Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో అంతర్జాతీయ స్పోర్ట్స్ ఫెస్టివల్
- జాతీయ హ్యాండ్‌బాల్ అధ్యక్షుడు జగన్
క్రికెట్‌ను మాత్రమే ఆరాధించే దేశంలో.. ఇతర క్రీడలు తమ ఉనికి కోసం పోరాటం చేయక తప్పదు. ఎన్నో ఏండ్ల కృషితో బ్యాడ్మింటన్, కబడ్డీలు మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి హ్యాండ్‌బాల్ సైతం చేరిపోయింది. తెలంగాణ వాసి అర్శినపల్లి జగన్మోహన్ రావు జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్న అనంతరం హ్యాండ్‌బాల్ విప్లవాత్మక అడుగులు వేసింది. ఆసియా హ్యాండ్‌బాల్ చాంపియన్‌గా అవతరించి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. హ్యాండ్‌బాల్ అభివృద్ది, తెలంగాణలో వరల్డ్‌క్లాస్ అకాడమీ తదితర అంశాలపై జగన్మోహన్ రావను నవతెలంగాణ పలకరించింది. ఆ విషయాలు జగన్ మోహన్ రావు మాటల్లోనే..
నవతెలంగాణ-హైదరాబాద్
హ్యాండ్‌బాల్ అభివద్ధిపై మీ ప్రణాళికలు?
దేశంలో హ్యాండ్‌బాల్ అభివద్ధిపై పక్కా విజన్‌తో ఉన్నాం. హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడిగా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత అద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్నాం. ఇటీవల ఆసియా మహిళల జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత్ పసిడి పతక ప్రదర్శన వెనుక ఎంతో కషి దాగి ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక ప్రత్యేక హ్యాండ్‌బాల్ క్యాంప్‌ను ఏర్పాటు చేసి అమ్మాయిలకు అత్యుత్తమ శిక్షణ అందించాము. దాదాపు 190 మంది అమ్మాయిలు ఇక్కడ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. రైల్వేస్‌కు చెందిన సచిన్ శిక్షణలో ఇక్కడ రాటుదేలుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద అమ్మాయిలు హ్యాండ్‌బాల్‌లో తర్ఫీదు తీసుకుంటున్నారు. సారు సహకారంతో పాటు హెచ్ఎఫ్ఐ ఆర్థిక సాహాయం అందిస్తున్నది. ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన భారత జట్టులో ఐదుగురు ప్లేయర్లు తెలంగాణ వారే కావడం విశేషం.
హైదరాబాద్‌లో హ్యాండ్‌బాల్ ఏర్పాటు చేస్తారా?
రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా హ్యాండ్‌బాల్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు కత నిశ్చయంతో ఉన్నాం. దుబారులో అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులను కలిసినప్పుడు వారు ఆటను అభివద్ధి చేసేందుకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. రానున్న కొద్ది రోజుల్లో హైదరాబాద్‌ను హ్యాండ్‌బాల్ హబ్‌గా మార్చబోతున్నాం. నగరంలో ఎక్కడైనా స్థలం కేటాయిస్తే అందుకు తగ్గట్లు సకల హంగులతో రెండు, మూడు నెలల్లో అకాడమీని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇండోర్ స్టేడియంతో పాటు ప్రత్యేక హాస్టల్ వసతి సౌకర్యాలు ఉండేలా నిర్మాణం చేపడతాం. బ్యాడ్మింటన్ తరహాలో హైదరాబాద్‌ను హ్యాండ్‌బాల్ హబ్‌గా మారుస్తాం.
ఆట అభివద్ధి కోసం ప్రణాళికలేంటి?
హ్యాండ్‌బాల్ అభివద్ధిపై మేము స్పష్టమైన ప్రణాళికతో ఉన్నాం. గ్రామీణ ప్రాంత క్రీడాకారులపై దష్టి సారించాం. రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థలపై నజర్ పెట్టాం. ప్రతిభ కల్గిన పిల్లలను గుర్తించి వారికి మెరుగైన శిక్షణనివ్వనున్నాం. తద్వారా మెరికల్లాంటి క్రీడాకారులను జాతీయ జట్టుకు అందించగల్గుతాం. జాతీయ జట్టుకు ఎంపికైన ఆదిలాబాద్‌కు చెందిన కరీనాకు చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నది. గిరిజన ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి అద్భుత ప్రదర్శన చేస్తుంది. కరీనా లాంటి మరింత అమ్మాయిలను వెలుగులోకి తీసుకొస్తాం. అత్యుత్తమ ప్రతిభ కనబరిచే ప్లేయర్లకు స్పోర్ట్స్ స్కాలర్షిప్లు ఇవ్వాలన్న ఆలోచన ఉంది.
ద్వితీయ శ్రేణి నగరాలపై మీ ఫోకస్?
హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ వేదికగా రెండు జాతీయస్థాయి టోర్నీలు నిర్వహించాం. ప్రభుత్వ సహకారంతో ఎక్కడా ఏర్పాట్లకు లోటు కాకుండా అత్యుత్తమ సౌకర్యాలతో టోర్నీలను ఘనంగా నిర్వహించాం. హ్యాండ్‌బాల్ టోర్నీలను హైదరాబాద్ వరకే పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, సిద్దిపేటకు విస్తరించాలన్న ఆలోచన ఉంది. హ్యాండ్‌బాల్‌ను ఇండోర్ స్టేడియాల్లో నిర్వహించాలన్న ఉద్దేశంతో సౌకర్యాల కల్పనపై దష్టి పెట్టాం.
హైదరాబాద్‌లో జాతీయటోర్నీ ఉంటుందా?
ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ తర్వాత హైదరాబాద్‌లో ఆ స్థాయి అంతర్జాతీయ టోర్నీ మళ్లీ జరుగలేదు. ఆగస్టులో స్పోర్ట్స్ ఫెస్టివల్ నిర్వహణకు యోచిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాటు పలు కంపెనీల మద్దతుతో కనివినీ ఎరుగని రీతిలో క్రీడలను నిర్వహించాలన్న ఆలోచనతో ఉన్నాం. సీఎం టోర్నీ పేరుతో ప్రణాళిక చేస్తున్నాం. భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) కోశాధికారి ఆనందీశ్వర్ పాండే ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్లో జాతీయ యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. తెలంగాణలో హ్యాండ్‌బాల్ అభివద్ధికి సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాను.