Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఐపీఎల్ 15 సీజన్ షురూ
- పది జట్లు, నాలుగు వేదికలతో సరికొత్త శోభ
- మెగా క్రికెట్ హంగామాకు రంగం సిద్ధం
ప్రపంచ అతిపెద్ద క్రికెట్ వేడుకకు రంగం సిద్ధమైంది. పది జట్లు, నాలుగు వేదికల్లో టైటిల్ రేసు మొదలు పెట్టనున్నాయి. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఓ సీజన్ టైటిల్ ఫేవరేట్ లేకుండానే ఆరంభం కాబోతుంది. పది జట్ల ఐపీఎల్లో ఆటగాళ్ల వేలం అనంతరం ఏ జట్టు సైతం స్పష్టమైన ఫేవరేట్‌గా అవతరించలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ నేడు డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కత నైట్‌రైడర్స్ పోరుతో ఆరంభం కానుంది. ఐపీఎల్ హంగామాకు తెరలేవనున్న తరుణంలో ఈ సీజన్‌ను ప్రభావితం చేసే అంశాలను ఓసారి చూద్దాం.
నవతెలంగాణ-ముంబయి
పవర్‌ప్లే-ఫాస్ట్ బౌలర్లు :
ఐపీఎల్ గత రెండు సీజన్లు యుఏఈలోనే జరిగింది. క్రికెట్ హంగామా పూర్తిగా భారత్‌కు తిరిగొచ్చిన వేళ.. బ్యాటర్లు చిన్న బౌండరీలు, మంచు ప్రభావంపై కన్నేయనున్నారు. పేస్ బౌలర్లు ఇక్కడ సక్సెస్ కోసం తహతహ లాడనున్నారు. ప్రత్యేకించి వాంఖడే స్టేడియంలో జరిగే 20 మ్యాచుల్లో పేసర్ల ప్రభావం స్పష్టంగా ఉండనుంది. గత సీజన్ ఇక్కడ ఆడిన మ్యాచుల్లో (ప్రథమార్థం) పవర్‌ప్లేలో పేసర్లు ఎక్కువ ప్రభావం చూపారు. తొలి ఆరు ఓవర్లలో పేసర్లు 33 వికెట్లకు గాను 31 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. వాంఖడేలో జరిగిన 20 ఇన్నింగ్స్‌ల గణాంకాలు ఇవి. పవర్‌ప్లేలో అతి తక్కువ స్కోరు నమోదైన స్టేడియంగా సైతం వాంఖడే నిలిచింది. ఇక్కడ 2021 ఐపీఎల్లో సగటు పవర్‌ప్లే స్కోరు 7.22. ఆటగాళ్ల వేలంలో ప్రాంఛైజీలు భారత పేసర్లపై అధిక మొత్తం వెచ్చించాయి. టోర్నీ ఆరంభంలోనే ప్రాంఛైజీలు పేసర్ల నుంచి రాబడి పొందనున్నారు!.
నయా రూల్-టర్నింగ్ పాయింట్! :
ఈ ఏడాది ఐపీఎల్ సరికొత్త నిబంధనలు చూడబోతుంది. ప్రతి ఇన్నింగ్స్‌కు రెండు డిఆర్ఎస్ రివ్యూలతో పాటు నూతన క్రీడా నియామవళి అమల్లోకి రానుంది. ఈ నిబంధనలు ఈ సీజన్ ఐపీఎల్‌పై విప్లవాత్మక ప్రభావం చూపించనున్నాయి. క్యాచౌట్ సయమంలో నాన్ స్ట్రయికర్ సగం పిచ్ దాటేశాడా?లేదా అని చూడకుండా నేరుగా కొత్త బ్యాటర్ స్ట్రయిక్ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో రానున్న బలహీన బ్యాటర్‌ను నాన్ స్ట్రయిక్‌కు పరిమితం చేసేందుకు క్యాచౌట్‌గా నిష్క్రమించే సమయంలో మెరుగైన బ్యాటర్‌ను స్ట్రయిక్‌లో నిలిపేందుకు జట్లు ప్రయత్నించేవి. క్యాచౌట్ ఆ ఓవర్ చివరి బంతికి సంభవించినప్పుడు మాత్రమే కొత్త బ్యాటర్ నాన్ స్ట్రయిక్ తీసుకోవాల్సి ఉంది. ఈ నిబంధన ప్రభావం డెత్ ఓవర్లలో బలంగా కనిపించనుంది.
గత సీజన్ క్వాలిఫయర్1లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్‌లో చివరి ఓవర్ తొలి బంతికి మోయిన్ అలీ క్యాచౌట్ అయ్యాడు. అంతకముందు ఓవర్లో అవేశ్ ఖాన్‌ను భారీ సిక్సర్‌గా సంధించిన ధోని.. వేగంగా క్రీజు దాటేసి స్ట్రయిక్ తీసుకున్నాడు. మరో రెండు బంతులు ఉండగానే ఛేదన ముగించాడు. నూతన నిబంధనల ప్రకారం ధోని నాన్ స్ట్రయిక్లోనే ఉండాలి. కొత్త బ్యాటర్ రవీంద్ర జడేజా స్ట్రయిక్‌తో టామ్ కరన్‌ను ఎదుర్కొవాల్సి ఉండేది. ఈ రూల్ ప్రభావం ఉత్కంఠ మ్యాచుల్లో ప్రస్ఫుటంగా కనిపించనుంది.
7.30 మ్యాచ్- మంచు ప్రభావం :
ఐపీఎల్ రాత్రి 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటలకు మారిన సంగతి తెలిసిందే. మ్యాచులు అర్థరాత్రి వరకు సాగకుండా చూసేందుకు బీసీసీఐ, ప్రసారదారు మ్యాచ్ ఆరంభ సమయంలో మార్పు తీసుకొచ్చారు. 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభిస్తే తొలుత బౌలింగ్ చేసిన జట్టుకు అధిక ప్రయోజనం కలుగుతోందని ఎం.ఎస్ ధోని గత సీజన్లో వ్యాఖ్యానించాడు. సహజంగా రాత్రి 8 గంటల ప్రాంతంలో మంచు ప్రభావం ఆరంభం అవుతుంది. 7.30 మ్యాచ్‌లో పవర్‌ప్లేలో 20-30 అధిక పరుగులు చేసేందుకు బ్యాటర్లపై ఒత్తిడి నెలకొంటుంది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే జట్టు పవర్‌ప్లేలో వికెట్ల కోసం ఒత్తిడికి లోనవుతోంది. దీనిపై ఫిర్యాదులు ఉన్నప్పటికీ మ్యాచ్ సమయంలో మార్పు లేదు. మంచు ప్రభావం గమనంలో ఉంచుకుని జట్లు టాస్కు వెళ్లనున్నాయి.
నాలుగు వేదికలు-చిన్న బౌండరీలు :
ఐపీఎల్ 15కు ఆతిథ్యం ఇవ్వనున్న నాలుగు వేదికల్లోనూ స్ట్రయిట్ బౌండరీలు చిన్నవే. స్ట్రయిట్ బౌండరీ సుమారు 64 మీటర్లు. దీంతో బ్యాటర్లు బౌలర్ల మీదుగా బౌండరీలు బాదకుండా నిలువరించటం కఠిన సవాల్. ఆఫ్ సైడ్, లెగ్ లైడ్ ఆడించేందుకు బంతిని ఆఫ్ స్టంప్‌కు ఆవలగా సంధించటం ఓ ప్రత్యామ్నాయం. అయితే, నాలుగు వేదికల్లోనూ లీగ్ దశలో ఐదు పిచ్‌లను వాడనున్నారు. అన్ని మ్యాచులకు పిచ్‌లను తాజాగా ఉంచటం కోసం ఐదు పిచ్‌ల ప్రణాళిక రూపొందించారు. దీంతో మైదానంలో ఏదో ఒక వైపు బౌండరీ సైతం తక్కువ దూరంలోనే ఉండనుంది. బౌండరీ హద్దులను దృష్టిలో ఉంచుకుని బౌలర్లు బంతులు వేయాల్సి ఉంటుంది. మ్యాచ్ ప్రణాళికల్లో దీని ప్రభావం కనిపించనుంది.
మణికట్టు వర్సెస్ ఫింగర్ స్పిన్ :
ఐపీఎల్ నాలుగు వేదికల్లో పిచ్‌లు విభిన్నమైన స్వభావం కలిగి ఉన్నాయి. ప్రతి పిచ్‌పైనా గణాంకాలు స్పిన్నర్లకు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. స్పిన్ ప్రభావం ఉండదు అని పూర్తిగా చెప్పలేం, కానీ మ్యాచ్ ద్వితీయార్థంలో పిచ్ నుంచి టర్న్ లభించనుంది. మణికట్టు స్పిన్నర్లు బంతిని గాల్లోనే గింగిరాలు తిప్పగలిగితే మ్యాచ్ ప్రథమార్థంలోనే పైచేయి సాధించగలరు. సంప్రదాయ లెగ్ స్పిన్నర్లతో పోల్చితే మణికట్టు మాయగాళ్లకే ఇక్కడ అనుకూలత ఎక్కువ. కుల్దీప్ యాదవ్‌తో పోల్చితే రషీద్ ఖాన్, రవి బిష్ణోరులు విజయవంతం కాగలరు. బౌన్స్, చిన్న బౌండరీలు, మంచు ప్రభావం మణికట్టు స్పిన్నర్లపైనా ప్రభావం చూపుతుంది. మ్యాచులు సాగుతున్న కొద్ది పిచ్ స్వభావంలో మార్పులు చోటుచేసుకునే సమయంలో ఫింగర్ స్పిన్నర్ల పాత్ర సీన్లోకి రానుంది.
నయా నాయకులు :
ఐపీఎల్ 2022 నలుగురు కొత్త కెప్టెన్లను ఆవిష్కరించనుంది. మయాంక్ అగర్వాల్ (పంజాబ్ కింగ్స్), హార్దిక్ పాండ్య (గుజరాత్ టైటాన్స్), రవీంద్ర జడేజా (చెన్నై సూపర్‌కింగ్స్), డుప్లెసిస్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూర్)లు కొత్తగా నాయకత్వ పగ్గాలు అందుకున్నారు. ఈ నలుగురిలో డుప్లెసిస్‌కు మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్సీ అనుభవం ఉంది. విరాట్ కోహ్లి జాతీయ జట్టు నాయకుడిగా విజయవంతమైనా.. 9 సీజన్లలో బెంగళూర్‌ను ఒక్కసారి విజేతగా నిలుపలేకపోయాడు. ఆర్సీబీ కెప్టెన్సీ పగ్గాలు డుప్లెసిస్‌కు కొత్త సవాలే. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ కఠిన సవాల్ ఎదుర్కొనున్నాడు. చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే అండ ఆనందం కలిగించినా.. జట్టులో విధ్వంసక బ్యాటర్ల నమ్మకం సంపాదించటం మయాంక్ తక్షణ కర్తవ్యం. తొలి టైటిల్ నెగ్గాలనే యాజమాన్యం తపన సైతం మయాంక్‌పై ఒత్తిడి పెంచనుంది. ఐపీఎల్ ఆరంభానికి 48 గంటల ముందు అగ్రజట్టు చెన్నై సూపర్‌కింగ్స్ నాయకత్వ మార్పు ప్రకటించింది. దిగ్గజ నాయకుడు ధోని నుంచి రవీంద్ర జడేజా సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. నేడు కోల్‌కత నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో జడ్డూ తొలి పరీక్ష ఎదుర్కొనున్నాడు.
స్వదేశీ ప్రతిభకు పరీక్ష! :
ఐపీఎల్ పది జట్లకు చేరుకోవటంతో లీగ్ అగ్ని పరీక్షకు సిద్ధమైంది. పది జట్ల ఐపీఎల్ టోర్నీ నాణ్యత నిరూపించుకోవాల్సి ఉంది. కొంత మంది ఆటగాళ్ల కోసం ప్రాంఛైజీలు కోట్లు కుమ్మరించడానికి సిద్ధపడ్డారు. అవసరానికి తగినంత మంది ఆటగాళ్లు అందుబాటులో లేరు అనేందుకు అదే సంకేతం. 2011లో ఐపీఎల్ తొలిసారి పది జట్లతో ఆడినప్పుడు అధికంగా ఏకపక్ష మ్యాచులు కనిపించాయి. ఈ సీజన్లోనూ ఆ ప్రమాదం లేకపోలేదు. 2016 నుంచి ప్లే ఆఫ్స్ బెర్త్‌లు చివరి లీగ్ మ్యాచ్ పూర్తయితే తేలుతుంది. ఈ సీజన్లో ఆ మ్యాజిక్ కనుమరుగు కానుంది. టోర్నీ నాణ్యతను రక్షించేందుకు విదేశీ ఆటగాళ్ల కోటాను ఐదుగురుకి పెంచాలని నిపుణులు చెబుతున్నారు. అది కార్యరూపం దాల్చకపోవచ్చు. స్వదేశీ ఆటగాళ్ల సత్తాను నమ్ముకున్న ప్రాంఛైజీలు ఐపీఎల్ స్థాయి ఒత్తిడిని తట్టుకునేలా వారికి శిక్షణ ఇవ్వటంలో విఫలమైతే.. చివరి దశలో ఉత్కంఠ మ్యాచుల్లో ఫలితాలు ఏకపక్షంగా రానున్నాయి.