Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో కేరళ బ్లాస్టర్స్‌పై అద్భుత విజయం
- పెనాల్డీ షూటౌట్‌తో గెలుపు ఖరారు
- ఇండియన్ సూపర్ లీగ్ ఫైనల్
ఫట్రోడా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో అద్భుతం ఆవిషతమైంది. ఇన్నాళ్లు కలగా మిగిలిన కప్ ఎట్టకేలకు దరి చేరింది. ఆదివారం నెహ్రూ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ పోరులో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) 3-1(పెనాల్డీ షఉటౌట్) తేడాతో కేరళ బ్లాస్టర్స్‌పై చరిత్రాత్మక విజయం సాధించింది. ఫైనల్ చేరిన తొలిసారే హెచ్ఎఫ్సీ టైటిల్‌ను ముద్దాడి కొత్త చరిత్ర లిఖించింది. మరోవైపు మూడుసార్లు ఫైనల్లో తలపడిన కేరళ మరోమారు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మ్యాచ్ విషయానికొస్తే నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోరు 1-1తో సమమైంది. హెచ్ఎఫ్సీ తరఫున తవోరా(88ని) గోల్ చేయగా, కేరళకు రాహుల్(68ని) ఏకైక గోల్ అందించాడు. స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ అదనపు సమయానికి దారితీసింది. మరో 30 నిమిషాల పాటు జరిగిన ఆటలో గోల్స్ నమోదు కాకపోవడంతో పెనాల్టీ షూటౌట్ తప్పనిసరి అయ్యింది. షూటౌట్లో హైదరాబాద్ తరఫున జావో విక్టర్, ఖాసా కమారా, హలీచరణ్ నర్జారీ గోల్స్ చేయడంతో గెలుపు సంబురాల్లో మునిగిపోయింది. తొలిసారి టైటిల్ ఒడిసిపట్టిన ఆనందంలో ఆటగాళ్లు ఉద్వేగానికి లోనయ్యారు.
ఆది నుంచే హౌరాహౌరీ: ఎలాగైనా టైటిల్‌ను ముద్దాడాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన హెచ్ఎఫ్సీ, కేరళ బ్లాస్టర్స్ అందుకు తగ్గట్లు దూకుడును ఎంచుకున్నాయి. మ్యాచ్ మొదలైన మొదటి నిమిషం నుంచే గోల్ లక్ష్యంగా దూసుకెళ్లాయి. ఈ క్రమంలో హెచ్ఎఫ్సీ ప్లేయర్‌ను దురుసుగా అడ్డుకున్న కేరళ డిఫెండర్ సందీప్‌సింగ్ రిఫరీ యెల్లోకార్డ్కు గురయ్యాడు. దీంతో ఇరు జట్ల ప్లేయర్ల మధ్య ఒకింత వాగ్వాదం జరుగగా, రిఫరీ నిలువరించాడు. మ్యాచ్‌లో ముఖ్యంగా కేరళ ్కస్ట్రెకర్స్కు, హైదరాబాద్ డిఫెండర్ల మధ్య పోరు లాగా జరిగింది. హెచ్ఎఫ్సీ రక్షణశ్రేణిని ఛేదించేందుకు కేరళ స్ట్రెకర్లు పలుమార్లు చేసిన ప్రయత్నాలు ఎక్కడా నెరవేరలేదు. మ్యాచ్ 11వ నిమిషంలో కేరళ గోల్‌కీపర్ ప్రభ్‌సుఖన్ గిల్ షాట్ కొట్టే ప్రయత్నంలో పడిపోయి తిరిగి మైదానంలోకి వచ్చాడు. ఇలా ఒకరి గోల్‌పోస్ట్ లక్ష్యంగా ఒకరు చురుకైన దాడులకు పూనుకున్నారు. అయితే మ్యాచ్‌లో ఎక్కువ భాగం బంతిని కేరళ తమ ఆధీనంలో ఉంచుకోగా, హెచ్ఎఫ్సీ దీటుగా నిలువరించింది. మ్యాచ్‌పై పట్టు కోసం ప్రయత్నించిన హైదరాబాద్ 39వ నిమిషంలో చియానిస్కు బదులుగా జేవియర్ సివేరియాను బరిలోకి దింపింది. మ్యాచ్ ప్రథమార్ధం మరి కొద్దిసేపట్లో సివేరియో దాదాపు గోల్ చేసినంత పనిచేశాడు. కానీ అవకాశం తటిలో చేజారడంతో అందరూ నిరాశపడ్డారు. దీంతో ప్రధమార్థం ముగిసే సరికి ఎలాంటి గోల్ నమోదు కాకపోవడంతో స్కోరు 0-0గా నమోదైంది.
గోల్ లక్ష్యంగా:
కీలకమైన ద్వితీయార్ధం అలా మొదలైందో లేదో వరుస నిమిషాల్లో హెచ్ఎఫ్సీ అవకాశాలను సొంతం చేసుకుంది. అయితే వాటిని గోల్స్ చేయడంలో ఒకింత విఫలమైంది. హైదరాబాద్ డిఫెన్స్ ఛేదించే క్రమంలో కేరళ ఎట్టకేలకు సఫలమైంది. మ్యాచ్ 68వ నిమిషంలో స్ట్రెకర్ కేపీ రాహుల్ చేసిన గోల్‌తో కేరళ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మరోవైపు పెనాల్టీ ఏరియా సమీపంలో హెచ్ఎఫ్సీ ప్లేయర్‌ను అడ్డుకోవడంతో రిఫరీ ఫ్రీకిక్ కేటాయించాడు. 76వ నిమిషంలో దక్కిన ఫ్రికిక్ను గోల్‌గా మలువబోయిన ఓగ్బాచె చేసిన ప్రయత్నాన్ని కేరళ గోల్‌కీపర్ గిల్ అడ్డుకోవడంతో సాధ్యపడలేదు. మ్యాచ్ పూర్తయ్యే సమయం గడుస్తున్న కొద్ది హెచ్ఎఫ్సీపై ఒకింత ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. దీన్ని అధిగమించే క్రమంలో 88వ నిమిషంలో అద్భుతమే జరిగింది. హలీచరన్ నర్జారీ అందించిన పాస్‌ను కేరళ ప్లేయర్ హెడర్‌తో అడ్డుకోపోగా, అక్కడే ఉన్న సాహిల్ తవోరా కొట్టిన షాట్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. కేరళ గోల్కీపర్ను ఏమారుస్తూ తవోరా కొట్టిన గోల్‌తో స్టేడియం మొత్తం హౌరెత్తిపోయింది. దీంతో స్కోరు 1-1తో సమం కావడంతో మ్యాచ్ మరింత రసపట్టుగా మారింది. ఆఖర్లో రెండు జట్లు మరో గోల్ కోసం ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
అదనపు సమయంలోనూ:
నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు 1-1తో సమం కావడంతో మ్యాచ్ అదనపు సమయానికి దారితీసింది. ఇందులోనూ రెండు జట్లు కొదమసింహాల్లా తలపడ్డాయి. లీగ్‌లో రెండు జట్ల మధ్య పోరు ఒక రకంగా యుద్ధాన్ని తలపించింది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించే సర్వశక్తులు ఒడ్డారు. ఒకానొక సమయంలో మ్యాచ్ హౌరాహౌరీని తలపించింది. అదనపు సమయంలోనూ రెండు జట్ల స్కోరు 1-1తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు రిఫరీ పెనాల్టీ షూటౌట్ ఖరారు చేశాడు.