Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పింక్ బాల్ టెస్టుకు జట్టులోకి ఎంపిక
ముంబయి : గాయం నుంచి కోలుకున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ భారత జట్టులోకి తిరిగి అడుగుపెట్టాడు. కోవిడ్-19 వైరస్ బారిన పడిన అక్షర్ పటేల్, అదే సమయంలో కాలు గాయానికి సైతం గురయ్యాడు. శ్రీలంకతో తొలి టెస్టుకు దూరమైన అక్షర్ పటేల్.. బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. బీసీసీఐ వైద్య బృందం అక్షర్ పటేల్ ఫిట్‌నెస్‌పై గ్రీన్ సిగల్ ఇవ్వటంతో ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ టెస్టు జట్టులోకి ఎంపిక చేసింది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అద్వితీయ ప్రదర్శన చేసిన అక్షర్ పటేల్.. బెంగళూర్ పింక్ బాల్ టెస్టులో నేరుగా తుది జట్టులోకి రానున్నాడు. అక్షర్ పటేల్ స్థానంలో తొలి టెస్టుకు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యాడు. ముగ్గురు స్పిన్నర్లు తుది జట్టులో నిలిచిన ఆ టెస్టులో కుల్దీప్ యాదవ్ బెంచ్‌కు పరిమితం అయ్యాడు. అశ్విన్, జడేజాలు కలిసి 15 వికెట్లు కూల్చిన టెస్టులో.. మూడో స్పిన్నర్‌గా ఆడిన జయంత్ యాదవ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్ పడగొట్టలేదు. కుల్దీప్ యాదవ్ ఆడిన చివరి టెస్టులో మంచి ప్రదర్శన చేసినా.. తుది జట్టులో స్పిన్ ఆల్రౌండర్లకు ప్రాధాన్యత లభిస్తోంది. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జయంత్ యాదవ్‌లు కుల్దీప్ యాదవ్‌ను వెనక్కి నెట్టి తుది జట్టు రేసులో ముందుంటున్నారు. ఇటీవల మూడు ఫార్మాట్లలో భారత జట్టులోకి ఎంపికైన కుల్దీప్ యాదవ్ ఏ ఫార్మాట్లోనూ తుది జట్టులో చోటు దక్కించుకోలేదు.