Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన ఉమేశ్ యాదవ్
- పంజాబ్‌పై కోల్‌కత ఘన విజయం
వాంఖడేలో కోల్‌కత నైట్‌రైడర్స్ జోరు కొనసాగుతోంది. బంతితో ఉమేశ్ యాదవ్ (4/23) నిప్పులు చెరుగగా.. బ్యాట్‌తో అండ్రూ రసెల్ (70 నాటౌట్) విశ్వరూపమే చూపించాడు. ఉమేశ్ యాదవ్ నాలుగు వికెట్ల ప్రదర్శనతో తొలుత పంజాబ్ కింగ్స్ 137 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప ఛేదనలో రసెల్ ఉగ్రరూపం దాల్చటంతో కోల్‌కత అలవోక విజయాన్ని అందుకుంది.
నవతెలంగాణ-ముంబయి : అండ్రూ రసెల్ (70 నాటౌట్, 31 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) విశ్వరూపం చూపించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లపై ఊచకోతకు దిగిన రసెల్ సుదీర్ఘ విరామం అనంతరం ఐపీఎల్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. అండ్రూ రసెల్ అద్వితీయ ధనాధన్ షోతో పంజాబ్ కింగ్స్‌పై కోల్‌కత నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 137 పరుగులకు కుప్పకూలింది. ఉమేశ్ యాదవ్ (4/23) నాలుగు వికెట్ల ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ నడ్డి విరిచాడు. భానుక రాజపక్సె (31, 9 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే పంజాబ్ కింగ్స్ తరఫున చెప్పుకోదగిన ప్రదర్శన చేశాడు. మయాంక్ అగర్వాల్ (1), శిఖర్ ధావన్ (16) విఫలమయ్యారు. లోయర్ ఆర్డర్లో కగిసో రబాడ (25, 16 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
రసెల్ రచ్చ రచ్చ : 138 పరుగుల స్వల్ప లక్ష్యం. అయినా, వరుస వికెట్లతో కోల్‌కత కష్టాల్లో కూరుకుంది!. 51 పరుగులకే నాలుగు వికెట్లు చేజార్చుకుంది. అక్కడ్నుంచి మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని అనుకుంటే.. అండ్రూ రసెల్ మరో విధంగా మార్చివేశాడు. సిక్సర్ల వర్షం కురిపించిన రసెల్ విధ్వంసకాండ సృష్టించాడు. ఎనిమిది సిక్సర్లు, రెండు ఫోర్లతో పంజాబ్‌పై దండయాత్ర చేశాడు. 26 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన రసెల్.. మ్యాచ్‌ను ఏకపక్ష చేశాడు. శామ్ బిల్లింగ్స్ (24 నాటౌట్, 23 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 7.3 ఓవర్లలోనే 90 పరుగులు పిండుకున్నాడు. రసెల్ అరాచక ఇన్నింగ్స్‌తో 14.3 ఓవర్లలోనే కోల్‌కత గెలుపు లాంఛనం ముగించింది.
ఔరా.. ఉమేశ్ యాదవ్! : వాంఖడే మైదానంలో కోల్‌కత నైట్‌రైడర్స్ బౌలర్ల హవా నడుస్తోంది. ఐపీఎల్ 15 ఆరంభ మ్యాచ్‌లోనూ సూపర్‌కింగ్స్ బ్యాటర్లకు ముకుతాడు వేసిన నైట్‌రైడర్స్ బౌలర్లు.. తాజాగా పంజాబ్ కింగ్స్ పవర్ హిట్టర్లను సైతం గొప్పగా కట్టడి చేశారు. మంచు ప్రభావం చూపుతున్న మ్యాచ్‌లో కీలక టాస్ నెగ్గిన కోల్‌కత తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పంజాబ్ కింగ్స్‌ను ఉమేశ్ యాదవ్ గట్టి దెబ్బ తీశాడు. కెప్టెన్, ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (1)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శిఖర్ ధావన్ (16, 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) దూకుడుగా ఆడటంలో విఫలమవగా.. భానుక రాజపక్సె (31, 9 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కండ్లుచెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో విశ్వరూపం ప్రదర్శించిన భానుక రాజపక్సె పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌కు కొత్త ఉత్సాహం తీసుకొచ్చాడు. కానీ అతని నిష్క్రమణతోనే పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. మిడిల్ ఆర్డర్లో ఎవరూ నిలదొక్కుకోలేదు. రాజ్ బవా (11), షారుక్ ఖాన్ (0), హర్‌ప్రీత్ బరార్ (14)లు తేలిపోయారు. గత మ్యాచ్‌లో చిచ్చరపిడుగులా చెలరేగిన పవర్ హిట్టర్ ఒడీన్ స్మిత్ (9 నాటౌట్) కోల్‌కత బౌలర్ల ముందు తలొంచాడు. టెయిలెండర్లలో కగిసో రబాడ (25, 16 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) మెరవటంతో పంజాబ్ కింగ్స్ మూడంకెల స్కోరు అందుకోగలిగింది.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 137/10 ( భానుక రాజపక్సె 31, కగిసో రబాడ 25, ఉమేశ్ యాదవ్ 4/23)
కోల్‌కత నైట్‌రైడర్స్ : 141/4 ( అండ్రూ రసెల్ 70, శ్రేయస్ అయ్యర్ 26, శామ్ బిల్లింగ్స్ 24, రాహుల్ 2/13)