Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయిపై పంత్‌సేన విజయం
- రాణించిన కుల్దీప్ , లలిత్ యాదవ్
నవతెలంగాణ-ముంబయి : పేలవ ఫామ్‌తో జాతీయ జట్టుకు దూరమైన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (3/18) ముంబయిని మాయలో పడేశాడు. మూడు వికెట్ల ప్రదర్శనతో మాయజాలం ప్రదర్శించిన కుల్దీప్ యాదవ్ ఐపీఎల్ 15ను మ్యాజిక్ షోతో మొదలెట్టాడు. ఢిల్లీ లోయర్ ఆర్డర్ ధనాధన్‌తో ముంబయి ఇండియన్స్‌కు తొలి మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలోనే లాంఛనం ముగించింది. లలిత్ యాదవ్ (48 నాటౌట్, 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (38 నాటౌట్, 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), పృథ్వీ షా (38, 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఛేదనలో కదం తొక్కారు. అంతకముందు ఇషాన్ కిషన్ (81 నాటౌట్, 48 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరోచిత ఇన్నింగ్స్‌తో ముంబయి ఇండియన్స్ 177 పరుగుల భారీ స్కోరు చేసింది. 4 వికెట్ల తేడాతో ముంబయిపై ఢిల్లీ ఘన విజయం సాధించింది.
లలిత్, అక్షర్ షో : ఛేదనలో ఢిల్లీ టాప్ ఆర్డర్ నిరాశపరిచింది. పృథ్వీ షా (38), సీఫర్డ్ (21) తొలి వికెట్‌కు 30 పరుగులు జోడించారు. మన్దీప్ సింగ్ (0), రిషబ్ పంత్ (1), రోవ్‌మన్ పావెల్ (0) నిరాశపరిచారు. లలిత్ యాదవ్ (48), అక్షర్ పటేల్ (38)లకు తోడు శార్దుల్ ఠాకూర్ (22, 11 బంతుల్లో 4 ఫోర్లు) ధనాధన్ ప్రదర్శన చేశాడు. ముంబయి బౌలర్లు బుమ్రా (0/43), డానియల్ (0/57) తేలిపోయారు.
ఇషాన్ తుఫాన్ : తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ ఇషాన్ తుఫాన్‌తో భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (41, 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (81) తొలి వికెట్‌కు 67 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. మిడిల్ ఓవర్లలో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్‌తో ముంబయి పరుగుల వేగం మందగించింది. అన్మోల్ప్రీత్ (8), కీరన్ పొలార్డ్ (3), సహా రోహిత్‌ను అవుట్ చేసిన కుల్దీప్ ముంబయిపై ఒత్తిడి పెంచాడు. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (22, 15 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చివర్లో విశ్వరూపం చూపిన కిషన్ 34 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. కిషన్ దంచికొట్టినా.. సహకారం కొరవడి ముంబయి భారీ స్కోరు చేయలేదు.
సంక్షిప్త స్కోర్లు :
ముంబయి : 177/6 (ఇషాన్ కిషన్ 81, రోహిత్ శర్మ 41, తిలక్ వర్మ 22, కుల్దీప్ యాదవ్ 3/18, ఖలీల్ 2/27)
ఢిల్లీ : 179/6 (లలిత్ యాదవ్ 48, అక్షర్ పటేల్ 38, పృథ్వీ షా 38, బసిల్ తంపీ 3/35, అశ్విన్ 2/14)