Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం
- ప్రపంచకప్ నుంచి భారత్ నిష్క్రమణ
క్రైస్ట్‌చర్చ్ : సెమీఫైనల్స్‌కు చేరుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్. బ్యాటర్ల మెరుపులతో ప్రత్యర్థి ముందు 275 పరుగుల భారీ లక్ష్యం. నిలకడలేమి ప్రదర్శనతో నిరాశపరిచిన భారత్ మరోసారి అదే పని చేసింది. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన లీగ్ దశ చివరి మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో పరా జయం పాలైంది. లీగ్ దశలో ఐదో స్థానానికి పరిమితమైంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించింది. ఛేదనలో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ లిజెల్లె లీ (6) విఫలమైనా.. లారా (80, 79 బంతుల్లో 11 ఫోర్లు), లారా గుడ్‌ఆల్ (49, 69 బంతుల్లో 4 ఫోర్లు) రెండో వికెట్‌కు 125 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. మిడిల్ ఆర్డర్లో మిగ్నాన్ డు ప్రీజ్ (52 నాటౌట్, 63 బంతుల్లో 2 ఫోర్లు), మరిజానా కాప్ (32), సునె లుస్ (22)లు రాణించారు. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి ఏడు పరుగులు అవసరం. రెండో బంతికి రనౌట్‌తో సఫారీపై ఒత్తిడి పెరిగింది. ఐదో బంతికి మిగ్నాన్ క్యాచౌట్తో భారత్ గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ దీప్తి శర్మ నో బాల్ వేయటంతో సఫారీ ఓ పరుగుతో పాటు కీలక బ్యాటర్‌ను క్రీజులో నిలుపుకుంది. చివరి రెండు బంతులకు రెండు పరుగులు రాబట్టిన దక్షిణాఫ్రికా ఉత్కంఠ విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 274 పరుగుల భారీ స్కోరు సాధించింది. మంధాన (71, 84 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), షెఫాలీ వర్మ (53, 46 బంతుల్లో 8 ఫోర్లు), మిథాలీ రాజ్ (68, 84 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ సెంచరీలకు తోడు హర్మన్‌ప్రీత్ కౌర్ (48, 57 బంతుల్లో 4 ఫోర్లు) రాణించింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి.
సంక్షిప్త స్కోర్లు : భారత మహిళలు : 274/7 (స్మృతీ మంధాన 71, మిథాలీ రాజ్ 68, షెఫాలీ వర్మ 53, క్లాస్ 2/38). దక్షిణాఫ్రికా మహిళలు : 275/7 (లారా 80, మిగ్నాన్ 52, లారా 49, హర్మన్‌ప్రీత్ 2/42)