Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పృథ్వీ షా, వార్నర్ అర్థ సెంచరీలు
- కోల్‌కతపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
నవతెలంగాణ-ముంబయి
వరుస విజయాల జోరుమీదున్న కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ చెక్ పెట్టింది. డెవిడ్ వార్నర్ (61), పృథ్వీ షా (51) అర్థ శతకాలతో చెలరేగటంతో తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ 215 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (4/35) నాలుగు వికెట్ల ప్రదర్శనతో చెలరేగటంతో ఛేదనలో కోల్‌కత నైట్‌రైడర్స్ చేతులెత్తేసింది. 44 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది.
డెవిడ్ వార్నర్ (61,45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), పృథ్వీ షా (51, 29 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (4/35) పాత జట్టు కోల్‌కత నైట్‌రైడర్స్‌పై మాయజాలం ప్రదర్శించాడు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ 44 పరుగుల తేడాతో కోల్‌కత నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ డెవిడ్ వార్నర్, పృథ్వీ షాలకు తోడు శార్దుల్ ఠాకూర్ (29 నాటౌట్, 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (22 నాటౌట్, 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ ఛేదనలో కోల్‌కత నైట్‌రైడర్స్ బోల్తా పడింది. 19.4 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (54, 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరిసినా.. భారీ ఛేదనలో అయ్యర్ షో సరిపోలేదు. అజింక్య రహానె (8), వెంకటేశ్ అయ్యర్ (18), శామ్ బిల్లింగ్స్ (15),అండ్రీ రసెల్ (24) నిరాశపరిచారు. డెత్ ఓవర్లలో ఒకే ఓవర్లో మూడు వికెట్లు కూల్చిన కుల్దీప్ యాదవ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
ధనాధన్ జోరు : టాస్ నెగ్గిన కోల్‌కత నైట్‌రైడర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు నైట్‌రైడర్స్ బౌలర్లపై ఆరంభం నుంచీ విరుచుకుపడ్డారు. యువ విధ్వంసకారుడు పృథ్వీ షా (51), ప్రమాదకార బ్యాటర్ డెవిడ్ వార్నర్ (61) పవర్‌ప్లేలో పవర్ఫుల్ బ్యాటింగ్ చేశారు. పృథ్వీ, వార్నర్ ధనాధన్‌తో తొలి ఆరు ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 68 పరుగులు పిండుకుంది. ఆరంభంలో డెవిడ్ వార్నర్ కాస్త నెమ్మదిగా ఆడగా.. పృథ్వీ షా సహజ శైలిలో రెచ్చిపోయాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 27 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు పునరాగమనంలో రెండో మ్యాచ్‌లోనే డెవిడ్ వార్నర్ అర్థ శతకం సాధించాడు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో వార్నర్ 50 పరుగుల మార్క్ అందుకున్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (27, 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం చెలరేగాడు. టాప్-3 బ్యాటర్ల విధ్వంసంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు వేగం ఎక్కడా తగ్గలేదు. కోల్‌కత నైట్‌రైడర్స్ బౌలర్ల గణాంకాలు గల్లంతయ్యాయి. లలిత్ యాదవ్ (1), రోవ్మాన్ పావెల్ (8) నిరాశపరిచినా.. లోయర్ ఆర్డర్లో అక్షర్ పటేల్ (22 నాటౌట్, 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), శార్దుల్ ఠాకూర్ (29 నాటౌట్, 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధనాధన్ ముగింపు అందించారు. శార్దుల్ ఠాకూర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మూడు సిక్సర్లతో విశ్వరూపం చూపించిన శార్దుల్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ స్కోరు అందించాడు. అక్షర్ పటేల్ సైతం వేగంగా పరుగులు పిండుకున్నాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ (2/21) ఒక్కడే మెరుగైన ప్రదర్శన చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : పృథ్వీ షా (బి) వరుణ్ 51, డెవిడ్ వార్నర్ (సి) రహానె (బి) ఉమేశ్ యాదవ్ 61, రిషబ్ పంత్ (సి) ఉమేశ్ యాదవ్ (బి) రసెల్ 27, లలిత్ యాదవ్ (ఎల్బీ) సునీల్ నరైన్ 1, రోవ్‌మన్ పావెల్ (సి) ఆర్కే సింగ్ (బి) సునీల్ నరైన్ 8, అక్షర్ పటేల్ నాటౌట్ 22, శార్దుల్ ఠాకూర్ నాటౌట్ 29, ఎక్స్‌ట్రాలు : 16, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 215.
వికెట్ల పతనం : 1-93, 2-148, 3-151, 4-161, 5-166.
బౌలింగ్ : ఉమేశ్ యాదవ్ 4-0-48-1, రశిక్ సలాం 1-0-10-0, పాట్ కమిన్స్ 4-0-51-0, వరుణ్ చక్రవర్తి 4-0-44-1, సునీల్ నరైన్ 4-0-21-2, అండ్రీ రసెల్ 2-0-16-1, వెంకటేశ్ అయ్యర్ 1-0-14-0.
కోల్‌కత నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : అజింక్య రహానె (సి) శార్దుల్ (బి) ఖలీల్ అహ్మద్ 8, వెంకటేశ్ అయ్యర్ (సి) అక్షర్ పటేల్ (బి) ఖలీల్ అహ్మద్ 18, శ్రేయస్ అయ్యర్ (స్టంప్డ్) రిషబ్ పంత్ (బి) కుల్దీప్ యాదవ్ 54, నితీశ్ రానా (సి) పృథ్వీ షా (బి) లలిత్ యాదవ్ 30, అండ్రీ రసెల్ (సి)ఖాన్ (బి) శార్దుల్ 24, శామ్ బిల్లింగ్స్ (సి) లలిత్ యాదవ్ (బి) ఖలీల్ అహ్మద్ 15, పాట్ కమిన్స్ (ఎల్బీ) కుల్దీప్ యాదవ్ 4, సునీల్ నరైన్ (సి) పావెల్ (బి) కుల్దీప్ యాదవ్ 4, ఉమేశ్ యాదవ్ (సి,బి) కుల్దీప్ యాదవ్ 0, రశిక్ సలాం (సి) పావెల్ (బి) శార్దుల్ 7, వరుణ్ చక్రవర్తి నాటౌట్ , ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (19.4 ఓవర్లలో ఆలౌట్) 171.
వికెట్ల పతనం : 1-21, 2-38, 3-107, 4-117, 5-133, 6-139, 7-143, 8-143,
బౌలింగ్ : ముస్తాఫిజుర్ రెహమాన్ 4-0-21-0, శార్దుల్ ఠాకూర్ 2.4-0-30-2, ఖలీల్ అహ్మద్ 4-0-25-3, అక్షర్ పటేల్ 3-0-32-0, కుల్దీప్ యాదవ్ 4-0-35-4, రోవ్‌మన్ పావెల్ 1-0-17-0, లలిత్ యాదవ్ 1-0-8-1.