Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూపర్‌కింగ్స్‌పై అలవోక విజయం
- ధోని అర్థ శతక పోరాటం వృథా
- మొదలైన ఐపీఎల్ 15 హంగామా
నవతెలంగాణ-ముంబయి
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు కోల్‌కత నైట్‌రైడర్స్ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ 15 ఆరంభ మ్యాచ్‌లో చెన్నైపై ఆరు వికెట్ల తేడాతో కోల్‌కత గెలుపొందింది. నైట్‌రైడర్స్ పేసర్లు, స్పిన్నర్లు మెరిసిన వేళ చెన్నై పరుగుల వేటలో వెనుకబడింది. ఎం.ఎస్ ధోని (50 నాటౌట్, 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్థ సెంచరీతో తొలుత చెన్నై 131/5 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కత ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ అజింక్య రహానె (44, 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో కోల్‌కత ఛేదన సులువైంది. లక్ష్యం చిన్నది కావటంతో చెన్నై బౌలర్లు మెరుగ్గా బంతులేసినా.. ప్రయోజనం లేకపోయింది. వెంకటేశ్ అయ్యర్ (16), నితీశ్ రానా (16), శామ్ బిల్లింగ్ (25)లు రాణించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (20 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌తో మరో 9 బంతులు ఉండగానే లాంఛనం ముగించాడు. ఐపీఎల్ 15ను చెన్నై పరాజయంతో ప్రారంభించగా.. కోల్‌కత అలవోక విజయంతో బోణీ కొట్టింది.
ఆదుకున్న ధోని : టాస్ నెగ్గిన కోల్‌కత నైట్‌రైడర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో మంచు ప్రభావం లేని వేళ పవర్‌ప్లేలో బ్యాటర్లను ఒత్తిడికి గురి చేయవచ్చనే ఆలోచన ఫలించింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆరంభంలో ఏదీ కలిసి రాలేదు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (0), డెవాన్ కాన్వే (3)లు ఉమేశ్ యాదవ్‌కు వికెట్లు కోల్పోయారు. ఓపెనర్ల నిష్క్రమణతోనే స్కోరు వేగం మందగించింది. రాబిన్ ఉతప్ప (28, 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు చూపించాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో కదం తొక్కాడు. స్వల్ప విరామంలో ఉతప్ప, అంబటి రాయుడు (15) నిష్క్రమణతో చెన్నై సూపర్‌కింగ్స్ ఒత్తిడిలో పడింది. జడేజాతో సమన్వయ లోపంతో రాయుడు రనౌట్ చెన్నైకి గట్టి ఎదురుదెబ్బ. 15 ఓవర్లలో 73/5తో ఉన్న సూపర్‌కింగ్స్‌ను ఎం.ఎస్ ధోని ఆదుకున్నాడు. సహచర బ్యాటర్లు పరుగుల వేటలో తడబడుతున్న వేళ మహి అర్థ సెంచరీతో మెరిశాడు. ఆరంభంలో ధోని కాస్త ఇబ్బంది పడినా.. డెత్ ఓవర్లలో విశ్వరూపం చూపించాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 బంతుల్లో ఐపీఎల్లో 24వ అర్థ సెంచరీ సాధించాడు. ఓ ఎండ్‌లో రవీంద్ర జడేజా (26 నాటౌట్) సైతం ఇబ్బంది పడగా.. ధోని అలవోకగా బౌండరీలు బాదాడు. ధోని ధనాధన్‌తో చివరి మూడు ఓవర్లలోనే చెన్నై 47 పరుగులు సాధించింది. చివరి ఐదు ఓవర్లలో 58 పరుగులు పిండుకున్న సూపర్‌కింగ్స్ మెరుగైన స్కోరు నమోదు చేసింది. కోల్‌కత నైట్‌రైడర్స్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ (2/20) రాణించాడు.
స్కోరు వివరాలు :
చెన్నై సూపర్‌కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (సి) రానా (బి) ఉమేశ్ యాదవ్ 0, డెవాన్ కాన్వే (సి) శ్రేయస్ (బి) ఉమేశ్ యాదవ్ 3, రాబిన్ ఉతప్ప (స్టంప్డ్) జాక్సన్ (బి) వరుణ్ 28, అంబటి రాయుడు రనౌట్ 15, రవీంద్ర జడేజా నాటౌట్ 26, శివం దూబె (సి) నరైన్ (బి) రసెల్ 3, ఎం.ఎస్ ధోని నాటౌట్ 50, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం :(20 ఓవర్లలో 5 వికెట్లకు) 131.
వికెట్ల పతనం : 1-2, 2-28, 3-49, 4-52, 5-61.
బౌలింగ్ : ఉమేశ్ యాదవ్ 4-0-20-2, శివం మావి 4-0-35-0, వరుణ్ చక్రవర్తి 4-0-23-1, సునీల్ నరైన్ 4-0-15-0, అండ్రీ రసెల్ 4-0-38-1.
కోల్‌కత నైట్‌రైడర్స్ : రహానె (సి) జడేజా (బి) శాంట్నర్ 44, అయ్యర్ (సి) ధోని (బి) బ్రావో 16, రానా (సి) రాయుడు (బి) బ్రావో 21, శ్రేయస్ నాటౌట్ 20, బిల్లింగ్ (సి) తుషార్ (బి) బ్రావో 25, జాక్సన్ నాటౌట్ 3, ఎక్స్టాలు : 04, మొత్తం : (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 133.
వికెట్ల పతనం : 1-43, 2-76, 3-87, 4-123.
బౌలింగ్ : తుషార్ 3-0-23-0, మిల్నె 2.3-0-19-0, శాంట్నర్ 4-0-31-1, బ్రావో 4-0-19-3, దూబె 1-0-11-0, జడేజా 4-0-25-0.