Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో చెలరేగిన డికాక్
- పోరాడి ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్
నవతెలంగాణ-ముంబయి
తక్కువ స్కోర్లు నమోదైన థ్రిల్లర్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఉత్కంఠ విజయం సాధించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (80, 52 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ అర్థ సెంచరీతో చెలరేగాడు. చివరి ఓవర్ వరకు సాగిన ఉత్కంఠ ఛేదనలో లక్నో సూపర్‌జెయింట్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 150 పరుగుల ఛేదనలో లక్నో సూపర్‌జెయింట్స్ 19.4 ఓవర్లలోనే గెలుపు గీత దాటింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (24, 25 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), కృనాల్ పాండ్య (19 నాటౌట్, 14 బంతుల్లో 1 సిక్స్), ఆయుశ్ బదాని (10 నాటౌట్, 3 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. డికాక్ అర్థ సెంచరీతో మెరిసినా.. మిగతా బ్యాటర్లు పరుగుల వేటలో తడబడ్డారు. చివరి రెండు ఓవర్లలో 19 పరుగులు చేయాల్సి ఉండగా 19వ ఓవర్లో 14 పరుగులు పిండుకుంది. చివరి ఓవర్లో ఐదు పరుగులు చేయాల్సి దశలో తొలి బంతికి దీపక్ హుడా (11)ను శార్దుల్ ఠాకూర్ అవుట్ చేశాడు. రెండో బంతికి పరుగు రాలేదు. ఆయుశ్ బదాని ఓ ఫోర్, సిక్సర్‌తో లాంఛనం ముగించాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఇది మూడో విజయం. అంతకముందు, పృథ్వీ షా (61, 34 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) వన్‌మ్యాన్ షో నడిచిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 149/3 పరుగులు చేసింది. లక్నో సూపర్‌జెయింట్స్ బౌలర్లు అద్భుతంగా రాణించగా.. ఢిల్లీ బ్యాటర్లు పరుగుల వేటలో తంటాలు పడ్డారు. స్టార్ బ్యాటర్ డెవిడ్ వార్నర్ (4), రోవ్‌మన్ పావెల్ (3) విఫలమయ్యారు. రిషబ్ పంత్ (39 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (36 నాటౌట్) డెత్ ఓవర్లలో అంచనాలకు తగినట్టు ఆడలేకపోయారు.
పృథ్వీ షా ఒక్కడే : టాస్ నెగ్గిన లక్నో సూపర్‌జెయింట్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. మంచు ప్రభావం స్పష్టంగా ఉన్న మ్యాచ్‌లో లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. సహజ విధ్వంసకారుడు సమీకరణాలతో సంబంధం లేకుండా చెలరేగాడు. పవర్‌ప్లేలోనే 47 పరుగులు పిండుకున్న షా.. అర్థ సెంచరీతో కదం తొక్కాడు. మరో ఎండ్‌లో డెవిడ్ వార్నర్ (4) ఢిల్లీ క్యాపిటల్స్ పునరాగమనం ఆశించిన స్థాయిలో లేదు. 12 బంతులాడిన వార్నర్ ఒక్క బౌండరీ కొట్టలేదు. పృథ్వీ షా ఓ ఎండ్‌లో ధనాధన్ దంచి కొట్టగా.. మరో ఎండ్‌లో వార్నర్ ఇబ్బంది పడ్డాడు. వార్నర్, పృథ్వీ షా నిష్క్రమణ అనంతరం సైతం ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు ఊపందుకోలేదు. ప్రమాదకర బ్యాటర్లు రిషబ్ పంత్ (39 నాటౌట్, 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సర్ఫరాజ్ ఖాన్ (36 నాటౌట్, 28 బంతుల్లో 3 ఫోర్లు) అంచనాలకు తగినట్టు ఆడలేదు. చివరి మూడు ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 19 పరుగులే చేసింది. కృష్ణప్ప గౌతమ్ వేసిన ఓవర్‌ను మెయిడిన్‌గా ఆడిన రిషబ్ పంత్.. ఆ తర్వాత అండ్రూ టై ఓవర్లో చెలరేగినా ఫలితం లేకపోయింది. డెత్ ఓవర్లలో జేసన్ హౌల్డర్, అవేశ్ ఖాన్లు గొప్పగా బౌలింగ్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్లే కోల్పోయినా..భారీ స్కోరు చేయలేకపోయింది. మంచు ప్రభావంలోనూ గొప్పగా బౌలింగ్ చేసిన లక్నో బౌలర్లు విశేషంగా ఆకట్టుకున్నారు.
స్కోరు వివరాలు :
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : 149/3 (పృథ్వీ షా 61, రిషబ్ పంత్ 39, సర్ఫరాజ్ ఖాన్ 36, రవి బిష్ణోరు 2/22)
లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్ : 155/4 ( క్వింటన్ డికాక్ 80, కెఎల్ రాహుల్ 24, కృనాల్ పాండ్య 19, కుల్దీప్ యాదవ్ 2/31)