Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి
- మిథాలీసేన నిలకడలేని ప్రదర్శన
- ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్
ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా నిలకడలేమి ప్రదర్శన కొనసాగుతోంది. వెస్టిండీస్‌పై ఎదురులేని విజయం సాధించిన భారత్.. తాజాగా ఇంగ్లాండ్ చేతిలో అనూహ్య ఓటమి చవిచూసింది. కరీబియన్లపై పరుగుల వేటలో విరుచుకుపడిన బ్యాటర్లు.. ఇంగ్లీష్ బౌలర్ల ముందు తడబాటుకు లోనయ్యారు. 134 పరుగులకే కుప్పకూలిన భారత్ లీగ్ దశలో రెండో ఓటమి మూటగట్టుకుంది. భారత్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్ వరల్డ్‌కప్‌లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
మౌంట్ మౌంగనురు : టీమ్ ఇండియా అమ్మాయిలు మళ్లీ నిరాశపరిచారు. స్టార్ బ్యాటర్లు శతకాలతో ఫామ్‌లోకి రావటంతో లీగ్ దశలో ప్రత్యర్థి జట్లకు ఇక చుక్కలే అనుకోగా.. కథ అడ్డం తిరిగింది. లీగ్ దశలో వరుస పరాజయాలు చవిచూసిన ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో మిథాలీసేన చేతులెత్తేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళలు 134 పరుగులకు కుప్పకూలారు. ఇంగ్లాండ్ బౌలర్ చార్లీ డీన్ (4/23), అన్యా శ్రబ్సోల్ (2/20) భారత బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశారు. స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఆపసోపాలు పడుతూ ఛేదించింది. మేఘ్న సింగ్ (3/26), జులన్ గోస్వామి (1/27) మెరుపులతో ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ హీథర్ నైట్ (53 నాటౌట్, 72 బంతుల్లో 8 ఫోర్లు), నటాలీ సీవర్ (45, 46 బంతుల్లో 8 ఫోర్లు) ఇంగ్లాండ్‌ను గెలుపు తీరాలకు చేర్చారు. ఇంగ్లాండ్ బౌలర్ చార్లీ డీన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచింది. ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో మార్చి 19న ఆస్ట్రేలియాతో తలపడనుంది.
బ్యాటర్లు విఫలం : టాస్ నెగ్గిన తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. భారత బ్యాటర్లను ఇరకాటంలో పడేసింది. టాప్ ఆర్డర్లో స్మృతీ మంధాన (35, 58 బంతుల్లో 4 ఫోర్లు) నిలకడగా రాణిస్తున్నప్పటికీ.. సహచర బ్యాటర్ల నుంచి సహకారం కరువైంది. యస్టికా భాటియా (8), కెప్టెన్ మిథాలీ రాజ్ (1), దీప్తి శర్మ (0)లు దారుణంగా నిరాశపరిచారు. హర్మన్‌ప్రీత్ కౌర్ (14) సైతం ఎంతోసేపు వికెట్ కాపాడుకోలేదు. 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. ఈ సారి లోయర్ ఆర్డర్లో రిచా ఘోష్ (33, 56 బంతుల్లో 5 ఫోర్లు), జులన్ గోస్వామి (20, 26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో భారత్ వంద పరుగుల మార్క్ దాటగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లు ఆరంభం నుంచీ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. 36.2 ఓవర్లలోనే భారత్ పది వికెట్లు కోల్పోయింది.
స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో భారత బౌలర్లు ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్‌కు అంత సులువుగా విజయాన్ని ఇవ్వలేదు. టామీ బ్యూమోంట్ (1), డానీ వ్యాట్ (1), ఆమీ జోన్స్ (10), సోఫీ డంక్లీ (17), కేథరిన్ బ్రంట్ (0)లు స్వల్ప స్కోర్లకు వికెట్ కోల్పోయారు. కెప్టెన్ హీథర్ నైట్ (53) అర్థ సెంచరీకి తోడు నటాలీ సీవర్ (45) రాణించటంతో ఇంగ్లాండ్ గెలుపు తీరాలకు చేరింది. 31.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసిన ఇంగ్లాండ్ వరల్డ్‌కప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
భారత మహిళల ఇన్నింగ్స్ : మంధాన (ఎల్బీ) ఎకెల్‌స్టోన్ 35, యస్టికా (బి) శ్రబ్సోల్ 8, మిథాలీ రాజ్ (సి) డంక్లీ (బి) శ్రబ్సోల్ 1, దీప్తి శర్మ రనౌట్ 0, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) జోన్స్ (బి) డీన్ 14, స్నేV్‌ా రాణా (సి) జోన్స్ (బి) డీన్ 0, రిచా ఘోష్ రనౌట్ 33, పూజ (ఎల్బీ) డీన్ 6, గోస్వామి (సి) వ్యాట్ (బి) క్రాస్ 20, మేఘ్న సింగ్ (బి) డీన్ 3, రాజేశ్వరి నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు :13, మొత్తం :(36.2 ఓవర్లలో ఆలౌట్) 134.
వికెట్ల పతనం : 1-18, 2-25, 3-28, 4-61, 5-61, 6-71, 7-86, 8-123, 9-129, 10-134.
బౌలింగ్ : కేథరిన్ బ్రంట్ 4-0-18-0, అన్యా శ్రబ్సోల్ 6-1-20-2, నటాలీ సీవర్ 4-0-16-0, సోఫీ ఎకెల్‌స్టోన్ 9-1-27-1, చార్లీ డీన్ 8.2-1-23-4, కేట్ క్రాస్ 3-0-23-1, హీథర్ నైట్ 2-0-4-0.
ఇంగ్లాండ్ మహిళల ఇన్నింగ్స్ : టామీ (ఎల్బీ) గోస్వామి 1, వ్యాట్ (సి) రాణా (బి) మేఘ్న 1, హీథర్ నాటౌట్ 53, నటాలీ సీవర్ (సి) గోస్వామి (బి) పూజ 45, ఆమీ జోన్స్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) రాజేశ్వరి 10, సోఫీ (సి) రిచా (బి) మేఘ్న 17, కేథరిన్ (సి) రిచా (బి) మేఘ్న 0, సోఫీ నాటౌట్ 5, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం :(31.2 ఓవర్లలో 6 వికెట్లకు) 136.
వికెట్ల పతనం : 1-3, 2-4, 3-69, 4-102, 5-128, 6-128.
బౌలింగ్ : గోస్వామి 7-1-21-1, మేఘ్న 7.2-3-26-3, రాజేశ్వరి 7-1-35-1, పూజ 5-0-22-1, రాణా 3-0-19-0, దీప్తి 2-0-13-0.