Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నై కెప్టెన్సీ వదిలేసిన ధోని
- రవీంద్ర జడేజాకు సారథ్య పగ్గాలు
- కెప్టెన్ కూల్ షాకింగ్ నిర్ణయం
నవతెలంగాణ-ముంబయి
ఓ శకం ముగిసింది. కెప్టెన్ కూల్ ఎం.ఎస్ ధోని సారథ్య మహిమకు ముగింపు పలికాడు. భారత క్రికెట్లో అత్యుత్తమ సారథిగా కీర్తి గడించిన మహేంద్రసింగ్ ధోని.. అంతర్జాతీయ కెరీర్‌కు ముగించడానికి ముందే నాయకత్వ పగ్గాలు వారసుడి చేతుల్లో పెట్టిన సంగతి తెలిసిందే. అదే తరహాలోనూ చెన్నై సూపర్కింగ్స్లోనూ ఎటువంటి హడావిడికి తావులేకుండా సాదాసీదాగా సారథ్యం వదిలేశాడు. కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు. మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 15 ఆరంభం కానుండగా ఎం.ఎస్ ధోని ఆశ్చర్యకర నిర్ణయం తీసుకోవటం అభిమానులకు షాక్‌కు గురి చేసింది.
మహేంద్రసింగ్ ధోని సారథ్య మహిమకు పూర్తిగా ముగింపు పలికాడు. భారత కెప్టెన్సీ వదిలేసిన ధోని.. కొంత కాలం ఆటగాడిగా జట్టులో కొనసాగాడు. నాయకత్వం సరైన వ్యక్తి చేతుల్లో ఉందనే విశ్వాసం కలిగే వరకు ఎదురు చూసిన ఎం.ఎస్ ధోని అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించాడు. ఐపీఎల్ 2022 మార్చి 26న ఆరంభం కానుండగా.. సరిగ్గా రెండు రోజుల ముందు ధోని ఆశ్చర్యకర నిర్ణయాన్ని వెల్లడించాడు. నాయకుడిగా ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ బాధ్యతల నుంచి తప్పుకున్న ఎం.ఎస్ ధోని.. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఆ బాధ్యతలు అప్పగించాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ జడేజాకు మెంటార్‌కు విలువైన పాత్ర పోషిస్తాడని చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం పేర్కొంది. మార్చి 26న కోల్‌కత నైట్‌రైడర్స్‌తో ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ టైటిల్ వేట షురూ చేయనుంది.
ఇది ధోనీ నిర్ణయం : సూపర్‌కింగ్స్ సారథ్య పగ్గాలు వదులుకోవటం పూర్తిగా ధోని నిర్ణయమని ఆ జట్టు యాజమాన్యం, సీఈఓ కాశీ విశ్వనాథ్ వెల్లడించాడు. జట్టు ప్రయోజనాలకు దృష్టిలో ఉంచుకునే ధోని ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. ప్రాంఛైజీ యాజమాన్యానికి ఇది ఇష్టం లేకపోయినా.. మహి ఈ నిర్ణయానికి కట్టుబడ్డాడు అని కాశీ విశ్వనాథ్ తెలిపారు. 'చెన్నై సూపర్‌కింగ్స్ నాయకత్వ మార్పిడి ప్రశాంతంగా జరగాలని ధోని భావించాడు. దీని గురించి ఆలోచన మహి మదిలో ఎప్పటి నుంచో ఉంది. రవీంద్ర జడేజాకు సారథ్య పగ్గాలు అప్పగించేందుకు ఇదే సరైన సమయమని ధోని భావించాడు. జడేజా కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు, చెన్నై సారథ్యానికి ఇది మంచి తరుణం అనిపించింది. గత ఏడాది సైతం నాయకత్వం అంశం చర్చకు వచ్చింది. ముందు నుంచీ మా ఆలోచనల్లో జడేజా ఉన్నాడు. సూపర్‌కింగ్స్‌కు ఏది మంచి అవుతుందో ధోని అదే చేస్తాడు. భారత జట్టులో నాయకత్వ మార్పిడి తరహాలోనే సూపర్‌కింగ్స్‌లో చేశాడు. కొంతకాలం విరాట్ కోహ్లిని నాయకుడిగా ఎదగనిచ్చి.. అతడి చేతికి పగ్గాలు అప్పగించాడు. సూపర్‌కింగ్స్‌లో జడేజాను సైతం అదే విధంగా నాయకత్వ బృందంలో భాగం చేశాడు. ఇప్పుడు సారథ్య బాధ్యతలు అప్పగించాడు. ప్రాంఛైజీని గెలుపు బాటలో నడపగల సామర్థ్యం జడేజా సొంతం. అతడు మంచి ఆల్‌రౌండర్. ఎం.ఎస్ ధోని మార్గదర్శనం అతడికి ఎప్పటికి ఉంటుంది' అని కాశీ విశ్వనాథ్ తెలిపారు. సోమవారం ప్రాక్టీస్ సెషన్‌కు వెళ్లడానికి ముందు జట్టు సమావేశంలో నాయకత్వ వీడ్కోలు నిర్ణయాన్ని వెల్లడించిన ధోని.. తనదైన శైలిలో సహచరులనూ ఆశ్చర్యానికి గురి చేశాడు.
కొత్త కెప్టెన్ జడేజా : చివరగా దేశవాళీ క్రికెట్లో (అండర్-19) నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించిన రవీంద్ర జడేజా ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ప్రాంఛైజీకి సారథి అవుతాడని పెద్దగా ఎవరూ ఊహించలేదు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రానున్న రెండు సీజన్లలో రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాడి చేతికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తారనే అంచనాలు వినిపించాయి. కానీ ఊహకందని నిర్ణయాలు తీసుకోవటంలో తిరుగులేని ఎం.ఎస్ ధోని.. రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా ఎంపిక చేసి మరో ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నాడు. 2012 నుంచి చెన్నై సూపర్‌కింగ్స్ శిబిరంలో భాగమైన రవీంద్ర జడేజా.. ఆ జట్టు విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నాడు. ఎం.ఎస్ ధోని, సురేశ్ రైనా అనంతరం సూపర్‌కింగ్స్‌కు కెప్టెన్సీ వహించనున్న మూడో ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలువనున్నాడు. ఐపీఎల్లో స్వదేశీ కెప్టెన్‌ను మాత్రమే కలిగిన ఏకైక ప్రాంఛైజీగా చెన్నై సూపర్‌కింగ్స్ తన మార్క్‌ను కొనసాగిస్తోంది. నాయకత్వ బృందంలో భాగంగా ఉంటున్న జడేజా.. ఇప్పుడు నాయకుడిగా కొత్త బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తాడనేది ఆసక్తికరం. అత్యంత నిలకడైన రికార్డులు కలిగిన సూపర్‌కింగ్స్‌ను జడ్డూ ఏ మేరకు ముందుకు నడిపిస్తాడో చూడాలి. ' చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్‌గా ఎంపిక కావటం సంతోషంగా ఉంది. ఇదే సమయంలో ఎం.ఎస్ ధోని వంటి దిగ్గజం స్థానం భర్తీ చేయాలి. ముందుకు తీసుకెళ్లాల్సిన గొప్ప వారసత్వాన్ని అతడు సృష్టించాడు. ధోని ఎప్పుడూ సలహాలు ఇవ్వడానికి అందుబాటులో ఉండటంతో మైదానంలో నేను కంగారు పడాల్సిన అవసరం ఉండదు. నాయకత్వం గురించి పెద్దగా ఆందోళన లేదు. ధోని అండతో సంతోషంగా కెప్టెన్సీ వహిస్తాను' అని రవీంద్ర జడేజా పేర్కొన్నాడు.
'చెన్నై సూపర్‌కింగ్స్ సారథిగా ఎం.ఎస్ ధోని తప్పుకోవటం ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి గత సీజన్లో సూపర్‌కింగ్స్‌ను చాంపియన్‌గా నిలిపిన అనంతరం ధోని కెప్టెన్సీ వదిలేస్తాడని అనుకున్నాం. కానీ ధోని ఆ పని చేయలేదు. కనీసం ఈ సీజన్లోనైనా ధోని కచ్చితంగా కెప్టెన్సీ వహిస్తాడని అనుకున్నాం. సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకునే నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసింది'
- ఎమ్మెస్కే ప్రసాద్, మాజీ చీఫ్ సెలక్టర్
అల్విదా నాయకా!
213 మ్యాచులు, 130 విజయాలు, 81 పరాజయాలు, ఆరు ట్రోఫీలు. చెన్నై సూపర్‌కింగ్స్ నాయకుడిగా మహేంద్రసింగ్ ధోని రికార్డులు ఇవి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సూపర్‌కింగ్స్‌ను 12 సీజన్లలో ఏకంగా 11 సీజన్లు ప్లే ఆఫ్స్/సెమీఫైనల్స్‌కు చేర్చిన ధోని..చాంపియన్స్ లీగ్ టీ20లో రెండు సార్లు సూపర్‌కింగ్స్‌ను విజేతగా నిలిపాడు. ఐపీఎల్లో అత్యధికంగా తొమ్మిది సార్లు టైటిల్ పోరులో తలపడిన జట్టుగా చెన్నై సూపర్‌కింగ్స్ రికార్డు నెలకొల్పగా.. అందులో నాలుగు సార్లు సూపర్‌కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది. రెండేండ్ల నిషేధం అనంతరం సీజన్లోనే సూపర్‌కింగ్స్‌ను ఐపీఎల్ చాంపియన్‌గా నిలిపిన ఎం.ఎస్ ధోని.. గత సీజన్లో సైతం ఐపీఎల్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. గెలుపు ఓటముల పరంగా ధోని రికార్డు 1.604తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. చెన్నై సూపర్‌కింగ్స్ నాయకుడిగా ధోని విజయ శాతం 60. ఎం.ఎస్ ధోని నాయకత్వ ప్రతిభతో ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను అత్యంత విజయవంతమైన ప్రాంఛైజీగా నిలబెట్టాడు. ధోని కెప్టెన్సీతో సూపర్‌కింగ్స్ బ్రాండింగ్ సైతం అమాంతం పెరిగింది.
'2007 ఐసీసీ టీ20 ప్రపంచకప్ నెగ్గిన సారథిగా ఎం.ఎస్ ధోని అప్పుడు ఊపు మీదున్నాడు. జాతీయ జట్టు పగ్గాలు అందుకున్న తొలి ప్రయత్నంలోనే మెగా టైటిల్ అందుకున్నాడు. ధోని నాయకత్వ లక్షణాలు గమనించిన విబి చంద్రశేఖర్ ఆ విషయాన్ని ఇండియా సిమెంట్స్ యజమాని, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్‌కు చెప్పారు. ఆటగాళ్ల వేలంలో ఎంత ధరకైనా సరే ధోనీని తీసుకోవాలని వేలంలో ఉన్న ప్రాంఛైజీ ప్రతినిధులకు శ్రీనివాసన్ సూచించారు. ఐపీఎల్ తొలి వేలంలో రికార్డు ధరకు చెన్నై సూపర్‌కింగ్స్ గూటికి చేరుకున్న ఎం.ఎస్ ధోని.. ప్రాంఛైజీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తనపై వెచ్చించిన ధరకు వడ్డీతో సహా సూపర్‌కింగ్స్‌కు తిరిగి చెల్లించాడు!'. ఐపీఎల్లో సూపర్‌కింగ్స్ నాయకత్వం సైతం భారత జట్టు కెప్టెన్‌గా ధోనికి కలిసొచ్చింది. ఐపీఎల్లో సూపర్‌కింగ్స్ నాయకత్వం 2011లో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ విజయ సాథనలో గొప్పగా ఉపయోగపడింది. జాతీయ జట్టు కెప్టెన్‌గా ఎవరూ అందుకోలేని రికార్డులు నెలకొల్పిన ధోని.. సూపర్కింగ్స్లోనూ అదే పని చేశాడు. జాతీయ జట్టులో ధోని లేని లోటును ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుండగా.. ఐపీఎల్‌లోనైనా మహి నాయకత్వం ఆస్వాదిస్తున్నామనే ఆనందం అభిమానుల్లో ఉండేది. నాయకత్వ మహిమకు పూర్తిగా ముగింపు పలికిన మహేంద్రుడు.. అద్వితీయ శకానికి తెర దించాడు.