Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో రాహుల్ తెవాటియ సంచలనం
- భారీ అర్థ సెంచరీతో చెలరేగిన గిల్
- పంజాబ్‌పై గుజరాత్ ఉత్కంఠ విజయం
నవతెలంగాణ-ముంబయి
చివరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరం. క్రీజులో కొత్త బ్యాటర్ రాహుల్ తెవాటియ. ఒత్తిడి అంతా బ్యాటర్‌పైనే. ఒడీన్ స్మిత్ వేసిన చివరి ఓవర్ ఐదో బంతిని మిడ్ వికెట్ మీదుగా సిక్సర్‌గా మలిచిన రాహుల్ తెవాటియ.. గుజరాత్ శిబిరంలో ఆశలు రేపాడు. చివరి బంతికి ఆరు పరుగులు అవసరమైన తరుణంలో..స్లాగ్ స్వీప్‌తో లాంగ్ ఆన్ మీదుగా భారీ సిక్సర్ సంధించాడు. రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదిన రాహుల్ తెవాటియ గుజరాత్ టైటాన్స్‌కు సంచలన విజయాన్ని కట్టబెట్టాడు. 190 పరుగుల భారీ ఛేదనలో శుభ్‌మన్ గిల్ (96, 59 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో చెలరేగగా.. సాయి సుదర్శన్ (35, 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్య (27, 18 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. రాహుత్ తెవాటియ (13 నాటౌట్, 3 బంతుల్లో 2 సిక్స్‌లు) సంచలన ఇన్నింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. అంతకముందు, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (3/22) మరోసారి మాయజాలం చేశాడు. లియాం లివింగ్‌స్టోన్ (64, 27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగటంతో తొలుత పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. రషీద్ ఖాన్ స్పిన్ మ్యాజిక్‌తో పంజాబ్ కింగ్స్‌ను కాస్త అదుపు చేశాడు. శిఖర్ ధావన్ (35, 30 బంతుల్లో 4 ఫోర్లు), జితేశ్ శర్మ (23, 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), రాహుల్ చాహర్ (22, 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
లివింగ్‌స్టోన్ అర్థ శతకం : టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. హిట్టర్లతో కూడిన పంజాబ్ కింగ్స్ శిబిరంలో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు!. వేగంగా పరుగులు చేయాలనే తపనలో మయాంక్(5) మరోసారి స్వల్ప స్కోరుకే వికెట్ కోల్పోయాడు. పవర్‌ప్లేలో 43 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది. మిడిల్ ఆర్డర్ దూకుడుతో పంజాబ్ కింగ్స్ మంచి స్కోరు సాధించింది. నం.3 బ్యాటర్ జానీ బెయిర్‌స్టో (8) సైతం విఫలమయ్యాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ (35, 30 బంతుల్లో 4 ఫోర్లు) రాణించాడు. మిడిల్ ఆర్డర్లో లియాం లివింగ్‌స్టోన్ (64, 27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 24 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదేసిన లివింగ్‌స్టోన్.. పంజాబ్ కింగ్స్‌ను 200 పరుగుల దిశగా తీసుకెళ్లాడు. మిడిల్ ఆర్డర్లో లివింగ్‌స్టోన్‌కు తోడు జితేశ్ శర్మ (23, 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) చెలరేగాడు. ఈ దశలో గుజరాత్ టైటాన్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (3/22) మాయజాలం చూపించాడు. బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేసిన రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కూల్చి పంజాబ్ కింగ్స్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. చివర్లో రాహల్ చాహర్ (22 నాటౌట్, 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), అర్షదీప్ సింగ్ (10 నాటౌట్, 5 బంతుల్లో 1 ఫోర్) పంజాబ్ కింగ్స్‌కు మెరుపు ముగింపు అందించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో దర్శన్ నల్కాండే (2/37) రెండు వికెట్లు తీసుకోగా.. షమి, పాండ్య, ఫెర్గుసన్లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
స్కోరు వివరాలు :
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 189/9 ( లియాం లివింగ్‌స్టో 64, జితేశ్ శర్మ 23, రషీద్ ఖాన్ 3/22, దర్శన్ నల్కాండే 2/37)
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ : 190/4 (శుభ్‌మన్ గిల్ 96, సాయి సుదర్శన్ 35, రాహుల్ తెవాటియ 13, కగిసో రబాడ 2/35)