Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల ప్రపంచకప్ ఆస్ట్రేలియా వశం
- రికార్డు స్థాయిలో ఏడోసారి చాంపియన్
- ఫైనల్లో చేతులెత్తేసిన ఇంగ్లాండ్ మహిళలు
- ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ 2022
ఆస్ట్రేలియా అద్భుతం చేసింది. రికార్డు స్థాయిలో ఏడోసారి మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన కంగారూ అమ్మాయిలు.. ఐదేండ్ల విరామం అనంతరం మళ్లీ ప్రపంచకప్‌ను ముద్దాడారు. అలీసా హీలీ (170) సంచలన శతక ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. ఆస్ట్రేలియా ఎదురులేని విజయం సాధించింది. అజేయ జట్టుగా వన్డే వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. 357 పరుగుల రికార్డు ఛేదనలో నటాలీ సీవర్ (148) శతక పోరాటం చేసినా.. ఇంగ్లాండ్ 71 పరుగుల తేడాతో మహిళల వరల్డ్‌కప్ టైటిల్‌ను కోల్పోయింది.
నవతెలంగాణ-క్రైస్ట్‌చర్చ్
ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌పై చెరగని ముద్ర వేసింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్‌పై సాధికారిక విజయంతో వన్డే వరల్డ్‌కప్ చాంపియన్‌గా అవతరించింది. ఇంగ్లాండ్‌పై 71 పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా.. రికార్డు స్థాయిలో ఏడోసారి ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. ఐదేండ్ల క్రితం సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ను గెల్చుకున్న ఇంగ్లాండ్.. టైటిల్ నిలుపుకోవటంలో విఫలమైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 'అలీసా హీలీ (170, 138 బంతుల్లో 26 ఫోర్లు) సంచలన శతకంతో చెలరేగింది. రేచల్ హేన్స్ (68, 93 బంతుల్లో 7 ఫోర్లు), బెత్ మూనీ (62, 47 బంతుల్లో 8 ఫోర్లు) సైతం రాణించటంతో తొలుత ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ఛేదనలో నటాలీ సీవర్ (148 నాటౌట్, 121 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో పోరాడినా ఫలితం లేకపోయింది. సహచర బ్యాటర్ల సహకారం లోపించటంతో ఇంగ్లాండ్ 43,4 ఓవర్లలో 285 పరుగులకు కుప్పకూలింది. ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ల్కే ప్రపంచకప్ ట్రోఫీని ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్‌కు అందించారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా అమ్మాయిలు వరుసగా 26 వన్డేల్లో విజయాలు నమోదు చేశారు. మెన్స్ క్రికెట్లో రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా నెలకొల్పిన రికార్డును మెగ్‌లానింగ్ కెప్టెన్సీలో ఆసీస్ అమ్మాయిలు సమం చేశారు.
అలీసా అదుర్స్ : ఇంగ్లాండ్ బౌలర్లు మంచి ఫామ్‌లో ఉండటంతో టాస్ నెగ్గి ఆ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ నెగ్గిన ఆనందం ఇంగ్లాండ్‌కు ఎంతోసేపు నిలువలేదు. ఓపెనర్లు అలీసా హీలీ (170), రేచల్ హేన్స్ (68) తొలి వికెట్‌కు 160 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఓ ఎండ్‌లో అలీసా బౌండరీలతో మైదానాన్ని హౌరెత్తించగా.. మరో ఎండ్‌లో రేచల్ సైతం రెచ్చిపోయింది. పవర్‌ప్లేలో (10 ఓవర్లు) 37/0తో ఉన్న ఆస్ట్రేలియా.. ఆ తర్వాతే విశ్వరూపం చూపించింది. క్రీజులో నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్న ఓపెనర్లు ఆ తర్వాత జూలు విదిల్చారు. రేచల్ ఆరు ఫోర్లతో 69 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేయగా.. అలీసా ఆరు ఫోర్లతో 62 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసింది. 13 ఫోర్లతో 100 బంతుల్లో శతకం సాధించిన అలీసా.. 129 బంతుల్లోనే 22 ఫోర్లతో 150 పరుగుల మైలురాయి చేరుకుంది. నం.3 బ్యాటర్ బెత్ మూనీ (62, 47 బంతుల్లో 8 ఫోర్లు) దూకుడుగా ఆడింది. 38 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన బెత్ మూనీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. టాప్-3 బ్యాటర్ల మెరుపులతో ఆస్ట్రేలియా తొలుత 356 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో అన్య శ్రబ్సోల్ (3/46) మూడు వికెట్ల ప్రదర్శన చేసింది.
నటాలీ పోరాటం వృథా : 357 పరుగుల రికార్డు లక్ష్యం. అసలే ఫైనల్, ఆపై భారీ టార్గెట్. సహజంగానే ఇంగ్లాండ్‌పై విపరీతమైన ఒత్తిడి. అది సహజంగా టాప్ ఆర్డర్‌పై కనిపించింది. టామీ బ్యూమోంట్ (27), డానీ వ్యాట్ (4), హీథర్ నైట్ (26)లు అంచనాలు అందుకోలేదు. మిడిల్ ఆర్డర్లో నటాలీ సీవర్ (148 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగింది. మరో ఎండ్‌లో క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నా.. సీవర్ చెలరేగింది. 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో అజేయ శతకం పోరాటం చేసింది. ఆమీ జోన్స్ (20), సోఫీ డంక్లీ (22), కేథరిన్ బ్రట్ (1)లలో ఎవరూ సీవర్‌కు అండగా నిలువలేదు. ఆసీస్ బౌలర్లు జెస్ జొనాసెన్ (3/57), అలానా కింగ్ (3/64)లు మూడేసి వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. 43.4 ఓవర్లలో 285 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : అలీసా హీలీ (స్టంప్డ్) జోన్స్ (బి) శ్రబ్సోల్ 170, రేచల్ హేన్స్ (సి) బ్యూమోంట్ (బి) ఎకల్‌స్టోన్ 68, బెత్ మూనీ (సి) సీవర్ (బి) శ్రబ్సోల్ 62, ఆష్లె గార్డ్నర్ రనౌట్ 1, మెగ్ లానింగ్ (సి) బ్యూమోంట్ (బి) శ్రబ్సోల్ 10, తహ్లి మెక్‌గ్రాత్ 8, ఎలీసీ పెర్రీ నాటౌట్ 17, ఎక్స్‌ట్రాలు : 20, మొత్తం : (50 ఓవర్లలో 5 వికెట్లకు) 356.
వికెట్ల పతనం : 1-160, 2-316, 3-318, 4-331, 5-331.
బౌలింగ్ : కేథరన్ బ్రట్ 10-0-69-0, అన్య శ్రబ్సోల్ 10-046-3, నటాలీ సీవర్ 8-0-65-0, చార్లీ డీన్ 4-0-34-0, సోఫీ ఎకల్‌స్టోన్ 10-0-71-1, కేట్ క్రాస్ 8-0-65-0.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : టామీ బ్యూమోంట్ (ఎల్బీ) స్కట్ 27, డానీ వ్యాట్ (బి) స్కట్ 4, హీథర్ నైట్ (ఎల్బీ) కింగ్ 26, నటాలీ సీవర్ నాటౌట్ 148, అమీ జోన్స్ (సి) కింగ్ (బి) జొనాసెన్ 20, సోఫీ డంక్లీ (బి) కింగ్ 22, కేథరిన్ బ్రట్ (స్టంప్డ్) హీలీ (బి) కింగ్ 1, సోఫీ ఎకల్‌స్టోన్ (ఎల్బీ) మెక్‌గ్రాత్ 3, కేట్ క్రాస్ (సి,బి) జొనాసెన్ 2, చార్లీ డీన్ (సి) జొనాసెన్ (బి) గార్డ్నర్ 21, అన్య శ్రబ్సోల్ (సి) గార్డ్నర్ (బి) జొనాసెన్ 1, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (43.4 ఓవర్లలో ఆలౌట్) 285.
వికెట్ల పతనం : 1-12, 2-38, 3-86, 4-129, 5-179, 6-191, 7-206, 8-213, 9-278, 10-285.
బౌలింగ్ : మేఘన్ స్కట్ 8-0-42-2, డార్సీ బ్రౌన్ 7-0-57-0, అలనా కింగ్ 10-064-3, తహ్లి మెక్‌గ్రాత్ 8-0-46-1, జెస్ జొనాసెన్ 8.4-0-57-3, ఆష్లె గార్డ్నర్ 2-0-15-1.