Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పిన్ దిగ్గజం వార్న్‌పై అశ్విన్
బెంగళూర్ : నమ్మశక్యం కాని లెగ్ స్పిన్‌తో ప్రపంచ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను గావించిన స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్. స్నేహితులతో కలిసి థారులాండ్ విహారంలో ఆకస్మిక గుండెపోటుతో షేన్ వార్న్ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. 52 ఏండ్ల దిగ్గజ క్రికెటర్ కన్నుమూసిన నిజాన్ని క్రికెట్ ప్రపంచం ఇంకా జీర్ణించుకోలేకపోతుంది. స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌కు భారత ట్రంప్‌కార్డ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నివాళి అర్పించాడు. ' ప్రపంచ క్రికెట్ చిత్ర పటంలో స్పిన్ బౌలింగ్‌ను ముందుకు నడిపించిన ఫ్లాగ్ బేరర్ షేన్ వార్న్. ప్రపంచ క్రికెట్లో అత్యధిక వికెట్లు కూల్చిన ముగ్గురు బౌలర్లు స్పిన్నర్లే. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లేలు ఆ ఘనత సాధించారు. వార్న్‌ది ఆసక్తికర స్వభావం. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్లు వార్న్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. షేన్ వార్న్ స్పిన్ దిగ్గజం. స్పిన్ బౌలింగ్ కళను షేన్ వార్న్ తిరిగి రాశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 1000కి పైగా వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనతను అతి తక్కువ మందే సాధించగలరు. స్పిన్ బౌలింగ్‌కు ఎదురుదాడి అస్త్రాన్ని జోడించిన యోధుడు షేన్ వార్న్. అందరూ మైక్ గాటింగ్‌కు వార్న్ సంధించిన బంతి గురించి చెబుతుంటారు. కానీ నా వరకు 2005 యాషెస్‌లో అండ్రూ స్ట్రాస్‌కు వార్న్ సంధించిన బంతి అత్యుత్తమం' అని అశ్విన్ తన యూట్యూబ్ చానల్లో చెప్పుకొచ్చాడు.