Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 62 పరుగుల తేడాతో పరాజయం
- న్యూజిలాండ్ సాధికారిక విజయం
- ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్
బ్యాటర్లు చేతులెత్తేశారు. సవాల్‌తో కూడిన ఛేదనలో అసలు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఏ దశలోనూ లక్ష్యం దిశగా దూసుకెళ్లని టీమ్ ఇండియా.. ఆతిథ్య న్యూజిలాండ్ చేతిలో దారుణ ఓటమి చవిచూసింది. టాప్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ దారుణ వైఫల్యంతో ప్రపంచకప్‌లో అమ్మాయిలకు తొలి పరాజయం ఎదురైంది. 62 పరుగుల తేడాతో భారత్‌పై న్యూజిలాండ్ సాధికారిక విజయం నమోదు చేసింది.
నవతెలంగాణ-హామిల్టన్
ఆరంభ మ్యాచ్‌లో విజయోత్సాహం మిథాలీసేన కొనసాగించలేదు. అన్ని విభాగాల్లోనూ న్యూజిలాండ్‌కు తలొంచిన టీమ్ ఇండియా అమ్మాయిలు దారుణ పరాజయం చవిచూశారు. ఐసీసీ 2022 మహిళల వన్డే వరల్డ్‌కప్ గ్రూప్ దశలో భారత్ తొలి ఓటమి మూటగట్టుకుంది. ఆతిథ్య న్యూజిలాండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన వేళ భారత్‌కు దారుణ భంగపాటు తప్పలేదు. ఆమీ (75, 84 బంతుల్లో 9 ఫోర్లు), అమేలి ఖేర్ (50, 64 బంతుల్లో 5 ఫోర్లు) అర్థ సెంచరీలతో తొలుత న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 260 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఛేదనలో బారత్ 46.4 ఓవర్లలోనే కుప్పకూలింది. సీనియర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ (71, 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. స్మృతీ మంధాన (6), దీప్తి శర్మ (5), రిచా ఘోష్ (0), పూజ వస్ట్రాకర్ (6)లు విఫలమయ్యారు. న్యూజిలాండ్ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఆమీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకుంది. గ్రూప్ దశలో తర్వాతి మ్యాచ్‌లో మార్చి 12న (శనివారం) వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది.
అసలు పోరాడితే కదా! : భారత్ ముందున్న లక్ష్యం 261 పరుగులు. ఇటీవల న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో ఓటమి చెందినా.. భారీ స్కోర్లు చేసిన రికార్డు భారత్ సొంతం. ఆరంభ మ్యాచ్‌లో టాప్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ మెరువగా.. కివీస్‌తో మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్ మాత్రమే మెరిసింది. భారీ ఛేదనలో ఆరంభంలో భారత్‌కు ఆశించిన పునాది పడలేదు. షెఫాలీ వర్మ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన యస్టికా భాటియా (28, 59 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజులో నిలిచినా దూకుడుగా పరుగులు చేయలేదు. స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన (6, 21 బంతుల్లో), నం.3 బ్యాటర్ దీప్తి శర్మ (5, 13 బంతుల్లో 1 ఫోర్) నిరాశపరిచారు. 10 ఓవర్లలో 26/2, 20 ఓవర్లలో 50/3, 30 ఓవర్లలో 97/4తో నిలిచిన టీమ్ ఇండియా.. ఏ దశలో లక్ష్యం దిశగా సాగలేదు. కెప్టెన్ మిథాలీరాజ్ (31, 56 బంతుల్లో 1 ఫోర్), హర్మన్‌ప్రీత్ కౌర్ (71) జోడీ మిడిల్ ఆర్డర్లో 47 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు. 40 ఓవర్ల వరకు భారత్ రన్‌రేట్ 3 దాటలేదు. మరో 10 ఓవర్లు మిగిలినా.. అప్పటికే భారత్ ఓటమి ఖరారైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో అర్థ సెంచరీ విన్యాసం ఊరట కలిగించింది. స్నేV్‌ా రాణా (18), పూజ వస్ట్రాకర్ (6) ఈ సారి జట్టును ఆదుకోలేకపోయారు. కివీస్ బౌలర్లలో లీ టహహు అదరగొట్టింది. 3/17తో భారత్ పరాజయాన్ని శాసించింది. అమేలీ ఖేర్ మూడు వికెట్లు దక్కించుకోగా.. జెన్సెన్ 2 వికెట్లు ఖాతాలో వేసుకుంది.
ఆమీ అదుర్స్ : టాస్ నెగ్గిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రమాదకర ఓపెనర్ సుజీ బేట్స్ (5)ను పూజ రనౌట్‌గా వెనక్కి పంపగా.. సోఫీ డివైన్ (35), అమేలీ ఖేర్ (50) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆరంభంలో ధాటిగా పరుగులు జోడించిన ఈ జంట ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసింది. ఈ ఇద్దరు నిష్క్రమించినా.. మాడీ గ్రీన్ (27), కేటీ మార్టిన్ (41)లతో కలిసి ఆమీ (75) కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. ఆరు ఫోర్లతో 60 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసిన ఆమీ.. భారత బౌలర్ల జోరుకు అడ్డుకట్ట వేసింది. టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు సమిష్టింగా కదం తొక్కటంతో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో పూజ వస్ట్రాకర్ (4/34) నాలుగు వికెట్ల ప్రదర్శనతో మెరిసింది. గోస్వామి, దీప్తిలు చెరో వికెట్ పడగొట్టగా.. రాజేశ్వరి రెండు వికెట్లు ఖాతాలో వేసుకుంది. చివరి పది ఓవర్లలో 49 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టిన భారత్.. బ్యాటర్లకు ఛేదించగల స్కోరును ఉంచగలిగింది.