Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెంచరీతో చెలరేగిన జోశ్ బట్లర్
- ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
- ఛేదనలో తిలక్ వర్మ పోరాటం వృథా
జోశ్ బట్లర్ (100) చితకబాదాడు. ముంబయి ఇండియన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఐపీఎల్15లో తొలి శతకం, ఐపీఎల్ కెరీర్లో మూడో శతకం నమోదు చేశాడు. జోశ్ బట్లర్ శతక విధ్వంసంతో సీజన్లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఛేదనలో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (61) పోరాడినా..ముంబయి ఇండియన్స్‌కు వరుసగా రెండో ఓటమి తప్పలేదు.
నవతెలంగాణ-ముంబయి
రాజస్థాన్ రాయల్స్ జోరు కొనసాగుతోంది. శనివారం డివై పాటిల్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 194 పరుగుల ఛేదనలో ముంబయి ఇండియన్స్ 170 పరుగులే చేసింది. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (61, 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఓపెనర్ ఇషాన్ కిషన్ (54, 43 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా ముంబయికి ఓటమి తప్పలేదు. డెత్ ఓవర్లలో భీకర బ్యాటర్ కీరన్ పొలార్డ్ (22, 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) దారుణంగా నిరాశపరిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ జోశ్ బట్లర్ (100, 68 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. చివర్లో షిమ్రోన్ హెట్మయర్ (35, 14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్‌కు భారీ స్కోరు అందించాడు.
చితకబాదిన బట్లర్ : టాస్ నెగ్గిన ముంబయి ఇండియన్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బుమ్రా దూకుడుతో రాయల్స్ ఆరంభంలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1)ను కోల్పోయింది. తొలి మూడు ఓవర్లలో రాయల్స్ స్కోరు సాధారణంగా ఉంది. పవర్‌ప్లేలో బంతి బసిల్ తంపీకి అందించిన రోహిత్ శర్మ.. జోశ్ బట్లర్ విశ్వరూపానికి అవకాశం కల్పించాడు. ఆ ఓవర్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదిన జోశ్ బట్లర్ జోరందుకున్నాడు, దేవదత్ పడిక్కల్ (7) నిరాశపరిచినా.. కెప్టెన్ సంజు శాంసన్ (30, 21 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు)తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించాడు. ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 32 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన బట్లర్.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. డెత్ ఓవర్లలో షిమ్రోన్ హెట్మయర్ (35) తోడవటంతో రాజస్థాన్ స్కోరు అమాంతం పెరిగింది. మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో చెలరేగిన హెట్మయర్ ముంబయికి సింహస్వప్నంలా తయారయ్యాడు. 66 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న జోశ్ బట్లర్.. చివర్లో బుమ్రా బంతికి వికెట్ కోల్పోయాడు. ముంబయి ఇండియన్స్ స్టార్ పేసర్ జశ్‌ప్రీత్ బుమ్రా (3/17) ఆకట్టుకునే గణాంకాలు నమోదు చేశాడు. సహచర బౌలర్లు విఫలమైన చోట బుమ్రా గొప్పగా రాణించాడు. టైమల్ మిల్స్ (3/35) మూడు వికెట్ల ప్రదర్శన చేశాడు.
తిలక్ వర్మ పోరాడినా..! : ముంబయి ఇండియన్స్ మరోసారి సీజన్‌ను ఓటములతోనే ఆరంభిస్తోంది. ఊరించే లక్ష్య ఛేదనలో ముంబయి ఇండియన్స్ అంచనాలను అందుకోలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (10), అన్మోల్ప్రీత్ సింగ్ (5) టాప్ ఆర్డర్లో నిరాశపరిచారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (54), తిలక్ వర్మ (61) అర్థ సెంచరీలతో ముంబయి ఇండియన్స్‌కు లక్ష్యం దిశగా తీసుకెళ్లారు. ఈ ఇద్దరూ క్రీజులో ఉండగా ముంబయి ఇండియన్స్ మ్యాచ్ రేసులో నిలిచింది. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఐదు సిక్సర్లు, మూడు ఫోర్లతో దండయాత్ర చేశాడు. 28 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన తిలక్ వర్మ ప్రమాదకరంగా కనిపించాడు. మరో ఎండ్‌లో నెమ్మదిగా ఆడిన ఇషాన్ కిషన్ 41 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కీలక సమయంలో కిషన్, తిలక్ వికెట్లు కోల్పోవటంతో ముంబయి ఇండియన్స్‌పై ఒత్తిడి పడింది. చివరి ఏడు ఓవర్లలో 70 పరుగులు చేయాల్సిన తరుణంలో విధ్వంసక బ్యాటర్ కీరన్ పొలార్డ్ (22)పై ముంబయి భారీగా ఆశలు పెట్టుకుంది. పూర్తిగా నిరాశపరిచిన పొలార్డ్ 24 బంతుల్లోనే 22 పరుగులే చేశాడు. చివరి ఓవర్లో 29 పరుగులు చేయాల్సి ఉండగా.. కీరన్ పొలార్డ్ ప్రత్యేక ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో నవదీప్ సైని, యుజ్వెంద్ర చాహల్ ఆకట్టుకున్నారు.
స్కోరు వివరాలు :
రాజస్థాన్ ఇన్నింగ్స్ : జోశ్ బట్లర్ (సి) బుమ్రా 100, యశస్వి జైస్వాల్ (సి) డెవిడ్ (బి) బుమ్రా 1, పడిక్కల్ (సి) రోహిత్ (బి) మిల్స్ 7, సంజు శాంసన్ (సి) తిలక్ (బి) పొలార్డ్ 30, షిమ్రోన్ హెట్మయర్ (సి) తిలక్ (బి) బుమ్రా 35, రియాన్ పరాగ్ (సి) డెవిడ్ (బి) మిల్స్ 5, అశ్విన్ రనౌట్ 1, నవదీప్ సైని (సి) కిషన్ (బి) మిల్స్ 2, ట్రెంట్ బౌల్ట్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం :(20 ఓవర్లలో 8 వికెట్లకు) 193.
వికెట్ల పతనం : 1-13, 2-48, 3-130, 4-183, 5-184, 6-185, 7-188, 8-193.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 4-0-17-3, డానియల్ శామ్స్ 4-0-32-0, బసిల్ తంపీ 1-0-26-0, మురుగన్ అశ్విన్ 3-0-32-0, టైమల్ మిల్స్ 4-0-35-3, కీరన్ పొలార్డ్ 4-0-46-1.
ముంబయి ఇన్నింగ్స్ : ఇషాన్ కిషన్ (సి) సైని (బి) బౌల్ట్ 54, రోహిత్ శర్మ (సి) పరాగ్ (బి) ప్రసిద్ కృష్ణ 10, అన్మోల్ప్రీత్ సింగ్ (సి) పడిక్కల్ (బి) సైని 5, తిలక్ వర్మ (బి) అశ్విన్ 61, కీరన్ పొలార్డ్ (సి) బట్లర్ (బి) సైని 22, టిమ్ డెవిడ్ (ఎల్బీ) చాహల్ 1, డానియల్ శామ్స్ (సి) బట్లర్ (బి) చాహల్ 0, మురుగన్ అశ్విన్ రనౌట్ 6, బుమ్రా నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 170.
వికెట్ల పతనం : 1-15, 2-40, 3-121, 4-135, 5-136, 6-136, 7-165, 8-170.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 4-0-29-1, ప్రసిద్ కృష్ణ 4-0-37-1, నవదీప్ సైని 3-0-36-2, రవిచంద్రన్ అశ్విన్ 4-0-30-1, యుజ్వెంద్ర చాహల్ 4-0-26-2, రియాన్ పరాగ్ 1-0-11-0.