Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రికెట్ నిబంధనల్లో విప్లవాత్మక మార్పులు!. ఇప్పటివరకు మనం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని భావిస్తున్న అంశాలు.. సాధారణ నిబంధనలుగా మారనున్నాయి. కరోనా వైపరిత్యంతో మరికొన్ని కీలక మార్పులు అనివార్యం కాగా.. త్వరలోనే ప్రపంచ క్రికెట్ నూతన శోభను సంతరించుకోనుంది!. మార్లీబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) 9 విప్లవాత్మక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నూతన నిబంధనలు, మారనున్న క్రికెట్ స్వరూపంపై ఓ లుక్కేద్దాం.
- బంతిపై ఉమ్మి రాయటం నిషేధం
- ఎంసీసీ క్రికెట్ రూల్స్ మార్పు
నవతెలంగాణ-న్యూఢిల్లీ
1. రూల్ 1-ప్రత్యామ్నాయ ఆటగాళ్లు
చట్టం 1.3 ప్రకారం కొత్త క్లాజ్‌ను పొందుపరిచారు. మ్యాచ్‌లో ఓ ఆటగాడికి ప్రత్యామ్నాయ ప్లేయర్‌ను ఆడించాల్సి వచ్చినప్పుడు.. ఆ ఆటగాడికి కొత్త ప్లేయర్‌గా పరిగణించరు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఆటగాడిని నూతన ఆటగాడిగా చూస్తున్నాం. కానీ ఇప్పుడు పాత ఆటగాడి మ్యాచ్ గణాంకాలు కొత్త ఆటగాడికి వర్తిస్తాయి.
2. రూల్ 18 -బ్యాటర్ల క్యాచౌట్ నిష్క్రమణ
చట్టం 18.11ను మార్చారు. బ్యాటర్ క్యాచౌట్‌గా నిష్క్రమిస్తే నూతన ఆటగాడు స్ట్రయిక్ తీసుకోవాలి. గతంలో బంతి గాల్లోకి లేవగా.. ఈలోగా నాన్‌స్ట్రయికర్ సగం పిచ్‌ను దాటేస్తే అతడు స్ట్రయిక్ తీసుకునేవాడు. ఇప్పుడు ఈ నిబంధనలో మార్పు చేశారు. క్యాచౌట్‌గా నిష్క్రమించినప్పుడు నూతన బ్యాటర్ కచ్చితంగా స్ట్రయిక్ తీసుకోవాలి. ఓవర్ చివరి బంతికి బ్యాటర్ క్యాచౌట్ అయితే మాత్రమే.. నాన్ స్ట్రయికర్‌కు తర్వాతి బంతిని ఎదుర్కొనే అవకాశం లభించనుంది.
3. రూల్ 20.4.2.12 - డెడ్ బాల్ :
ఆట సమయంలో ఇరు జట్లలో ఎవరికైనా ఏదేని వ్యక్తి, వస్తువు, ఇతర పరికరాలు ఆటంకం కలిగిస్తే ఆ బంతిని డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు. కొన్నిసార్లు గ్రౌండ్లోకి ఔత్సాహిక అభిమానులు, శునకాలు రావటం సహజం. కెమెరాకు సైతం కొన్నిసార్లు బంతి తగులుతుంది. గతంలో ఈ బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించేవారు కాదు. నూతన నిబంధనల ప్రకారం ఇటువంటి ఆటంకాలు కలిగినప్పుడు ఆ బంతిని డెడ్ బాల్‌గా పరిగణిస్తారు.
4. రూల్ 21.4 :
స్ట్రయికర్ను రనౌట్ చేసేందుకు బౌలర్లు బంతిని విసరటం ఇక నుంచి చూడబోము. స్ట్రయిక్‌లో ఉన్న బ్యాటర్‌ను ఇలా రనౌట్ చేయటం అత్యంత అరుదు. అయినా, నూతన నిబంధనతో బౌలర్లు ఎవరూ ఇలా రనౌట్ చేయాలని అనుకోరు. అలా చేస్తే, ఆ బంతిని ఇక నుంచి డెడ్ బాల్‌గా పరిగణిస్తారు.
5. రూల్ 22.1- వైడ్ :
ఆధునిక క్రికెట్లో బౌలర్లను తికమక పెట్టేందుకు బ్యాటర్లు క్రీజులో కదులుతూ ఉంటారు. చట్టం 22.1 ప్రకారం వైడ్‌ను తేల్చేందుకు బ్యాటర్ ముందుగా నిల్చున్న స్థానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. వేగంగా పరుగులు చేసేందుకు బ్యాటర్లు పొజిషన్‌ను మార్చుకుంటున్నారు. బౌలర్ రనౌట్ ఆరంభించడానికి ముందు బ్యాటర్ పొజిషన్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో స్వీప్, రివర్స్ స్వీప్, రివర్స్ స్కూప్ షాట్లను ఆడే సమయంలో వైడ్లను ప్రకటించేందుకు అంపైర్లు ఈ నిబంధనను వాడుకోనున్నారు. బంతిని ఆడేందుకు బ్యాటర్ ఉన్న పొజిషన్‌ను కాకుండా.. బౌలర్ బంతిని సంధించే ముందు బ్యాటర్ ఉన్న పొజిషన్ ఆధారంగా వైడ్‌ను తేల్చనున్నారు.
6. రూల్ 25.8- బంతిని ఆడే హక్కు! :
కొన్నిసార్లు బౌలర్లకు పట్టు తప్పి బంతి చేజారుతుంది. పిచ్‌పై కాకుండో ఎక్కడా పడుతుంది. ఆ బంతిని ఆడటం ఇప్పటివరకు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా భావించారు. కానీ ఇప్పుడు ఆ బంతిని ఆడాలా? వద్దా? అనేది పూర్తిగా బ్యాటర్ ఇష్టం. అయితే, ఆ బంతులను ఆడే సమయంలో బ్యాటర్ కానీ, బ్యాట్ కానీ కొంత భాగమైనా పిచ్‌పై ఉండాలి. పూర్తిగా పిచ్ బయటకు వెళ్లి ఆడకూడదు. ఒకవేళ పిచ్ బయటకు వెళ్లి ఆడేలా బౌలర్ బంతులు సంధిస్తే... వాటిని నో బాల్స్‌గా ప్రకటిస్తారు.
7. రూల్ 27.4, 28.6 - ఫీల్డింగ్ కదలికలు :
ఫీల్డింగ్ జట్టులో ఫీల్డర్ నిబంధనలకు విరుద్ధంగా కదలితే.. ఇప్పటివరకు ఆ బంతిని డెడ్ బాల్‌గా ఇచ్చేవారు. దీంతో బ్యాటర్ మంచి షాట్ ఆడినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇక నుంచి ఈ నిబంధనలో మార్పు చేశారు. ఫీల్డర్లు నిబంధనలకు విరుద్ధంగా కదిలితే బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు జోడిస్తారు. బౌలర్ బంతిని సంధించడానికి ముందు ఫీల్డర్ల పొజిషన్లు ఎలా ఉన్నాయో.. బ్యాటర్ బంతిని ఆడే వరకు అదే విధంగా ఉండాలి.
8. రూల్ 38.3- మన్కడింగ్ :
నాన్ స్ట్రయికర్ రనౌట్‌ను చట్టం 41 (అన్‌ఫెయిర్ ప్లే) నుంచి చట్టం 38 (రనౌట్)కు మార్పు చేశారు. ఈ అవుట్‌ను పిలిచే పదం 'మన్కడింగ్'లో మార్పు లేదు. బంతి సంధించడానికి ముందే నాన్ స్ట్రయికర్ క్రీజును వీడినప్పుడు రనౌట్ చేయటం ఇప్పటివరకు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వచ్చింది. ఇక నుంచి ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కాదు. సహజంగా బ్యాటర్లను అవుట్ చేసే విధానల్లో ఇదీ ఒకటిగా ఉండనుంది.
9. రూల్ 41.3- ఉమ్మిపై నిషేధం :
కరోనా వైరస్ పరిస్థితుల్లో కోవిడ్-19 ప్రమాదం అరికట్టేందుకు బంతిపై ఉమ్మి వేయటంపై నిషేధం విధించారు. బంతికి ఉమ్మి రాయటంపై ఎంసీసీ శాశ్వత నిషేధం విధించింది. బంతికి మెరుపు తెచ్చేందుకు, బంతిని ఓవైపు గరుకుగా చేసేందుకు ఉమ్మి వాడరాదు. చెమటను యథావిధిగా వినియోగించవచ్చు. ఉమ్మి వాడితే.. బంతి స్వరూపం మార్చేందుకు చేస్తున్న విరుద్ధ ప్రక్రియగానే చూస్తారు.
మార్లీబోన్ క్రికెట్ క్లబ్ (లండన్) రూపొందించిన ఈ నిబంధనలు 2022 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎంసీసీ నిబంధనలను తిరిగి ఐసీసీ క్రికెట్ కమిటీ పరిశీలించనుంది. ఐసీసీ క్రికెట్ కమిటీ సైతం ఈ నిబంధనలను ఆమోదిస్తే అంతర్జాతీయ క్రికెట్లోనూ ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి.