Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్లీన్‌స్వీప్ విజయంపై కన్నేసిన భారత్
- నేటి నుంచి శ్రీలంకతో పింక్ బాల్ టెస్టు
మధ్యాహ్నాం 2 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-బెంగళూర్
మొహాలిలో జడేజా వన్‌మ్యాన్ షోతో శ్రీలంక చిన్నబోయింది. చిన్నస్వామిలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆతిథ్య భారత్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. క్లీన్‌స్వీప్ విజయంపై టీమ్ ఇండియా కన్నేయగా.. లంకేయులు ఐదు రోజుల పాటు పోటీ ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. విరాట్ కోహ్లి శతకం మరోసారి హాట్ టాపిక్‌గా మారిన తరుణంలో భారత్, శ్రీలంక తొలి డే నైట్ పింక్ బాల్ టెస్టు నేటి నుంచి ఆరంభం.
టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్‌పై టీమ్ ఇండియా కన్నేసింది. విరాట్ కోహ్లి వందో టెస్టులో అద్వితీయ ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజా.. తాజాగా కోహ్లి సొంత మైదానంలోనూ ప్రత్యేక ప్రదర్శనకు సిద్ధమవుతున్నాడు. భారత స్పిన్ దాడిలో అక్షర్ పటేల్ ఆయుధం తోడవటంతో బెంగళూర్‌లో శ్రీలంక పోరాట పటిమపై అప్పుడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అశ్విన్, జడేజా, అక్షర్‌లతో కూడిన స్పిన్ లైనప్‌తో బెంగళూర్ పింక్ బాల్ టెస్టుకు భారత్ రెఢ అవుతోంది. భారత్, శ్రీలంకలు చెరో మూడు డే నైట్ టెస్టులు ఆడగా.. రెండు విజయాలు, ఓ పరాజయంతో కొనసాగుతున్నాయి. పింక్ బాల్ టెస్టులో రెండు జట్లు ఆస్ట్రేలియా చేతిలోనే పరాజయం చవిచూశాయి. భారత్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేని శ్రీలంక గాయాల దెబ్బతో మరింత కుదేలవగా.. బెంగళూర్‌లో భారత్ విజయం కోసం మూడు రోజులైనా ఎదురు చూస్తుందా? లేదా అనేది హాట్ టాపిక్‌గా మారింది. భారత్, శ్రీలంక డే నైట్ గులాబీ టెస్టు మ్యాచ్ నేటి నుంచి ఆరంభం.
విరాట్ వంద కొట్టేనా? : కెరీర్ వందో టెస్టులో నిరాశపరిచిన విరాట్ కోహ్లి.. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలోనైనా శతక దాహం తీర్చుకుంటాడనే అంచనాలు కనిపిస్తున్నాయి. కెరీర్ 71వ శతకం రేసులో విరాట్ కోహ్లి ఇప్పటికే 71 ఇన్నింగ్స్‌లు ఆడేశాడు. టీ20 ఇన్నింగ్స్‌లు మినహాయించినా.. 41 ఇన్నింగ్స్‌లు శతకం లేకుండా ఆడేశాడు. చివరగా బంగ్లాదేశ్‌తో గులాబీ టెస్టులోనే సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి స్వదేశంలో మరో పింక్ బాల్ టెస్టులో మెరుస్తాడేమో చూడాలి. బెంగళూర్‌లో సొంత అభిమానుల నడుమ విరాట్ కోహ్లి వంద మైలురాయి అందుకుంటాడనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తుది జట్టు ఎంపిక అంశంలో జయంత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ ఆడనున్నాడు. తెలుగు తేజం హనుమ విహారి, శ్రేయస్ అయ్యర్లు స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌లపై కన్నేయగా.. శుభ్‌మన్ గిల్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. పేస్ విభాగంలో మహ్మద్ షమి స్థానంలో మహ్మద్ సిరాజ్‌కు చోటిచ్చే అవకాశం లేకపోలేదు.
సురంగ చివరి పోరు : శ్రీలంక పేసర్ సురంగ లక్మల్ కెరీర్ చివరి మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. బెంగళూర్ పింక్ బాల్ టెస్టతో లక్మల్ కెరీర్‌ను ముగించనున్నాడు. బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించిన పేసర్‌గా కాకపోయినా పరిస్థితులకు తగినట్టు సమయోచితంగా రాణించిన బౌలర్‌గా లక్మల్ పేరు తెచ్చుకున్నాడు. పింక్ బాల్ టెస్టుల్లో లక్మల్ 17.53 సగటుతో 13 వికెట్లు తీసుకున్నాడు. గాయాలతో లహిరు కుమార, దుష్మంత చమీరా దూరం కావటంతో ఈ టెస్టులో లక్మల్‌పై శ్రీలంక అతిగా ఆధారపడుతోంది. చివరి టెస్టులో చిరస్మరణీయ ప్రదర్శన కోసం లక్మల్ చూస్తున్నాడు. ఫామ్‌లో ఉన్న ఆటగాడు నిశాంక గాయంతో దూరం కావటం శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ. భారత స్పిన్నర్ల మ్యాజిక్‌ను శ్రీలంక బ్యాటింగ్ లైనప్ ఏ మేరకు ఎదుర్కొంటుదనేది ఆసక్తికరం.
పిచ్, వాతావరణం : చిన్నస్వామి పిచ్ పొడిగా ఉంది. పిచ్‌పై కాస్త పచ్చిక మాత్రమే కనిపిస్తోంది. ఆరంభం నుంచే స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం కనిపిస్తోంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపవచ్చు. టెస్టు మ్యాచ్‌కు ఆహ్లాదకర వాతావరణం ఉండనుంది. సాయంత్రం మేఘావృతం కానున్నప్పటికీ.. ఎటువంటి వర్ష సూచనలు లేవు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి.
శ్రీలంక : దిమిత్ కరుణరత్నె (కెప్టెన్), లహిరు తిరిమానె, కుశాల్ మెండిస్, ఎంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వ, దినేశ్ చండిమాల్/చరిత్ అసలంక, నిరోశన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), చామిక కరుణరత్నె, సురంగ లక్మల్, లసిత్ , ప్రవీణ్ జయవిక్రమ.