Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 211 లక్ష్యాన్ని ఛేదించిన లక్నో
- ఛేదనలో లూయిస్ దూకుడు
- చెన్నైపై లక్నో ఘన విజయం
నవతెలంగాణ-ముంబయి
మంచు ప్రభావం చెన్నై సూపర్‌కింగ్స్‌ను వెంటాడుతోంది. వాంఖడేలో స్వల్ప స్కోరు చేసినా.. బ్రబౌర్న్‌లో భారీ స్కోరు సాధించినా తుది ఫలితంలో ఎటువంటి మార్పు లేదు. ఐపీఎల్ కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్ చేతిలో చెన్నై సూపర్‌కింగ్స్ పరాజయం పాలైంది. 211 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో మూడు బంతులు ఉండగానే లక్నో సూపర్‌జెయింట్స్ ఊదేసింది. ఛేదనలో ఎవిన్ లూయిస్ (55 నాటౌట్, 23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో లక్నోకు గెలుపు తీరాలకు చేర్చాడు. ఆయుశ్ బదాని (19 నాటౌట్, 9 బంతుల్లో 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన తరుణంలో లక్నో ఒత్తిడిలో పడింది. దూబె వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో విశ్వరూపం ప్రదర్శించిన లూయిస్ ఏకంగా 25 పరుగులు పిండుకున్నాడు. చివరి ఓవర్లో ఓ భారీ సిక్సర్ బాదిన బదాని సూపర్‌కింగ్స్‌కు మరో ఓటమిని మిగిల్చాడు. కెప్టెన్ కెఎల్ రాహుల్ (40, 26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), క్వింటన్ డికాక్ (61, 45 బంతుల్లో 9 ఫోర్లు) తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించి ఛేదనకు గట్టి పునాది వేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ రాబిన్ ఉతప్ప (50, 27 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), శివం దూబె (49, 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. మోయిన్ అలీ (35, 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎం.ఎస్ ధోని (16 నాటౌట్, 6 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. లక్నో సూపర్‌జెయింట్స్ బౌలర్లలో యువ స్పిన్నర్ రవి బిష్ణోరు (2/24) మంచి ప్రదర్శన చేశాడు.
ఉతప్ప, దూబె దూకుడు : టాస్ నెగ్గిన లక్నో సూపర్‌జెయింట్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. మంచు ప్రభావం ఫలితాన్ని శాసించనున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నైపైనే నెలకొంది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (1) మరోసారి విఫలమయ్యాడు. ఆరంభంలోనే రనౌట్‌గా నిష్క్రమించాడు రుతురాజ్. మూడో స్థానంలో వచ్చిన మోయిన్ అలీ (35)తో కలిసి రాబిన్ ఉతప్ప (50) దంచి కొట్టాడు. పవర్‌ప్లేలో విశ్వరూపం చూపిన ఉతప్ప బౌండరీల మోత మోగించాడు. 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 బంతుల్లోనే అర్థ సెంచరీ అందుకున్నాడు. ఉతప్ప, అలీ జోరుతో తొలి ఆరు ఓవర్లలోనే సూపర్‌కింగ్స్ 73/1తో భారీ స్కోరు దిశగా గట్టి పునాది వేసుకుంది. అర్థ సెంచరీ అనంతరం ఉతప్ప ఔటైనా.. చెన్నై జోరు తగ్గలేదు. యువ బ్యాటర్ శివం దూబె (49) లక్నో బౌలర్లపై శివమెత్తాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో కదం తొక్కాడు. అర్థ సెంచరీకి పరుగు దూరంలో వికెట్ కోల్పోయిన దూబె.. భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద క్యాచౌట్ అయ్యాడు. తొలి మ్యాచ్‌లో విశేషంగా ఆకట్టుకున్న ఎం.ఎస్ ధోని (16 నాటౌట్) ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి అలరించాడు. ఆరు బంతుల్లోనే 16 పరుగులు చేసిన ధోని అజేయంగా నిలిచాడు. రవీంద్ర జడేజా (17), అంబటి రాయుడు (27) ఆకట్టుకున్నారు.
సంక్షిప్త స్కోర్లు :
చెన్నై సూపర్‌కింగ్స్ : 210/8 (ఉతప్ప 50, దూబె 49, మోయిన్ అలీ 35, రవి బిష్ణోరు 2/24)
లక్నో సూపర్‌జెయింట్స్ : 211/4 (లూయిస్ 55, డికాక్ 61, రాహుల్ 40, ప్రిటోరిస్ 2/31)