Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రేయస్, రిషబ్ అర్థ సెంచరీలు
- గెలుపు వాకిట టీమ్ ఇండియా
- శ్రీలంకతో పింక్ బాల్ టెస్టు
నవతెలంగాణ-బెంగళూర్
భారత్ ధాటికి శ్రీలంక చితికిపోయింది. భారత బౌలర్లను ఎదుర్కొలేక బోల్తాపడిన లంకేయులు.. మన బ్యాటర్లను కట్టడి చేయటంలో ఆపసోపాలు పడ్డారు. జశ్‌ప్రీత్ బుమ్రా (5/24) దెబ్బకు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలింది. పంత్ (50) సుడిగాలి అర్థ సెంచరీ, శ్రేయస్ (67) మెరుపులతో భారత్ బెంగళూర్ టెస్టులో గెలుపు వాకిట నిలిచింది. 447 పరుగుల రికార్డు లక్ష్య ఛేదనలో శ్రీలంక ప్రస్తుతం 30/1తో కొనసాగుతోంది.
రిషబ్ పంత్ (50, 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) చిన్నస్వామిలో చిచ్చరపిడుగు వలె చెలరేగాడు. 28 బంతుల్లోనే అర్థ శతకం బాదేసిన పంత్.. భారత్‌ను తిరుగులేని స్థానంలో నిలిపాడు. శ్రేయస్ అయ్యర్ (67, 87 బంతుల్లో 9 ఫోర్లు), రోహిత్ శర్మ (46) రాణించటంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 303/9 వద్ద డిక్లరేషన్ ఇచ్చింది. శ్రీలంకకు 447 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించింది. బుమ్రా (5/24) ఐదు వికెట్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు కుప్పకూలిన శ్రీలంక.. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ లహిరు తిరిమానె (0)ను కోల్పోయింది. 28/1తో కొనసాగుతున్న శ్రీలంక మరో 419 పరుగుల వెనుకంజలో నిలిచింది. భారత బౌలర్ల దూకుడును ఎదుర్కొని శ్రీలంక నేడు తొలి సెషన్ గండం సైతం దాటడం అనుమానమే. వరుసగా రెండో టెస్టు మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించి క్లీన్‌స్వీప్ విజయానికి రోహిత్‌సేన రంగం సిద్ధం చేసుకుంది.
చితకబాదాడు : పిచ్ బౌలర్లకు అనుకూలిస్తోంది. పరుగుల వేట కష్టమైంది. ఈ సమీకరణాలు రిషబ్ పంత్ (50)కు పట్టలేదు. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన పంత్ టెస్టుల్లో వేగవంతమైన అర్థ సెంచరీ నమోదు చేశాడు. 7 ఫోర్లు, 2 సిక్సర్లతో దుమ్మురేపిన పంత్ 28 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదాడు. 1982లో పాకిస్థాన్‌పై కపిల్ దేవ్ 30 బంతుల అర్థ శతక రికార్డును బద్దలుకొట్టాడు. పంత్ ప్రత్యేక ఇన్నింగ్స్‌తో భారత్ భారీ ఆధిక్యంలో నిలిచింది. ఆరంభంలో కెప్టెన్ రోహిత్ శర్మ (46, 79 బంతుల్లో 4 ఫోర్లు), తెలుగు తేజం హనుమ విహారి (35, 79 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. ఫామ్‌లో ఉన్న బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (67) మరో అర్థ సెంచరీ సాధించాడు. 9 ఫోర్లతో మెరిసిన అయ్యర్ సమయోచిత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (13) మరోసారి నిరాశ పరిచాడు. ధాటిగా పరుగులు చేయటంపై దృష్టి పెట్టిన భారత్ 303 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్ ఇచ్చింది. శ్రీలంకకు అసాధ్యమైన 447 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక బౌలర్లలో వీడ్కోలు పేసర్ సురంగ లక్మల్ వికెట్ తీసుకోవటంలో తేలిపోయాడు. స్పిన్నర్ జయవిక్రమ (4/78), లసిత్ (3/87) రాణించారు.
బుమ్రా బూమ్ : ఓవర్‌నైట్ స్కోరు 86/6తో రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంకకు జశ్‌ప్రీత్ బుమ్రా చుక్కలు చూపించాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆ జట్టును స్వల్ప స్కోరుకే కుప్పకూల్చాడు. ఉదయం సెషన్లో 35 బంతుల్లోనే శ్రీలంక చివరి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. 35.5 ఓవర్లలో ఆ జట్టు 109 పరుగులకు కుప్పకూలింది. బుమ్రా (5/24) ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. అశ్విన్ (2/30), షమి (2/18) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 143 పరుగుల భారీ ఆధిక్యం సొంతం చేసుకుంది. శ్రీలంక తరఫున మాథ్యూస్ (43), డిక్వెల్లా (21) ఫర్వాలేదనిపించారు.
భారత్ తొలి ఇన్నింగ్స్ : 252/10
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 109/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : మయాంక్ (సి) డిసిల్వ (బి) లసిత్ 22, రోహిత్ (సి) మాథ్యూస్ (బి) డిసిల్వ 46, విహారి (బి) జయవిక్రమ 35, కోహ్లి (ఎల్బీ) జయవిక్రమ 13, పంత్ (సి,బి) జయవిక్రమ 50, శ్రేయస్ (ఎల్బీ) లసిత్ 67, జడేజా (బి) ఫెర్నాండో 22, అశ్విన్ (సి) డిక్వెల్లా (బి) జయవిక్రమ 13, అక్షర్ (బి) లసిత్ 0, షమి నాటౌట్ 16, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం :(68.5 ఓవర్లలో 9 వికెట్లకు) 303 డిక్లేర్డ్.
వికెట్ల పతనం : 1-42, 2-98, 3-116, 4-139, 5-184, 6-247, 7-278, 8-278, 9-303.
బౌలింగ్ : లక్మల్ 10-2-34-0, లసిత్ 20.5-1-87-3, విశ్వ 10-2-48-1, డిసిల్వ 9-0-47-1, జయవిక్రమ 19-2-78-4.
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ : లహిరు (ఎల్బీ) బుమ్రా 0, దిమిత్ నాటౌట్ 10, కుశాల్ 16, ఎక్స్‌ట్రాలు : 2, మొత్తం : (7 ఓవర్లలో వికెట్ నష్టానికి) 28.
వికెట్ల పతనం : 1-0.
బౌలింగ్ : బుమ్రా 3-1-9-1, షమి 3-0-13-0, అశ్విన్ 1-0-4-0.