Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో సింధు, శ్రీకాంత్ అడుగు
- క్వార్టర్స్‌లో సాధికారిక విజయాలు నమోదు
- కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ 2022
నవతెలంగాణ-సంచియోన్
తెలుగు తేజాలు రాకెట్‌తో జోరందుకున్నారు. అటు సింధు, ఇటు శ్రీకాంత్ షటిల్ కోర్టులో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఎదురులేని ప్రదర్శనతో కొరియా ఓపెన్‌లో టైటిల్ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. సాధికారిక విజయాలతో కొరియా ఓపెన్ సెమీఫైనల్లోకి ప్రవేశించిన పి.వి సింధు, కిదాంబి శ్రీకాంత్ టైటిల్‌పై ఆశలు రేపుతున్నారు.
కొరియా ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు దుమ్మురేపుతున్నారు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో మాజీ వరల్డ్ నం.1, వరల్డ్ చాంపియన్ కిదాంబి శ్రీకాంత్ సైతం సెమీఫైనల్లో కాలుమోపాడు. ఇద్దరు తెలుగు స్టార్ షట్లర్లు కొరియా ఓపెన్ సెమీఫైనల్స్‌కు చేరుకోవటంపై రెండు విభాగాల్లోనూ పసిడి ఆశలు రెట్టింపు అవుతున్నాయి. 21-10, 21-16తో థారులాండ్ షట్లర్ బుసానన్‌పై సింధు అలవోక విజయం నమోదు చేసింది. ఐదో సీడ్ కిదాంబి శ్రీకాంత్ 21-12, 18-21, 21-12తో కొరియా ఆటగాడు సన్ వాన్హోపై సాధికారిక విజయం సాధించాడు. నేడు సింధు, శ్రీకాంత్ టైటిల్ పోరు బెర్త్‌పై కన్నేసి బరిలోకి దిగనున్నారు.
సింధుకు ఎదురేది? : మహిళల సింగిల్స్ విభాగంలో స్టార్ షట్లర్ పి.వి సింధుకు ఎదురులేకుండా పోయింది. థారులాండ్ స్టార్ షట్లర్ బుసానన్‌పై తెలుగు తేజం తిరుగులేని ఆధిక్యం కొనసాగిస్తోంది. కొరియా ఓపెన్ క్వార్టర్ఫైరల్స్ విజయంతో బుసానన్‌పై ముఖాముఖి రికార్డును 17-1తో మరింత మెరుగుపర్చుకుంది. ఇటీవల స్విస్ ఓపెన్‌లోనూ బుసానన్ను చిత్తు చేసిన సింధు.. సంచియోన్లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేసింది. 44 నిమిషాల్లోనే సెమీఫైనల్స్ బెర్త్ సొంతం చేసుకుంది. రెండు గేముల్లోనూ బుసానన్ నుంచి సింధుకు పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. తొలి గేమ్‌లో 5-5, 6-6 వరకు సింధుకు పోటీనిచ్చిన బుసానన్ ఆ తర్వాత చేతులెత్తేసింది. 11-8తో విరామ సమయనికి ఆధిక్యంలో నిలిచిన సింధు.. ద్వితీయార్థంలోనూ చెలరేగింది. వరుసగా ఎనిమిది పాయింట్లు ఖాతాలో వేసుకున్న సింధు 21-10తో సునాయాసంగా గెలుపొందింది. రెండో గేమ్‌లో బుసానన్ పాయింట్ల పరంగా మెరుగైనా.. సింధుకు పోటీనివ్వటంలో మాత్రం విఫలమైంది. ఏ దశలోనూ సింధును అందుకోలేదు. 6-2, 8-6, 11-8తో ముందంజ వేసిన సింధు.. విరామం అనంతరం సైతం దూసుకెళ్లింది. 16-11, 18-13తో భారీ ఆధిక్యం సొంతం చేసుకుంది. 21-16తో రెండో గేమ్‌ను, సెమీఫైనల్స్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. నేడు సెమీఫైనల్లో సింధు కఠిన సవాల్ ఎదుర్కొంటుంది. వరల్డ్ నం.4, రెండో సీడ్ అన్ సియోంగ్‌తో తలపడనుంది. కొరియా షట్లర్‌తో మూడుసార్లు తలపడిన సింధు ఒక్క మ్యాచ్‌లోనూ నెగ్గలేదు. నేడు మూడు ఓటములకు ప్రతీకారంతో పాటు ఫైనల్లో చోటుపై కన్నేసి బరిలోకి దిగనుంది.
పురుషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్ మూడు గేముల పాటు పోరాడాల్సి వచ్చింది. 62 నిమిషాల పాటు సాగిన క్వార్టర్ఫైనల్లో కొరియా షట్లర్ సన్ వాన్హోపై కిదాంబి శ్రీకాంత్ పైచేయి సాధించాడు. 11-6తో విరామ సమయానికి భారీ ఆధిక్యం సాధించిన శ్రీకాంత్ తొలి గేమ్‌ను సులువుగానే నెగ్గాడు. రెండో గేమ్‌లో కొరియా షట్లర్ పుంజుకున్నాడు. 11-10తో ప్రథమార్థంలో శ్రీకాంత్ ముందంజలో నిలిచినా.. నువ్వా నేనా అన్నట్టు సాగిన ద్వితీయార్థంలో వాన్‌హో పైచేయి సాధించాడు. 16-16తో స్కోర్లు సమమైన వేళ.. వరుస పాయింట్లతో మ్యాచ్‌ను మూడో గేమ్‌కు తీసుకెళ్లాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో శ్రీకాంత్ రెచ్చిపోయాడు. వాన్హోకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. 11-7తో విరామ సమయానికి ముందంజ వేసిన శ్రీకాంత్.. 17-10తో తిరుగులేని స్థానంలో నిలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. నేడు మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా)తో శ్రీకాంత్ తలపడనున్నాడు. క్రిస్టీతో ముఖాముఖి పోరులో శ్రీకాంత్ 4-4తో సమవుజ్జీగా కొనసాగుతున్నాడు. డబుల్స్ విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ 20-22, 21-18, 20-22తో మూడు గేముల్లో పోరాడి ఓడారు. మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జంట 19-21, 17-21తో అనూహ్య పరాజయం చవిచూసింది.