Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెస్టిండీస్‌తో కీలక పోరు నేడు
- ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్
హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు మరో పోరాటానికి సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసిన మిథాలీ బందం మలి పోరులో ఆతిథ్య న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఇక మూడో మ్యాచ్‌లో శనివారం విండీస్‌తో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన విండీస్ ఫుల్ జోష్‌లో ఉంటే.. వారికి సరైన బదులివ్వాలని మిథాలీ బందం యోచిస్తున్నది. టాపార్డర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం.. టీమ్ఇండియాను కలవరపెడుతున్నది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చినా.. బ్యాటర్లు మాత్రం తమ పాత్రకు న్యాయం చేయలేకపోయారు. సీనియర్ ఆటగాళ్లు బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోచ్ రమేశ్ పొవార్ అంటుంటే.. గత మ్యాచ్ పరాజయాన్ని పక్కనపెట్టి మిథాలీ బందం సమరోత్సాహంతో రంగంలోకి దిగాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు కరీబియన్ జట్టు సమతూకంతో కనిపిస్తున్నది. ఎనిమిది మంది బౌలర్లు అందుబాటులో ఉండటం విండీస్‌కు కలిసొచ్చే అంశం.
సమిష్టిగా రాణిస్తేనే : ఎన్నో అంచనాలతో మెగాటోర్నీలో అడుగుపెట్టిన స్టార్ ఓపెనర్ స్మతి మందన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నది. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి వారిని లయ కోల్పోయేలా చేస్తుందనుకుంటే.. జట్టుకు సరైన ఆరంభం ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నది. ఇక రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్ ఆడుతున్న హైదరాబాదీ మిథాలీరాజ్ తన ఆఖరి మెగాటోర్నీలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ఇతర జట్లన్నీ అలవోకగా మూడొందల మార్క్‌కు చేరువవుతుంటే.. మనవాళ్లు మాత్రం టెస్టు తరహా ఆటతో ఇబ్బంది పడుతున్నారు. న్యూజిలాండ్‌తో పోరులో పాతిక ఓవర్లు ముగిసినా భారత రన్‌రేట్ మూడు దాటలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మ్యాచ్‌లో మనవాళ్లు 162 డాట్‌బాల్స్ ఎదుర్కోవడం గమనార్హం. యస్తిక భాటియా, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కూడా రాణించాల్సిన అవసరం ఉంది. డ్యాషింగ్ ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న షఫాలీ వర్మ తుది జట్టులో చోటు దక్కించుకుంటుందా చూడాలి. మెగాటోర్నీకి ముందు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో దంచికొట్టిన తెలుగుమ్మాయి సబ్బినేని మేఘనను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓపెనర్‌గా వచ్చి అదరగొట్టడంతో పాటు బౌలింగ్ చేయగల మేఘనను కాదని యస్తిక, షఫాలీలకు అవకాశాలు ఇచ్చినా వారు దాన్ని సద్వినియోగ పర్చుకోలేకపోతున్నారు.