Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2017, 2020 ఐసీసీ ప్రపంచకప్‌లలో ఫైనల్స్‌కు చేరినా.. టీమ్ ఇండియా తుది మెట్టుపై తడబడింది. ఐసీసీ ఈవెంట్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఆధిపత్యానికి గండికొట్టే దీటైన జట్టుగా భారత్ నిలిచింది. ఆ జోరు ఎంతో కాలం నిలువలేదు. కరోనా అనంతరం వరుసగా నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పరాజయం మూటగట్టుకుంది. ఐసీసీ 2022 వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ సరైన రీతిలో సన్నద్ధం కాలేదనే అనిపించింది. కప్పు వేటలో తొలి పోరులోనే భారత్‌కు విలువైన అస్త్రాలు దొరికాయి. స్నేహ్ రాణా, పూజ వస్ట్రాకర్ రూపంలో ఇద్దరు ఫినీషర్లు భారత్ ఆత్మ విశ్వాసం పెంచారు.
- స్నేహ్, పూజ రూపంలో ఫినీషర్లు
- ప్రపంచకప్ వేటలో ఆత్మవిశ్వాసం
నవతెలంగాణ క్రీడావిభాగం
2021 భారత మహిళల క్రికెట్‌కు అత్యంత గడ్డు రోజులు. యువ క్రికెటర్లు స్నేV్‌ా రాణా, పూజ వస్ట్రాకర్లకు సైతం గత ఏడాది అత్యంత కష్టంగా సాగింది. 2020 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ అనంతరం ఏడాది పాటు భారత మహిళలు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టలేదు. ఆ తర్వాత జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌ల్లో వరుస పరాజయాలు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ దెబ్బకొట్టగా.. విదేశాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో దారుణ పరాజయాలు ఎదురయ్యాయి. మోకాలి గాయంతో గత ఐదేండ్లుగా స్నేహ్ రాణా కెరీర్ అనిశ్చితిలో కొనసాగుతుండగా.. నిలకడ లేని ఫామ్‌తో పూజ వస్ట్రాకర్ జట్టులో చోటును ప్రశ్నార్థకం చేసుకుంది. వరుస సిరీస్ వైఫల్యాలు భారత్ మానసిక స్థైర్యంపై ప్రతికూల ప్రభావం చూపినా.. పరాజయాల్లోనూ పస ఉన్న క్రికెటర్లను అన్వేషించేందుకు ఆ సిరీస్‌లు గొప్పగా ఉపయోగపడ్డాయి. 2022 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు భారత జట్టు రూపకల్పనకు ఈ సిరీస్‌లనే పరిగణనలోకి తీసుకున్నారు. ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే అద్వితీయ విజయం సాధించిన భారత్.. వరల్డ్‌కప్ వేటను గొప్పగా ఆరంభించింది. మార్చి 10న ఆతిథ్య న్యూజిలాండ్‌తో ఢకొీట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు దక్కిన ఇద్దరు విలువైన ఫినీషర్ల గురించి చూద్దాం.
టెస్టుల్లో మెరిసి..! : ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టులో భారత్ పరాజయం ఖాయమని మూడో రోజే తేలిపోయింది. కానీ నాల్గోరోజు పరిస్థితులు అందుకు పూర్తి భిన్నం. యువ ప్లేయర్ స్నేV్‌ా రాణా అసమాన పోరాటంతో క్రీజులో నిలిచింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అజేయంగా 80 పరుగుల ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. మహిళల టెస్టు ఫార్మాట్‌ను ఐదు రోజులకు పెంచాలనే డిమాండ్‌కు స్నేహ్ రాణా ఇన్నింగ్స్ ఊతం అందించింది. ఇదే సమయంలో పూజ వస్ట్రాకర్ అటు విదేశీ పర్యటనల్లో, ఇటు సొంతగడ్డపై లోయర్ ఆర్డర్లో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడుతూనే ఉంది. జట్టు ప్రణాళికల్లో ఈ ఇద్దరు బౌలింగ్‌లో కీలకం. నాణ్యమైన బౌలింగ్‌పై, విదేశీ పరిస్థితుల్లో సైతం, అగ్రజట్లపై అద్భుత ఇన్నింగ్స్‌లు నమోదు చేయగల నైపుణ్యం స్నేహ్ రాణా, పూజ వస్ట్రాకర్‌లు సాధించటం భారత్‌కు సమయానికి చేతికందిన వజ్రాయుధం!.
వాస్తవానికి భారత జట్టులో దీప్తి శర్మ మినహా మరో మెరుగైన ఆల్‌రౌండర్ లేరు. లోయర్ ఆర్డర్లో నిలకడగా పరుగులు సాధించగల బ్యాటర్ దీప్తి శర్మ మాత్రమే. మిడిల్ ఆర్డర్లో ఎవరూ నిలకడగా రాణించటం లేదు. నం.3 బ్యాటర్ నిత్య ప్రయోగంగా మారింది. స్మృతీ మంధానకు సరైన ఓపెనింగ్ జోడీకి ఇంకా సమాధానమే లేదు. కొంత కాలంగా భారత్ ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పాకిస్థాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో సమాధానం దొరికినట్టే అనిపిస్తోంది. మరో 17 ఓవర్లు ఉన్న తరుణంలో 114/6తో భారత్ కష్టాల్లో కూరుకుంది. ఓపెనర్ మంధాన 52 పరుగుల ఇన్నింగ్స్‌తో రాణించగా.. దీప్తితో కలిసి రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం జోడించింది. ఈ సమయంలో రాణా, వస్ట్రాకర్ ఇరు జట్ల నడుమ వ్యత్యాసంగా నిలిచారు. 200 లోపు స్కోరుకే పరిమితం అయ్యేలా కనిపించిన భారత్ 224/7 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఏడో వికెట్‌కు స్నేV్‌ా రాణా, పూజ వస్ట్రాకర్ జోడీ 122 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసింది. మహిళల ప్రపంచకప్‌లో ఇది ప్రపంచ రికార్డు. కఠిన పరిస్థితుల్లో జట్టుకు 180-200 స్కోరు అందించేందుకు జతకట్టిన ఈ జోడీ.. గొప్పగా రాణించింది. 122 పరుగుల భాగస్వామ్యంలో ఏకంగా 69 పరుగులు వికెట్ల నడుమే వచ్చాయి. 48 పరుగులు మాత్రమే బౌండరీల నుంచి రాబట్టారు. ఒత్తిడిలో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన రాణా, వస్ట్రాకర్‌లు అసమాన అర్థ సెంచరీలు సాధించారు. లోయర్ ఆర్డర్లో స్నేV్‌ా, పూజ ముగింపు నైపుణ్యంతో భారత్‌కు కొండంత బలం తోడైంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మిథాలీసేన ఆ ఉత్సాహం ఫలితంలో చూపించటం లాంఛనమే!.