Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో సాకర్ అభివృద్దికి కృషి
- హెచ్ఎఫ్సీ సహా యజమాని వరుణ్ త్రిపురనేని
భారత ఫుట్‌బాల్ రాజధానిగా వెలుగొందిన హైదరాబాద్ 1960 తర్వాత కాలంలో క్రమంగా సాకర్ చిత్రపటం నుంచి కనుమరుగైంది. ఇండియన్ సూపర్ లీగ్‌లో నిలకడగా రాణించి ఫైనల్లో బెర్త్ దిశగా దూసుకెళ్తోన్న హైదరాబాద్ ఎఫ్‌సీ.. మరోసారి దేశ ఫుట్‌బాల్‌లో హైదరాబాద్‌ను హాట్ టాపిక్‌గా నిలిపింది. అద్వితీయ ప్రదర్శనతో ఐఎస్ఎల్ సెమీఫైనల్స్‌కు చేరుకున్న హైదరాబాద్ ఎఫ్‌సీ విజయంపై ఆ జట్టు సహా యజమాని వరుణ్ త్రిపురనేని
నవ తెలంగాణతో ముట్చటించారు.
నవ తెలంగాణ-హైదరాబాద్
తెలంగాణలో ఫుట్‌బాల్ అభివద్ధికి మీ ప్రణాళికలు?
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిభావంతులకు కొదువ లేదు. సరైన శిక్షణతో నాణ్యమైన ఆటగాళ్లను తయారు చేయవచ్చు. ఆ దిశగా క్యాంప్‌ల ఏర్పాటు ఆలోచనతో ఉన్నాం. ఆటపై మక్కువ ఉండి, రాణించాలన్న పట్టుదలతో ఉన్న యువకులను గుర్తించి అత్యుత్తమ శిక్షణకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో కూడా ప్రతిభాన్వేషణ కార్యక్రమం విస్తరిస్తాం.
స్థానికంగా ఫుట్‌బాల్‌కు ఆదరణ ఎలా ఉంది?
క్రికెట్, కబడ్డీలో పోల్చితే ఫుట్‌బాల్‌కు ఆదరణ తక్కువేమి లేదు. స్కూల్ స్థాయి నుంచే పిల్లలు సాకర్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవల ట్రయల్స్ నిర్వహిస్తే భారీ సంఖ్యలో పిల్లలు రావడం దీనికి నిదర్శనం. ఏడాది పొడవునా శిక్షణా శిబిరాలతో పాటు ప్రపంచ స్థాయి అకాడమీ ఏర్పాటు ఆలోచన ఉంది.
సాకర్‌లో హైదరాబాద్ గత వైభవం దిశగా పయనిస్తుందా?
భారత ఫుట్‌బాల్‌కు హైదరాబాద్ అడ్డాగా వెలుగొందింది. 1940-60 దశకాల్లో ఇక్కడి నుంచి సయ్యద్ షాహిద్ హకీమ్, షబ్బీర్ అలీ, హమీద్, సయ్యద్ అబ్దుల్ రహీమ్, పీటర్ తంగరాజు, మహమ్మద్ జుల్ఫీకరుద్దీన్ వంటి ఎంతో మంది దిగ్గజాలు దేశానికి ఆడారు. హెచ్ఎఫ్సీ విజయంతో హైదరాబాద్ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుంది. ఐఎస్ఎల్ టైటిల్ నెగ్గితే స్థానికంగా సాకర్‌కు మళ్లీ ఆదరణ దక్కనుంది.
జట్టు కూర్పులో యువతకు అవకాశాలపై?
ఈసారి జట్టు కూర్పుపై ప్రధానంగా దష్టి పెట్టాం. గత అనుభవాల దృష్ట్యా యువతకు ప్రాధాన్యం ఇచ్చాం. గతంలో విదేశీ స్టార్లపై ఆధారపడ్డాం. వారి వైఫల్యం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపేది. చీఫ్ కోచ్ మనోలో మార్కెజ్ నేతత్వంలో విదేశీ ప్లేయర్లతో పాటు స్వదేశీ స్టార్లకు పెద్దపీట వేశాం. ఆకాశ్మిశ్రా, అశిష్ రారు, హితేశ్‌కు అవకాశాలు కల్పించాం. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జట్టులో కీలక ప్లేయర్లుగా ఎదిగారు. హెచ్ఎఫ్సీ-బి జట్టు ప్రతి సీజన్‌కు ఒకరిద్దరు ప్రధాన జట్టుకు ప్రమోట్ అయ్యేలా శిక్షణ ఇస్తున్నాం.
జట్టు సెమీస్ చేరడంపై మీ స్పందన?
హెచ్ఎఫ్సీ సెమీస్ చేరటం చాలా సంతోషంగా ఉంది. ఏటీకే మోహన్బగాన్తో బుధవారం జరిగే రెండో సెమీస్‌లో గెలిచి ఫైనల్లోకి అడుగుపెడతామనే దీమా ఉంది. ఈ సీజన్లో హెచ్ఎఫ్సీ టైటిల్ కొడుతుందనే నమ్మకం ఉంది.