Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్‌కు ప్రాంఛైజీల కూర్పు సమస్యలు
- కీలక ఆటగాళ్లకు గాయాలతో తలనొప్పులు
భారత్ అంతర్జాతీయ షెడ్యూల్ ముగిసింది. మార్చి 26 నుంచి ఐపీఎల్ పండుగకకు అప్పుడే సందడి మొదలైంది. ముంబయి, పుణెల్లో జరుగనున్న ఐపీఎల్ 15 కోసం పది ప్రాంఛైజీలు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాయి. భారత క్రికెటర్లు సైతం ఐపీఎల్ జట్ల శిబిరాల్లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో గాయాలు, అందుబాటు సమస్య, బ్యాటింగ్ స్థానాలపై అనిశ్చితి.. ఇలా పలు జట్లు తికమక పడుతున్నాయి. ఐపీఎల్ 2022కు ముందు ఇటువంటి గందరగోళంలో ఉన్న జట్లు ఎదుర్కొంటున్న సవాళ్లను ఓ సారి చూద్దాం.
రాయల్ చాలెంజర్స్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ స్థానం?
ఐపీఎల్లో విరాట్ కోహ్లి పవర్‌ప్లే స్ట్రయిక్‌రేట్ గత మూడు సీజన్లుగా 130.16. పవర్‌ప్లేలో కనీసం 250 బంతులు ఎదుర్కొన్న 19 మంది ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఎనిమిదో అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్. పవర్‌ప్లేలో విరాట్ కోహ్లి బ్యాటింగ్ సగటు 37.40. గత మూడు సీజన్లలో మిడిల్ ఓవర్లలో విరాట్ కోహ్లి స్ట్రయిక్ రేట్ 110.16. ఈ ఓవర్లలో కనీసం 300 బంతులు ఎదుర్కొన్న 25 మంది ఆటగాళ్లలో కోహ్లిది 23వ స్థానం. గత రెండు సీజన్లుగా స్పిన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి పరుగుల సాధన నెమ్మదించింది. స్ట్రయిక్‌రేట్ 105.35గానే ఉంటోంది. సగటు 70గా ఉన్నప్పటికీ.. స్ట్రయిక్‌రేట్ తక్కువగా ఉంది. స్పిన్‌కు వికెట్ ఇవ్వకపోయినా, స్పిన్‌పై వేగంగా పరుగులు చేయటం లేదు. స్పిన్ బౌలింగ్‌లో కనీసం 200 బంతులు ఎదుర్కొన్న 20 మంది బ్యాటర్ల స్ట్రయిక్ రేట్లో విరాట్ కోహ్లిది 19వ స్థానం. ఓపెనర్‌గా రావటం, లేదంటే దిగువ ఆర్డర్లో వచ్చి ఎక్కువగా స్పిన్ ఎదుర్కొవటం కోహ్లి ముందున్న మార్గాలు. రాయల్ చాలెంజర్స్ మిడిల్ ఆర్డర్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. కోహ్లి బ్యాటింగ్ స్థానం చిక్కుముడిగా ఉంది. యువ బ్యాటర్ అనుజ్ రావత్‌ను నం.3గా ఆడిస్తే కోహ్లి ఆ తర్వాత బ్యాటింగ్‌కు రావాల్సి ఉంటుంది. గ్లెన్ మాక్స్వెల్ వివాహం అనంతరం కొంత ఆలస్యంగా జట్టులోకి రానుండటంతో కోహ్లిని మిడిల్ ఆర్డర్‌లోనే ఆరంభ మ్యాచ్‌ల్లో ఆడించటం. లేదంటే, కెప్టెన్ డుప్లెసిస్‌తో పాటు ఓపెనర్‌గానే కోహ్లి రావటం ఆర్సీబీ ముందున్న ఆప్షన్లు. డెవిడ్ విల్లే రూపంలో బెంగళూర్‌కు మరో మంచి ఓపెనర్ ఉన్నాడు. కోహ్లి, మాక్స్వెల్, మహిపాల్, దినేశ్ కార్తీక్‌లతో కూడిన మిడిల్ ఆర్డర్‌కు డెవిడ్ విల్లే ఓపెనర్‌గా మంచి కూర్పు అవుతుంది.
సూపర్‌కింగ్స్ - చాహర్ స్థానం భర్తీ చేసేదెవరు?
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ అతి పెద్ద సమస్య ఎదుర్కొంటుంది. ఆ జట్టు పేస్ దళపతి, వేలంలో రికార్డు ధర దక్కించుకున్న దీపక్ చాహర్ ఈ సీజన్ మెజార్టీ మ్యాచులకు దూరం కానున్నాడు. దీపక్ చాహర్ గైర్హాజరీతో తుది జట్టు కూర్పును ధోనీసేన ఎలా సమతూకం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 2018 నుంచి ఐపీఎల్లో పవర్‌ప్లేలో పవర్ఫుల్ పేసర్‌గా దీపక్ చాహర్ సత్తా చాటుతున్నాడు. పవర్‌ప్లేలో ఏకంగా 42 వికెట్లు పడగొట్టిన చాహర్ చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. చాహర్ తర్వాత ఉత్తమ ప్రదర్శన చేసిన ట్రెంట్ బౌల్ట్ 27 వికెట్లు తీసుకున్నాడు. ఈ గణాంకాలు చాహర్ సత్తాను చాటుతాయి. బౌలింగ్ విభాగంలో దీపక్ చాహర్ స్థానాన్ని భర్తీ చేయటం సూపర్‌కింగ్స్‌కు అంత సులువు కాదు. లోయర్ ఆర్డర్లో చాహర్ బ్యాటింగ్ నైపుణ్యం సైతం సూపర్‌కింగ్స్‌కు దూరం కానుంది. రాబిన్ ఉతప్పను ఓపెనర్‌గా పంపించి.. ఇద్దరు విదేశీ పేసర్లు క్రిస్ జోర్డాన్, ఆడం మిల్నెలను ఆడించటం ఓ ఆప్షన్. భారత యువ పేసర్ రాజ్యవర్ధన్ను జట్టులోకి తీసుకుని కివీస్ బ్యాటర్ డెవాన్ కాన్వేను ఓపెనర్‌గా పంపటం మరో మార్గం. ఇటీవల అండర్-19 ప్రపంచకప్ సాధించిన భారత జట్టులో రాజ్యవర్ధన్ సభ్యుడు. ముఖేష్ చౌదరి, తుషార్ దేశ్‌పాండే, సిమ్రన్‌జిత్ సింగ్, కెఎం ఆసిఫ్ రూపంలో చెన్నై వద్ద ప్రతిభావంతులైన స్వదేశీ పేస్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు.
నైట్‌రైడర్స్ - వెంకటేశ్ అయ్యర్, వికెట్ కీపింగ్?
భయమెరుగని బ్యాటింగ్‌తో వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్లో వెలుగులోకి వచ్చాడు. ఓపెనర్‌గా అవతారం ఎత్తి, రెండో అంచె ఐపీఎల్లో కోల్‌కత రాత మార్చిన బ్యాటర్ అయ్యర్. జాతీయ జట్టులో వెంకటేశ్ అయ్యర్ అరంగ్రేటం చేయగా.. అక్కడ అతడిని ఫినీషర్ పాత్ర కోసం సానపెడుతున్నారు. ఐపీఎల్ ప్రాంఛైజీలకు జాతీయ జట్ల పాత్రలతో సంబంధం లేదు. దీంతో వెంకటేశ్ అయ్యర్‌ను మళ్లీ ఓపెనర్‌గా చూడాలని కోల్‌కత కోరుకుంటోంది. వెంకటేశ్ అయ్యర్ ఓపెనర్‌గా వచ్చినా.. అతడికి తోడుగా ఇన్నింగ్స్ ఆరంభించేది ఎవరు? అనే ప్రశ్న ఇంకా చిక్కుముడిగానే ఉంది. అలెక్స్ హేల్స్ ఐపీఎల్‌కు దూరం కావటంతో నైట్‌రైడర్స్ ప్రణాళికలు తారుమారు అయ్యాయి. ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా అలెక్స్ హేల్స్ కోల్‌కతకు తొలి ప్రాధాన్య ఆటగాడు. శామ్ బిల్లింగ్స్ రూపంలో నైట్‌రైడర్స్‌కు ప్రత్యామ్నాయం ఉంది. సౌరాష్ట్ర వికెట్ కీపర్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్, తమిళనాడు బ్యాటర్ బి ఇంద్రజిత్ రూపంలో మరో ఆప్షన్ సైతం కోల్‌కత ముందుంది. అలెక్స్ హేల్స్ స్థానంలో వచ్చిన ఆరోన్ ఫించ్ ఓపెనర్‌గా రానున్నప్పటికీ.. వికెట్ కీపర్‌గా మరో మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్- నోకియా లేకుంటే?
సఫారీ ఫాస్ట్ బౌలర్ ఎన్రిచ్ నోకియా గాయంతో 2021 ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నొకియా అత్యంత కీలక ఆటగాడు. ఆ జట్టు తరఫున అత్యధిక వికెట్లు కూల్చిన పేసర్. వేలంలో నొకియాకు ప్రత్యామ్నాయ ఆటగాడి కోసం క్యాపిటల్స్ అన్వేషించలేదు. లుంగిసాని ఎంగిడి, ముస్తాఫిజుర్ రెహమాన్ రూపంలో మరో ఇద్దరు విదేశీ పేసర్లు అందుబాటులో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరూ నొకియా స్థాయిలో రాణించలేదు. భారత బౌలర్లలో చేతన్ సకారియ, ఖలీల్ అహ్మద్‌లు మరో అప్షన్. ఢిల్లీ ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగే అవకాశం సైతం ఉండటంతో వీరికి చాన్స్ దక్కనుంది. ఆసీస్ ఆటగాళ్లు డెవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లు ఆలస్యంగా అందుబాటులోకి రానుండటం ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుర్కొంటున్న మరో సమస్య. కనీసం తొలి రెండు మ్యాచులకు ఈ ఇద్దరు దూరం కానున్నారు. వార్నర్, మార్ష్ లేని ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లైనప్ కాగితంపై బలహీనంగా కనిపిస్తోంది. కివీస్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్, విండీస్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్‌లతో ఢిల్లీ ఆరంభంలో నెట్టుకొచ్చేందుకు చూస్తుంది.
ముంబయి ఇండియన్స్- విదేశీ కోటాలో ఎవరు?
ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ బలమైన కోర్ జట్టును నిలుపుకుంది. భారత ఆటగాళ్లను నిలుపుకున్నప్పటికీ.. విదేశీ కోటాలో చాలా మంది ముంబయికి కొత్త ముఖాలే. ముంబయి ముందున్న తొలి సవాల్.. నలుగురు విదేశీ ఆటగాళ్లను తుది జట్టులోకి ఎంచుకోవటం. కీరన్ పొలార్డ్, టిమ్ డెవిడ్‌లు తుది జట్టులోకి నేరుగా రానున్నారు. మిగతా రెండు స్థానాలపై స్పష్టత లేదు. స్ట్రార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో ఈ సీజన్లో ఆడటం లేదు. టైమల్ మిల్స్‌తో డెత్ బౌలింగ్‌ను మెరుగు పర్చుకునే ఆలోచన కనిపిస్తోంది. దీంతో మిల్స్ మూడో ఆటగాడిగా అనుకోవచ్చు. నాల్గో స్థానం కోసం రిలే మెరెడిత్, డానియల్ శామ్స్ నడుమ గట్టి పోటీ కనిపిస్తోంది. మెరెడిత్ పదునైన పేస్, డానియల్ మెరుపు బ్యాటింగ్‌తో కెప్టెన్ ఎవరిని తీసుకుంటాడో చూడాలి. దేశవాళీ యువ ఆటగాళ్లలో హైదరాబాద్ యువ సంచలనం తిలక్ వర్మ నం.3 బ్యాటర్‌గా నేరుగా తుది జట్టులోకి ఎంపిక కానున్నాడు. తమిళనాడు బ్యాటర్ సంజరు యాదవ్ సైతం తుది జట్టులో చోటు సాధించే అవకాశం లేకపోలేదు. విదేశీ ఆటగాళ్లలో ఎవరు గాయాల బారిన పడినా.. ముంబయి ఇండియన్స్‌కు తిప్పలు తప్పవు.