Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో కార్తీక్ ధనాధన్ జోరు
- రాజస్థాన్ రాయల్స్‌కు తప్పని ఓటమి
- దినేశ్ కార్తీక్ 44
నవతెలంగాణ-ముంబయి
రాయల్ చాలెంజర్స్ బెంగ ళూర్ అలవోక విజయం నమోదు చేసింది. తొలుత బంతితో రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేసిన బెంగళూర్.. ఊరించే లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో సులువుగానే ఛేదించింది. దినేశ్ కార్తీక్ (44 నాటౌట్, 23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. డుప్లెసిస్ (29), అనుజ్ రావత్ (26)లు తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించారు. విరాట్ కోహ్లి (5), డెవిడ్ విల్లే (0), రూథర్‌ఫోర్డ్ (5) విఫలం కావటంతో బెంగళూర్‌పై ఒత్తిడి పడింది. షాబాజ్ అహ్మద్ (45, 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), దినేశ్ కార్తీక్ కదం తొక్కటంతో బెంగళూర్ గెలుపు గీత దాటింది. అంతకముందు, జోశ్ బట్లర్ (70 నాటౌట్, 47 బంతుల్లో 6 సిక్స్‌లు), షిమ్రోన్ హెట్మయర్ (42 నాటౌట్, 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 169 పరుగులు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) మరోసారి విఫలమయ్యాడు. దేవదత్ పడిక్కల్ (37, 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి జోశ్ బట్లర్ రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించాడు. కానీ రన్‌రేట్ మాత్రం తక్కువగానే ఉంది. దీంతో ద్వితీయార్థంలో బ్యాటర్లపై ఒత్తిడి కనిపించింది. బెంగళూర్ బౌలర్లు జోశ్ బట్లర్‌ను ఆరంభంలో నిలువరించారు. పవర్‌ప్లేలో (6 ఓవర్లు) 35 పరుగులే చేసిన రాజస్థాన్ రాయల్స్ కాస్త తడబడింది. జోశ్ బట్లర్ 42 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. గత మ్యాచ్‌లో శతకంతో కదం తొక్కిన జోశ్ బట్లర్.. చివర్లో మెరుపు వేగం చూపినా ఆరంభంలో ఆకట్టుకోలేదు. షిమ్రోన్ హెట్మయర్ తోడుగా చివరి ఐదు ఓవర్లలో 66 పరుగులు పిండుకున్నాడు. అజేయంగా 70 పరుగులు చేసిన బట్లర్ ఒక్క ఫోర్ కూడా కొట్టలేదు. ఆరు సిక్సర్లతో అలరించాడు. షిమ్రోన్ హెట్మయర్ నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో రాణించాడు. కెప్టెన్ సంజు శాంసన్ (8) ఫామ్ అందుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు. రాయల్ చాలెంజర్స్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ (0/43) ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. హర్షల్ పటేల్ (1/18) ఆకట్టుకునే బౌలింగ్ చేశాడు.
స్కోరు వివరాలు :
రాజస్థాన్ రాయల్స్ : 169 /3 (జోశ్ బట్లర్ 70, హెట్మయర్ 42, పడిక్కల్ 37, హర్షల్ పటేల్ 1/18)
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ : 173/6 (షాబాజ్ అహ్మద్ 45, దినేశ్ కార్తీక్ 44, డుప్లెసిస్ 29, చాహల్ 3/15)