Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింధు, శ్రీకాంత్ ముందంజ
- డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్
బెర్లిన్ (జర్మనీ) : డెన్మార్క్ ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ అగ్ర క్రీడాకారులు శుభారంభం చేశారు. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి సింధు, ప్రపంచ చాంపియన్‌షిప్స్ రజత పతక విజేత కిదాంబి శ్రీకాంత్‌లు డెన్మార్క్ ఓపెన్‌లో ముందంజ వేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి రౌండ్ మ్యాచుల్లో తెలుగు తేజాలు కదం తొక్కారు. మూడు గేముల ఉత్కంఠ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ పైచేయి సాధించగా.. ఏకపక్ష పోరులో పి.వి సింధు ధనాధన్ జోరు చూపించింది. కోవిడ్-19తో ఇండియా ఓపెన్ సిరీస్‌కు దూరమైన కిదాంబి శ్రీకాంత్.. డెన్మార్క్‌లో కాస్త ఇబ్బంది పడ్డాడు. పురుషుల సింగిల్స్‌లో 48 నిమిషాల తొలి రౌండ్ మ్యాచ్‌లో వరల్డ్ నం.39 లెవారెడ్జ్ (ఫ్రాన్స్)పై 21-10, 13-21, 21-7తో శ్రీకాంత్ విజయం సాధించాడు. తొలి గేమ్‌లో అలవోక విజయం నమోదు చేసిన శ్రీకాంత్.. రెండో గేమ్‌లో తడబడ్డాడు. ప్రత్యర్థికి ఓ గేమ్ కోల్పోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో పుంజుకుని రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఫ్రాన్స్ ఆటగాడిపై ముఖాముఖి రికార్డును 4-0తో మెరుగు పర్చుకున్నాడు.
మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ పి.వి సింధుకు ఎదురులేదు. థారులాండ్ షట్లర్ బుసానన్‌పై 21-8, 21-7తో చెమట పట్టకుండా గెలుపొందింది. వరల్డ్ నం.11 బుసానన్‌పై 15వ విజయం నమోదు చేసిన సింధు.. తొలి రౌండ్లో ఏ మాత్రం కష్టపడలేదు. తొలి గేమ్‌లో 11-4తో దూసుకెళ్లిన సింధు.. రెండో గేమ్‌లో 7-5తో నిలిచినా.. ఆ తర్వాత ఎక్కడా బుసానన్కు చాన్స్ ఇవ్వలేదు. చూస్తుండగానే మ్యాచ్‌ను లాగేసుకున్న సింధు అలవోకగా రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సాయి ప్రతీక్, సిక్కి రెడ్డి జంట పోరాడి ఓడింది. 19-21, 8-21తో థారులాండ్ జోడీ చేతిలో వరుస గేముల్లో ఓటమి పాలైంది. మరో మ్యాచ్‌లో ధ్రువ్ కపిల, గాయత్రి గోపీచంద్ జంట 19-21, 19-21తో ఇండోనేషియా జోడీతో పోరాడి ఓడింది. రెండు గేముల్లోనూ గట్టి పోటీనిచ్చిన గాయత్రి, ధ్రువ్ జోడీ చివర్లో తడబడింది. మహిళల డబుల్స్‌లో హరిత, అశ్న రారు జోడీ 9-21, 10-21తో ఇటలీ అమ్మాయిల చేతిలో చేతులెత్తేశారు.