Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళల ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా దుమ్మురేపుతోంది. సెమీఫైనల్స్ రేసులో ఆశలు సజీవంగా నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో మిథాలీసేన అద్భుత విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్ 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించారు. ఈ విజయంతో నెట్ రన్‌రేట్‌తో అమాంతం పెంచుకున్న టీమ్ ఇండియా.. సంక్షిష్టంగా మారిన సెమీస్ రేసులో అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.
- 110 పరుగుల తేడాతో భారత్ విజయం
- స్నేహ్ రానా నాలుగు వికెట్ల మాయజాలం
- రాణించిన యస్టికా భాటియా, షెఫాలీ వర్మ
- సెమీస్ రేసులో అమ్మాయిల ఆశలు సజీవం
- ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ 2022
విజయం పట్ల సంతోషంగా ఉంది. బ్యాటింగ్ వైఫల్యం కొన్నిసార్లు జరుగుతుంటుంది. చివరగా 2012లో నేను నిలకడలేని ప్రదర్శన చేశాను. ఇలాంటి పిచ్‌పై పరుగులు చేయటం అంత సులువు కాదు. యస్టికా భాటియా ఇన్నింగ్స్‌కు మాకు కీలకమైంది. చివర్లో స్నేహ్ రానా, పూజ వస్ట్రాకర్ భాగస్వామ్యం మాకు మంచి స్కోరు అందించింది. వికెట్లు పడిపోయినా.. మంచి స్కోరు సాధించటం గొప్పగా ఉంది. ఎంతోకాలంగా స్పిన్నర్లపైనే అధికంగా ఆధారపడ్డాం. మా జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఈ రోజు వికెట్ స్పిన్‌కు అనుకూలించింది. క్రైస్ట్‌చర్చ్‌లో ఇప్పటివరకు ఆడలేదు. తర్వాతి మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నాం'
- మిథాలీ రాజ్, భారత కెప్టెన్
నవతెలంగాణ-హామిల్టన్
భారత స్పిన్ మ్యాజిక్ ముందు బంగ్లాదేశ్ తేలిపోయింది. 230 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. బంగ్లాదేశ్ బ్యాటర్లను క్రీజులో స్వేచ్ఛగా ఆడనివ్వని భారత బౌలర్లు 110 పరుగుల తేడాతో ఘన విజయాన్ని కట్టబెట్టారు. ఈ విజయంతో ఐసీసీ మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్ రేసులో భారత్ మంచి స్థితిలో నిలిచింది. లీగ్ దశలో కీలక మూడో విజయంతో టాప్-4లో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంది!. స్పిన్నర్ స్నేహ్ రానా (4/30), పేసర్ జులన్ గోస్వామి (2/19) వికెట్ల వేటలో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. భారత బౌలర్ల జోరుతో 40.3 ఓవర్లలోనే బంగ్లాదేశ్ 229 పరుగులకు కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. యస్టికా భాటియా (50, 80 బంతుల్లో 2 ఫోర్లు), షెఫాలీ వర్మ (42, 58 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లతో కదం తొక్కారు. భారత్ లీగ్ దశలో తన చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. దక్షిణాఫ్రికాపై విజయం సాధిస్తే భారత్ ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టనుంది.
స్పిన్ మ్యాజిక్ : 230 పరుగుల ఛేదనలో బంగ్లాదేశ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. పవర్‌ప్లే నుంచే క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టిన భారత్.. గెలుపు లాంఛనం చేసుకుంది. స్నిన్‌కు సహకరించిన పిచ్‌పై భారత్ మాయజాలం ప్రదర్శించింది. బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్లో ఎవరూ ఆశించిన ప్రదర్శన చేయలేదు. షర్మిన్ అక్తర్ (5), ఫర్గానా హాక్ (0), నిగర్ సుల్తానా (3), రుమానా అహ్మద్ (2)లు తేలిపోయారు. ఓపెనర్ ముర్షిద ఖాతున్ (19) కొంతసేపు క్రీజులో నిలిచినా.. ప్రయోజనం లేకపోయింది. చివర్లో లత మండల్ (24), సల్మా ఖాతున్ (32) భారత్ విజయాన్ని ఆలస్యం చేశారు. స్పిన్నర్ స్నేహ్ రానా నాలుగు వికెట్లతో చెలరేగింది. దీంతో ఏ దశలోనూ బంగ్లాదేశ్ రన్‌రేట్ మెరుగ్గా లేదు. ముందుగానే చేతులెత్తేసిన బంగ్లాదేశ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. జులన్ గోస్వామి, పూజ వస్ట్రాకర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్‌లు తలా ఓ వికెట్ తీసుకున్నారు.
రాణించిన భాటియా, షెఫాలీ : టాస్ నెగ్గిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతీ మంధాన (30, 51 బంతుల్లో 3 ఫోర్లు), షెఫాలీ వర్మ (42) తొలి వికెట్‌కు అదిరే ఆరంభించారు. బంగ్లాదేశ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఓపెనర్లు 74 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించారు. మంధాన తొలి వికెట్ రూపంలో నిష్క్రమంచగా.. నం.3 బ్యాటర్ యస్టికా భాటియా (50)తో షెఫాలీ జతకట్టింది. గత మ్యాచుల్లో బెంచ్‌కు పరిమితమైన షెఫాలీ వర్మ తనదైన శైలిలో చెలరేగేందుకు ప్రయత్నించింది. అర్థ సెంచరీకి చేరువలో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (0) డకౌట్ కాగా, సీనియర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ (14) రనౌట్‌గా నిష్క్రమించింది. స్వల్ప వ్యవధిలో భారత్ కీలక మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో యస్టికా భాటియా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసింది. 79 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో అర్థ సెంచరీ సాధించిన యస్టికా భాటియా.. ఆ తర్వాతి బంతికే వికెట్ చేజార్చుకుంది. లోయర్ ఆర్డర్లో రిచా ఘోష్ (26), పూజ వస్ట్రాకర్ (30), స్నేహ్ రానా (27) మరోసారి కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లోయర్ ఆర్డర్ మెరుపులతో భారత్ 229 పరుగుల మెరుగైన స్కోరు నమోదు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో రితు మోని మూడు వికెట్లతో మెరిసింది.
స్కోరు వివరాలు :
భారత మహిళల ఇన్నింగ్స్ : స్మృతీ మంధాన (సి) హాక్ (బి) నహిద అక్తర్ 30, షెఫాలీ వర్మ (స్టంప్డ్) నిగర్ సుల్తానా (బి) రితు మోని 42, యస్టికా భాటియా (సి) నహిద అక్తర్ (బి) రితు మోని 50, మిథాలీ రాజ్ (సి) ఫహిమ ఖాతున్ (బి) రితు మోని 0, హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్ 14, రిచా ఘోష్ (సి) నిగర్ సుల్తానా (బి) నహిద అక్తర్ 26, పూజ వస్ట్రాకర్ నాటౌట్ 30, స్నేV్‌ా రానా (సి) రితు మోని (బి) జహనర ఆలం 27, జులన్ గోస్వామి నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు :8, మొత్తం : (50 ఓవర్లలో 7 వికెట్లకు) 229.
వికెట్ల పతనం : 1-74, 2-74, 3-3-74, 4-108, 5-162, 6-176, 7-224.
బౌలింగ్ : సల్మా ఖాతున్ 8-1-23-0, జహనర ఆలం 8-0-52-1, నహిద అక్తర్ 9-0-42-2, రితు మోని 10-2-37-3, రుమానా అహ్మద్ 8-1-27-0, లత మండల్ 4-0-20-0, ఫహిమ ఖాతున్ 3-0-22-0.
బంగ్లాదేశ్ మహిళల ఇన్నింగ్స్ : ముర్షిద ఖాతున్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) పూనమ్ యాదవ్ 19, షర్మిన్ అక్తర్ (సి) స్నేV్‌ా రానా (బి) రాజేశ్వరి గైక్వాడ్ 5, ఫర్గానా హాక్ (ఎల్బీ) పూజ వస్ట్రాకర్ 0, నిగర్ సుల్తానా (సి) హర్మన్‌ప్రీత్ (బి) స్నేV్‌ా రానా 3, రుమానా అహ్మద్ (సి) యస్టికా భాటియా (బి) స్నేV్‌ా రానా 2, లత మండల్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) పూజ వస్ట్రాకర్ 24, సల్మా ఖాతున్ (సి) రిచా ఘోష్ (బి) జులన్ గోస్వామి 32, రితు మోని (బి) జులన్ గోస్వామి 16, ఫహిమ ఖాతున్ (ఎల్బీ) స్నేV్‌ా రానా 1, నహిద అక్తర్ (సి,బి) స్నేV్‌ా రానా 0, జహనర ఆలం నాటౌట్ 11, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం :(40.3 ఓవర్లలో ఆలౌట్) 119.
వికెట్ల పతనం : 1-12, 2-15, 3-28, 4-31, 5-35, 6-75, 7-98, 8-100, 9-104, 10-119.
బౌలింగ్ : జులన్ గోస్వామి 7.3-1-19-2, రాజేశ్వరి గైక్వాడ్ 10-4-15-1, పూజ వస్ట్రాకర్ 6-0-26-2, స్నేహ్ రానా 10-2-30-4, పూనమ్ యాదవ్ 7-0-25-1.
మన చేతుల్లోనే..!
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ సెమీఫైనల్ అవకాశాలు మన చేతుల్లోనే ఉంది. గ్రూప్ దశలో ఆరు మ్యాచులు ఆడిన టీమ్ ఇండియా మూడు విజయాలు సాధించింది. మూడు మ్యాచుల్లో పరాజయాలు చవిచూసింది. ఆరు పాయింట్లు సాధించిన టీమ్ ఇండియా.. ఆదివారం చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంది. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధిస్తే నేరుగా సెమీస్‌కు చేరుకోనుంది. మిగతా మ్యాచుల ఫలితాలు ఏ విధంగానూ భారత్‌పై ప్రభావం చూపలేవు. ఒకవేళ దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి చవిచూసినా.. మరో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను సైతం దక్షిణాఫ్రికా ఓడిస్తే భారత్‌కు సెమీస్‌కు చేరుకోనుంది. అప్పుడు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లతో పాటు భారత్ సెమీస్‌కు అర్హత సాధించనుంది. ఒకవేళ దక్షిణాఫ్రికాను వెస్టిండీస్ ఓడించి.. సఫారీలు భారత్‌పై విజయం సాధిస్తే అప్పుడు భారత ఆశలకు తెరపడనుంది. సఫారీలు, కంగారూలు, కరీబియన్లతో పాటు ఇంగ్లాండ్ సెమీస్‌లో అడుగపెట్టనుంది. బంగ్లాదేశ్‌పై భారీ విజయంతో భారత్ నెట్‌రన్‌రేట్ భారీగా మెరుగుపర్చుకుంది. ఈ అంశంలో టోర్నీలోనే భారత్ అత్యంత మెరుగైన స్థితిలో కొనసాగుతోంది. సెమీఫైనల్స్ అవకాశాలు పూర్తిగా చేతుల్లోనే ఉండటంతో ఆదివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కీలకం కానుంది.