Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ మీడియా హక్కులకు రెక్కలు
- రూ.50 వేల కోట్లకు పైగా డిమాండ్
- మీడియా హక్కుల రేసులో దిగ్గజ కంపెనీలు
నవతెలంగాణ క్రీడావిభాగం
ఆపిల్, జీ, సోనీ, డిస్నీ, అమెజాన్, టీవీ18-వయోకామ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల రేసులో పోటీపడుతున్న దిగ్గజ కంపెనీలు. ప్రపంచ క్రికెట్ లీగ్‌ల్లో నం.1గా నిలిచిన ఐపీఎల్ రానున్న ఐదేండ్ల కాలానికి రికార్డు ధరను సొంతం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇటీవల రెండు కొత్త ప్రాంఛైజీల వేలంలో అంచనాలకు మించి ఆదాయం దక్కించుకున్న బీసీసీఐ.. మీడియా హక్కుల రూపంలో కనీసం రూ.50 వేల కోట్లు సొంతం చేసుకోనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023-27 కాలానికి మీడియా హక్కుల కోసం బీసీసీఐ ఇన్విటేషన్ టు టెండరు ప్రక్రియ ప్రారంభించగా.. వారం రోజుల్లోనే బడా కార్పోరేట్ కంపెనీలు బిడ్డింగ్ డాక్యుమెంట్లను తీసుకున్నాయి. ఇందులో టీవీ18-వయోకామ్, డిస్నీ, సోనీ, జీ, అమెజాన్ సహా ఆపిల్ టీవీ సైతం ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ఆపిల్ టీవీ రాకతో ఐపీఎల్ మీడియా హక్కుల రేసు మరింత ఆసక్తికరంగా మారనుంది బీసీసీఐ అధికారులు అంటున్నారు. ఐపీఎల్ మీడియా హక్కుల కోసం ఈ వేలం జూన్ రెండో వారంలో జరుగనుంది. ఐటీటీ టెండరు పత్రాలను కొనుగోలు చేసేందుకు మే 10 తుది గడువుగా నిర్దేశించారు. ఈ 30 రోజుల సమయంలో వేలంలో పాల్గొనే కంపెనీలు రానున్న కాలంలో ఐపీఎల్ మీడియా హక్కుల విలువపై ఓ అంచనాకు రానున్నాయి. సుమారు 7.2 బిలియన్ అమెరికన్ డాలర్లను ఈ వేలం ద్వారా బీసీసీఐ ఆశిస్తోంది. ' మీడియా హక్కుల వేలం ద్వారా వచ్చే ఆదాయంలో పారదర్శకత అత్యంత కీలకం. ఈ నిధులను భారత దేశవాళీ క్రికెట్ సర్క్యూట్ వ్యవస్థను, మౌళిక సదుపాయాల కల్పన, క్రికెట్ కుటుంబం సంక్షేమానికి మళ్లిస్తాం' అని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.
నాలుగు విభాగాలు : ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కుల వేలం అంశంలో బీసీసీఐ ఎప్పటికప్పుడు కొత్త పంథా అనుసరిస్తోంది. తొలిసారి పదేండ్ల కాలానికి మీడియా హక్కులను అమ్మకానికి ఉంచగా.. తర్వాత ఆ సమయాన్ని ఐదేండ్ల కాలానికి కుదించింది. మూడోసారి జరుగుతున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో కాల పరిమితి ఐదేండ్లకు కొనసాగుతున్నా.. ఆదాయ మార్గాల కోసం బోర్డు కొత్త మార్గాలు అన్వేషించింది. తొలిసారి మీడియా హక్కులను నాలుగు విభాగాలుగా వేలంలో ఉంచనున్నారు. గతంలో టెలివిజన్, డిజిటల్ హక్కులను ప్రత్యేకంగా కోరినా.. రెండు కలిపి బిడ్ వేసేందుకు అవకాశం కల్పించారు. ఈసారి అటువంటి అవకాశం లేకుండా పోయింది. నాలుగు విభాగాల్లో వేర్వేరుగానే బిడ్లు దాఖలు చేయాలి. నాలుగు విభాగాలు లేదా ఏదేని రెండు, మూడు విభాగాలకు కలిపి బిడ్లు దాఖలు చేయడానికి వీలులేదు. ప్రతి ప్రత్యేక విభాగంలో బిడ్ దాఖలుకు అర్హత ప్రక్రియను కచ్చితంగా కలిగి ఉండాలి. మీడియా హక్కులను ఈ కింది నాలుగు విభాగాలుగా విభజించారు.
1. భారత ఉపఖండంలో టెలివిజన్ హక్కులు 2. డిజిటల్ హక్కులు 3. 18 మ్యాచుల ప్రత్యేక ప్యాకేజి (సీజన్ ఆరంభ మ్యాచ్, ప్లే ఆఫ్స్, సాయంత్రం మ్యాచులు) 4. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
నాలుగు విభాగాలకు కలిపి మీడియా హక్కుల కనీస ధర రూ.32890 కోట్లుగా నిర్ధారణ చేసినట్టు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి మ్యాచ్‌కు కనీస ధర రూ. 49 కోట్లు (టెలివిజన్), రూ.33 కోట్లు (డిజిటల్), రూ.16 కోట్లు (18 మ్యాచుల క్లస్టర్), రూ. 3 కోట్లు (రెస్ట్ ఆఫ్ ది వరల్డ్)గా నిర్ణయించారు. సీజన్‌కు 74 మ్యాచులు ఆడుతున్నారు. ఐదేండ్ల కాలంలో 370 మ్యాచులు ఆడతారు. దీని ద్వారా రూ.32,890 కోట్లను కనీస ధరగా తేల్చారు. ప్రస్తుతానికి సీజన్‌కు 74 మ్యాచులకు పరిమితి ఉంది. రానున్న సీజన్లలో మ్యాచుల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉంది. అప్పుడు పెరిగిన మ్యాచులకు అదనంగా ధర చెల్లించాల్సి ఉంటుంది.
రెండు రోజుల్లో : మీడియా హక్కుల వేలం ప్రక్రియ రెండు రోజుల్లో నిర్వహించనున్నారు. తొలి రోజు టెలివిజన్ (భారత్‌లో), డిజిటల్ మీడియా హక్కులకు ఈ వేలం నిర్వహిస్తారు. 18 మ్యాచుల క్లస్టర్ ప్యాకేజి, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ విభాగాల్లో రెండో రోజు ఈ వేలం జరుపుతారు. టెలివిజన్ హక్కులు దక్కించుకున్న సంస్థకు డిజిటల్ హక్కుల వేలంలో పోటీపడేందుకు హక్కు ఉంటుంది. ఈ రెండు దక్కించుకున్న సంస్థకు మిగతా రెండు విభాగాల్లో పోటీపడేందుకు హక్కు ఉంటుంది. టెలివిజన్ హక్కులు దక్కించుకున్న సంస్థ.. డిజిటల్ హక్కులు దక్కించుకున్న సంస్థతో నాకౌట్ రౌండ్లో పోటీపడే హక్కు కలిగి ఉంటుంది. అదే విధంగా మిగతా విభాగాలకు ఇది వర్తిస్తుంది. భారత్‌లో టెలివిజన్ హక్కుల విభాగంలో పోటీపడేందుకు భారత టెలివిజన్ సంస్థలకు మాత్రమే అవకాశం ఉంటుంది. కనీస వార్షిక ఆదాయం రూ.1000 కోట్లు ఉండాలి. ఇతర విభాగాల్లో కనీస వార్షిక ఆదాయం రూ.500 కోట్లు ఉంటే సరిపోతుంది. మిగతా విభాగాల్లో అంతర్జాతీయ సంస్థలతో పాటు భారత సంస్థలు పోటీపడవచ్చు.