Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త బ్యాటర్‌కే స్ట్రయిక్ చాన్స్
- ఐపీఎల్ 2022 నిబంధనలు
నవతెలంగాణ-ముంబయి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ సీజన్‌కు మరింత ఆకర్షణీయంగా ముస్తాబు అవుతోంది. ఇటీవల మార్లీబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఆమోదించిన నూతన క్రికెట్ నిబంధనలను ఐపీఎల్ అమలు చేసేందుకు నడుం బిగించింది. ఐపీఎల్ 15 సీజన్ మార్చి 26న తొలి మ్యాచ్‌తో ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ క్రీడా నియామవళిని విడుదల చేసింది. ఎంసీసీ నూతన నిబంధనలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. గడువుకు ముందే ఐపీఎల్ కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టనుంది.
స్ట్రయిక్ ఎవరికీ? : ప్రస్తుతం బ్యాటర్ క్యాచౌట్‌గా నిష్క్రమిస్తే.. నాన్ స్ట్రయికర్ సగం పిచ్‌ను దాటేశాడా? లేదా? అనే అంశం ఆధారంగా కొత్త బ్యాటర్ స్ట్రయిక్ ఆధారపడింది. ఇక నుంచి ఈ పద్దతి మారబోతుంది. బౌలర్ల గౌరవార్థం ఎంసీసీ ఈ కీలక రూల్‌లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. క్యాచ్ అందుకున్న సమయం, నాన్‌స్ట్రయికర్ పిచ్‌లో ఎక్కడున్నాడనే అంశంతో సంబంధం లేకుండా కొత్త బ్యాటర్ నేరుగా స్ట్రయిక్ తీసుకోనున్నాడు. ఓవర్ చివరి బంతికి క్యాచౌట్ అయితే మినహా కొత్త బ్యాటర్ మాత్రమే స్ట్రయిక్ తీసుకోవాల్సి ఉంటుంది.
మన్కడింగ్ కాదు : మన్కడింగ్ వివాదానికి సైతం ఇక తెరపడనుంది. ఈ సీజన్ నుంచి నాన్‌స్ట్రయికర్ రనౌట్‌ను ఫెయిర్ ప్లేలో భాగంగా చేర్చారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధమనే వాదనకు తెరపడకపోయినా.. మన్కడింగ్ చేసిన జట్టు ఫెయిర్ ప్లేలో పాయింట్లలో ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు. మన్కడింగ్‌కు సాధారణ రనౌట్‌గా చూస్తారు.
డిఆర్ఎస్ : దీనితో పాటు ఐపీఎల్లో ప్రతి ఇన్నింగ్స్‌కు ఓ డిఆర్ఎస్ సమీక్షకు అవకాశం ఇస్తున్నారు. తాజాగా ఈ పరిమితిని రెండుకు పెంచారు. ప్రతి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లకు రెండు డిఆర్ఎస్ సమీక్ష అవకాశాలు కల్పించనున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఈ రెండు నిబంధనలు కొత్తగా అమల్లోకి రానున్నాయి.
కోవిడ్ సోకితే?! : నిరుడు భారత్‌లో నిర్వహించిన తొలి దశ ఐపీఎల్లో కోవిడ్ కేసులు వెలుగు చూడటంతో లీగ్‌ను అర్థాంతరంగా వాయిదా వేశారు. ఈ ఏడాది సైతం కరోనా మహమ్మారి ప్రమాదం పొంచి ఉంది. దీంతో కోవిడ్ కేసులు నమోదైన పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి ప్రాంఛైజీలకు స్పష్టమైన సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. ఏదేని జట్టు 12 మంది జట్టును మైదానంలోకి దించలేని పరిస్థితుల్లో లేకపోతే.. ఈ మ్యాచ్‌ను రీ షెడ్యూల్ చేస్తారు. ఆ తర్వాత సైతం ఆ జట్టు తుది జట్టును ఆడించలేకపోతే ప్రత్యర్థి జట్టుకు పూర్తి పాయింట్లు కేటాయిస్తారు. కోవిడ్ ఎఫెక్ట్ జట్టు ఆ మ్యాచ్‌లో పరాజయం పొందినట్టు అవనుంది. కోవిడ్ కేసులు వెలుగు చూసినా.. ఈ సీజన్ ఐపీఎల్ యథాతథంగా కొనసాగనుందని ఐపీఎల్ జీసీ చెప్పకనే చెప్పింది.
సూపర్ ఓవర్ : నాకౌట్ దశలో సూపర్ ఓవర్, సూపర్ ఓవర్ అనంతరం సూపర్ ఓవర్ నిర్వహణ సాధ్యపడని పక్షంలో విజేతను తేల్చాల్సిన పద్దతిని సైతం ఐపీఎల్ జీసీ క్రీడా నియామవళిలో స్పష్టం చేసింది. లీగ్ దశలో ముందంజలో నిలిచిన (టాప్-4లో మెరుగైన స్థానం) జట్టును విజేతగా ప్రకటించనున్నారు. ఐపీఎల్ లీగ్ దశలోనూ మ్యాచులు టైగా ముగిస్తే సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే.