Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఎదురులేని విజయం సాధించిన ఆరెంజ్ ఆర్మీ ఐపీఎల్ 15 సీజన్లో తొలి విజయం సాధించింది. బంతితో, బ్యాట్‌తో సూపర్‌కింగ్స్‌పై తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన సన్‌రైజర్స్..జడేజా సేనకు వరుసగా నాల్గో ఓటమిని మిగిల్చారు. అన్ని విభాగాల్లోనూ తేలిపోయిన చెన్నై సూపర్‌కింగ్స్ డివై పాటిల్ మైదానంలో దారుణ పరాజయం చవిచూసింది.
- ఛేదనలో అభిషేక్ శర్మ అదుర్స్
- చెన్నై సూపర్‌కింగ్స్‌కు మరో ఓటమి
నవతెలంగాణ-ముంబయి
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు తొలి విజయం రుచి చూసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15లో తొలి రెండు మ్యాచుల్లో చేతులెత్తేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. హ్యాట్రిక్ పరాజయం ప్రమాదం నుంచి తప్పించుకుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో ఎదురులేని విజయం నమోదు చేసి సీజన్లో బోణీ కొట్టింది. 155 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (75, 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత అర్థ శతక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (32, 40 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయగా.. రాహుల్ త్రిపాఠి (39 నాటౌట్, 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ మెరుపులతో లాంఛనం ముగించాడు. 17.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్ష్యాన్ని పూర్తి చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేసింది. మోయిన్ అలీ (48, 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే చెప్పుకోదగిన ప్రదర్శన చేశాడు. అంబటి రాయుడు (27, 27 బంతుల్లో 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (23, 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) అంచనాలకు తగినట్టు ఆడటంలో విఫలమయ్యారు. హైదరాబాద్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (2/21) అద్భుత బౌలింగ్ గణాంకాలు నమోదు చేసి చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాటర్లకు ముకుతాడు వేశాడు. ఛేదనలో అర్థ శతకం బాదిన అభిషేక్ శర్మ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
అభిషేక్ అదరగొట్టాడు : చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పలు కీలక ప్రశ్నలకు సమాధానం సంపాదించింది. ఓపెనింగ్ కాంబినేషన్‌పై మల్లగుల్లాలు పడుతున్న సన్‌రైజర్స్.. సరైన జోడీని దొరకబుచ్చుకున్నట్టే!. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ (75) భారీ అర్థ సెంచరీతో సన్‌రైజర్స్ ఛేదనకు నాయకత్వం వహించాడు. ఓ ఎండ్‌లో సీనియర్ బ్యాటర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (32) పరుగుల వేటలో ఇబ్బంది పడగా.. మరో ఎండ్‌లో అభిషేక్ శర్మ అలవోకగా పరుగులు పిండుకున్నాడు. బౌండరీలు బాదటంలో కేన్ విలియమ్సన్ తేలిపోయినా.. స్ట్రయిక్ రొటేషన్‌లో విజయవంతమయ్యాడు. జోరు మీదున్న అభిషేక్ శర్మకు చక్కటి సహకారం అందించాడు. పవర్‌ప్లేలో 37/0తో నిలిచిన హైదరాబాద్‌ను అభిషేక్ శర్మ ముందుకు నడిపించాడు. నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన అభిషేక్ శర్మ.. ఆ తర్వాత సైతం సూపర్‌కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముకేశ్ చౌదరి, మహీశ్, జోర్డాన్, జడేజా, సహా మోయిన్ అలీ వికెట్ల వేటలో తేలిపోయారు. తొలి వికెట్‌కు విలియమ్సన్తో కలిసి 89 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన అభిషేక్ శర్మ.. రాహుల్ త్రిపాఠి (39 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ వేగాన్ని పెంచాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగిన త్రిపాఠి 15 బంతుల్లోనే 39 పరుగులు పిండుకున్నాడు. చివర్లో అభిషేక్ నిష్క్రమించినా.. నికోలస్ పూరన్ (5 నాటౌట్) అండతో మరో 14 బంతులు మిగిలి ఉండగానే లాంఛనం ముగించాడు. సీజన్లో హైదరాబాద్‌కు తొలి విజయాన్ని కట్టబెట్టాడు.
తేలిపోయిన చెన్నై! : టాస్ నెగ్గి ఛేదనకు మొగ్గుచూపిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల మెరుపులతో చెన్నై సూపర్‌కింగ్స్‌ను గొప్పగా కట్టడి చేసింది. సన్‌రైజర్స్ బౌలర్ల సమిష్టి రాణింపుతో పవర్‌ప్లేలో పరుగులు చేసేందుకు సూపర్‌కింగ్స్ ఇబ్బంది పడింది. వాషింగ్టన్ సుందర్ స్పిన్ మాయజాలంతో బ్యాటర్లను కట్టడి చేశాడు. టాప్ ఆర్డర్ మోయిన్ అలీ (48) ఒక్కడే చెప్పుకోదగిన ప్రదర్శన చేశాడు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టిన మోయిన్ అలీ అర్థ సెంచరీకి చేరువలో వికెట్ కోల్పోయాడు. ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (15), రుతురాజ్ గైక్వాడ్ (16), శివం దూబె (3), ఎం.ఎస్ ధోని (3) విఫలమయ్యారు. అంబటి రాయుడు (27) 27 బంతుల్లో 27 పరుగులే చేశాడు. రవీంద్ర జడేజా చివర్లో కాస్త వేగంగా ఆడటంతో చెన్నై సూపర్‌కింగ్స్ స్కోరు 150 దాటింది. సన్‌రైజర్స్ బౌలర్ల సవాల్‌కు సమాధానం ఇవ్వలేని సూపర్‌కింగ్స్ బ్యాటర్లు స్వల్ప స్కోరుతో సరిపెట్టుకున్నారు.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్ : రాబిన్ ఉతప్ప (సి) మార్కరం (బి) వాషింగ్టన్ సుందర్ 15, రుతురాజ్ గైక్వాడ్ (బి) నటరాజన్ 16, మోయిన్ అలీ (సి) త్రిపాఠి (బి) మార్కరం 48, అంబటి రాయుడు (సి) మార్కరం (బి) వాషింగ్టన్ సుందర్ 27, శివం దూబె (సి) ఉమ్రాన్ మాలిక్ (బి) నటరాజన్ 3, రవీంద్ర జడేజా (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ 23, ఎం.ఎస్ ధోని (సి) ఉమ్రాన్ మాలిక్ (బి) జెన్సెన్ 3, డ్వేన్ బ్రావో నాటౌట్ 8, క్రిస్ జోర్డాన్ నాటౌట్ 6, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 154.
వికెట్ల పతనం : 1-25, 2-36, 3-98, 4-108, 5-110, 6-122, 7-147.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 4-0-36-1, మార్కో జెన్సెన్ 4-0-30-1, వాషింగ్టన్ సుందర్ 4-0-21-2, నటరాజన్ 4-0-30-2, ఉమ్రాన్ మాలిక్ 3-0-29-0, ఎడెన్ మార్కరం 1-0-8-1.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) జోర్డాన్ (బి) బ్రావో 75, కేన్ విలియమ్సన్ (సి) మోయిన్ అలీ (బి) ముకేశ్ చౌదరి 32, రాహుల్ త్రిపాఠి నాటౌట్ 39, నికోలస్ పూరన్ నాటౌట్ 5, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం :(17.4 ఓవర్లలో 2 వికెట్లకు) 155.
వికెట్ల పతనం : 1-89, 2-145.
బౌలింగ్ : ముకేశ్ చౌదరి 4-0-30-1, మహీశ్ తీక్షణ 4-0-31-0, క్రిస్ జోర్డాన్ 3-0-34-0, రవీంద్ర జడేజా 3-0-21-0, మోయిన్ అలీ 1-0-10-0, డ్వేన్ బ్రావో 2.4-0-29-1.