్డర్లో డయాన బేగ్ (24) కాస్త ప్రతిఘటించటంతో పాకిస్థాన్ వంద పరుగుల స్కోరు చేయగల్గింది. ఫాతిమా సనా (17), సిద్రా నవాజ్ (12)లు సైతం ఒత్తిడికి చిత్తయ్యారు. 43 ఓవర్లలో పాకిస్థాన్ 137 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి (2/26), రాజేశ్వరి గైక్వాడ్ (4/31), స్నేహ రాణా (2/27)లు పాకిస్థాన్ పతనాన్ని శాసించారు.
కదం తొక్కారు : టాస్ నెగ్గిన టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పొరుగు దేశంపై భారీ స్కోరు సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన మిథాలీసేనకు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. యువ విధ్వంసక బ్యాటర్ షెఫాలీ వర్మ (0) సున్నా పరుగులకే వికెట్ పారేసుకుంది. ఓపెనర్ నిష్క్రమణతో స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన (52), దీప్తి శర్మ (40, 57 బంతుల్లో 2 ఫోర్లు) ఆచితూచి బ్యాటింగ్ చేశారు. మంధాన, దీప్తిలు రెండో వికెట్‌కు 92 పరుగుల సమయోచిత భాగస్వామ్యం నెలకొల్పారు. మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 71 బంతుల్లో మంధాన అర్థ సెంచరీ పూర్తి చేసింది. స్వల్ప వ్యవధిలోనే దీప్తి, మంధానలు నిష్క్రమించగా.. మిడిల్ ఆర్డర్ ఈ ఇద్దరిని అనుసరించింది. కెప్టెన్ మిథాలీరాజ్ (9), సీనియర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ (5), రిచా ఘోష్ (1) నిరాశపరిచారు. 96/1తో పటిష్టంగా కనిపించిన భారత్ వరుస వికెట్ల దెబ్బకు 114/6తో కష్టాల్లో కూరుకుంది.
మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో లోయర్ ఆర్డర్‌పై విపరీత ఒత్తిడి నెలకొంది. దాయాది దేశంతో మ్యాచ్ కావటంతో పరుగుల వేట సైతం కష్టంగానే సాగింది. ఈ పరిస్థితుల్లో స్నేహ రాణా (53), పూజ వస్ట్రాకర్ (67) జోడీ అద్వితీయ ఇన్నింగ్స్‌లతో కదం తొక్కింది. ఏడో వికెట్‌కు 122 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జోడీ భారత్‌ను మెరుగైన స్థితిలో నిలిపింది. వేగంగా పరుగులు పిండుకున్న ఈ జోడీ స్కోరు బోర్డును ఉరుకులు పెట్టించింది. స్నేహ నాలుగు ఫోర్లతో 45 బంతుల్లో అర్థ సెంచరీ బాదగా.. పూజ వస్ట్రాకర్ ఆరు ఫోర్లతో 48 బంతుల్లో అర్థ సెంచరీ మార్క్ చేరుకుంది. టాప్ ఆర్డర్లో మంధాన, దీప్తి జోడీ.. లోయర్ ఆర్డర్లో స్నేహ, పూజ జోడీ రాణించటంతో తొలుత భారత్ ఏడు వికెట్ల నష్టానికి 244 పరుగుల భారీ స్కోరు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో నష్ర సంధు (2/36), నిదా దార్ (2/45) రాణించారు.
భారత మహిళల ఇన్నింగ్స్ : స్మృతీ మంధాన (సి,బి) ఆనం ఆమిన్ 52, షెఫాలీ వర్మ (బి) డయాన బేగ్ 0, దీప్తి శర్మ (బి) నష్ర సంధు 40, మిథాలీరాజ్ (సి) బేగ్ (బి) నష్ర సంధు 9, రిచా ఘోష్ (బిక్ష్మి నిదా దార్ 1, స్నేహ రాణా నాటౌట్ 53, పూజ వస్ట్రాకర్ (బి) ఫాతిమా సనా 67, జులన్ గోస్వామి నాటౌట్ 6, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం :(50 ఓవర్లలో 7 వికెట్లకు) 244.
వికెట్ల పతనం : 1-4, 2-96, 3-98, 4-108, 5-112, 6-114, 7-236.
బౌలింగ్ : డయాన బేగ్ 10-1-61-1, ఆనం ఆమిన్ 10-1-43-1, నిదా దార్ 10-1-45-2, ఫాతిమా సనా 10-0-58-1, నష్ర సంధు 10-0-36-2.
పాకిస్థాన్ మహిళల ఇన్నింగ్స్ : సిద్ర ఆమీన్ (సి) రిచా (బి) గోస్వామి 30, జావెరియ ఖాన్ (సి) గోస్వామి (బి) రాజేశ్వరి 11, బిష్మా మరూఫ్ (సి) రిచా (బి) దీప్తి 15, ఒమైనా సొహైల్ (సి) దీప్తి (బి) స్నేహ 5, నిదా దార్ (సి) రిచా (బి) గోస్వామి 4, అలియా రియాజ్ (స్టంప్డ్) రిచా (బి) రాజేశ్వరి 11, ఫాతిమా సనా (ఎల్బీ) రాజేశ్వరి 17, సిద్రా నవాజ్ (ఎల్బీ) రాజేశ్వరి 12, డయాన బేగ్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) మేఘన సింగ్ 24, నష్ర సంధు (సి) రిచా (బి) స్నేహ 0, ఆనం ఆమీన్ నాటౌట్ 5, ఎక్స్‌ట్రాలు : 3, మొత్తం : (43 ఓవర్లలో ఆలౌట్) 137.
వికెట్ల పతనం : 1-28, 2-53, 3-58, 4-67, 5-70, 6-87, 7-98, 8-113, 9-114, 10-137.
బౌలింగ్ : జులన్ గోస్వామి 10-1-26-2, మేఘన సింగ్ 7-3-21-1, రాజేశ్వరి గైక్వాడ్ 10-0-31-4, దీప్తి శర్మ 7-0-31-1, స్నేహ రాణా 9-0-27-2.