Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో సింధు, శ్రీకాంత్ ఓటమి
- కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్
నవతెలంగాణ-సంచియోన్
కొరియా ఓపెన్‌లో భారత షట్లర్ల టైటిల్ పోరుకు తెరపడింది. మహిళల, పురుషుల సింగిల్స్ విభాగాల్లో భారత స్టార్ షట్లర్లు సెమీఫైనల్స్‌కు చేరుకోవంతో.. కనీసం ఓ పతకం ఖాయంగా కనిపించింది. అనూహ్యంగా, సెమీఫైనల్లో ఇటు పి.వి సింధు, ఇటు కిదాంబి శ్రీకాంత్ పరాజయం పాలవటంతో కొరియా ఓపెన్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 14-21, 17-21తో సింధు పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ 19-21, 16-21తో ఓటమి చెందాడు.
అనూహ్య పరాజయం! : మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ పి.వి సింధు అనూహ్య పరాజయం చవిచూసింది. రెండో సీడ్ అన్ సియోంగ్ (దక్షిణ కొరియా) సెమీస్‌లో సింధుపై పైచేయి సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్స్‌లో బుసానన్‌పై తిరుగులేని విజయం సాధించిన సింధు.. సెమీఫైనల్లో సియోంగ్ చేతిలో 48 నిమిషాల్లోనే చేతులెత్తేసింది. 14-21, 17-21తో వరుస గేముల్లోనే ఫైనల్స్ బెర్త్ కోల్పోయింది. సెమీస్ సమరంలో ఏ దశలోనూ సింధు రేసులో నిలువలేదు. 1-7తో భారీ ఆధిక్యం కోల్పోయిన సింధు మళ్లీ కోలుకోలేదు. 7-11తో విరామ సమయానికి వెనుకంజలోనే నిలిచిన సింధు.. ద్వితీయార్థంలోనూ స్కోరు సమం చేయటంలో విఫలమైంది. తొలి గేమ్‌ను కోల్పోయింది. కీలక రెండో గేమ్‌లో సింధు గట్టిగా పోరాడింది. 5-5 నుంచి 9-9 వరకు సింధు, సియోంగ్ ఆధిక్యం కోసం కసిగా ఆడారు. విరామ సమయంలో 11-9తో ఆధిక్యం సాధించిన సియోంగ్.. మళ్లీ సింధుకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. 13-14తో సియోంగ్‌ను వెంబడించిన సింధు స్కోరు సమం చేయలేకపోయింది. వరుస పాయింట్లు సాధించిన సియోంగ్ రెండో గేమ్‌తో పాటు ఫైనల్స్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.
పురుషుల సింగిల్స్‌లో మాజీ వరల్డ్ నం.1, కిదాంబి శ్రీకాంత్ అంచనాలకు తగిన ప్రదర్శన చేయలేదు. మూడో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా) చేతిలో వరుస గేముల్లో ఓటమి పాలయ్యాడు. 49 నిమిషాల సెమీఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ పోరాడినా ఫలితం లేకపోయింది. తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ బాగా ఆడారు. విరామ సమయానికి శ్రీకాంత్ 11-8తో మంచి ఆధిక్యం సొంతం చేసుకున్నాడు. ద్వితీయార్థంలో శ్రీకాంత్‌తో సమవుజ్జీగా నిలిచిన క్రిస్టీ ఆధిక్యం కోసం గట్టిగా నిలిచాడు. 18-18తో స్కోర్లు సమంగా ఉన్న వేళ వరుస పాయింట్లు ఖాతాలో వేసుకున్న క్రిస్టీ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి గేమ్ నెగ్గిన ఉత్సాహం రెండో గేమ్‌లోనూ చూపించాడు క్రిస్టీ. విరామ సమయానికి 11-8తో ముందంజ వేసిన క్రిస్టీ.. శ్రీకాంత్ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. 13-13, 14-14తో స్కోరు సమం చేసిన శ్రీకాంత్ మ్యాచ్‌ను మూడో గేమ్‌కు తీసుకెళ్లేలా కనిపించాడు. కానీ ఆ తర్వాత వరుస పాయింట్లు ఖాతాలో వేసుకున్న క్రిస్టీ రెండో గేమ్నూ కైవసం చేసుకుని మెన్స్ సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు.