Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్లో తగ్గిన రోహిత్ జోరు
- ఓపెనర్‌గా నిలకడగా విఫలం
వైట్‌బాల్ ఫార్మాట్లో రోహిత్ శర్మ ఎంతటి ప్రమాదకర ఆటగాడో అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ సర్క్యూట్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో రోహిత్ శర్మ పెట్టింది పేరు. జాతీయ జట్టుకు ఓపెనర్‌గా వీర విహారం చేసే రోహిత్ శర్మ... అదే పాత్రలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కాస్త ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తోంది. 2019 నుంచి ముంబయి ఇండియన్స్ తరఫున ఓపెనర్‌గా రోహిత్ శర్మ సహజ శైలిలో ఆడలేకపోతున్నాడు.
నవతెలంగాణ క్రీడావిభాగం
అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన, విధ్వంసక ఓపెనర్‌గా రోహిత్ శర్మ తిరుగులేని రికార్డులు సాధించాడు. విజయంతమైన ఓపెనర్‌గా రాణిస్తున్న సమయంలోనే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబయి ఇండియన్స్ ప్రాంఛైజీ తరఫున ప్రయోగాలు చేశాడు. ఓపెనర్ స్థానం త్యజించి.. మిడిల్ ఆర్డర్లో వచ్చాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ శర్మ ముందంజలో కొనసాగుతున్నాడు. అయితే, గత కొన్ని సీజన్లుగా రోహిత్ శర్మ ఓపెనర్ పాత్రలో ఇబ్బంది పడుతున్నాడు. 2019 ఐపీఎల్ సీజన్ నుంచి కనీసం 30 ఇన్నింగ్స్‌ల్లో టాప్ ఆర్డర్లో (టాప్-3) బ్యాటింగ్ చేసిన బ్యాటర్ల సగటులో ఇద్దరు మాత్రమే 30 కంటే తక్కువ ఉన్నారు. స్ట్రయిక్ రేట్ 130కి దిగువన ఐదుగురు బ్యాటర్లు ఉన్నారు. ఈ రెండు విభాగాల్లో చోటుచేసుకున్న ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ. ఐపీఎల్లో గత కొన్ని సీజన్లుగా రోహిత్ శర్మ ప్రదర్శన తీసికట్టుగా ఉంది. చివరగా 2016 ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ 30కి పైగా బ్యాటింగ్ సగటు నమోదు చేశాడు. అప్పట్నుంచి రోహిత్ శర్మ బ్యాటింగ్ సగటు 20ల్లోనే ఉంటోంది. గత ఐదు సీజన్లుగా రోహిత్ శర్మ స్ట్రయిక్‌రేట్ సైతం సాధారణంగా ఉంది. 2018 ఐపీఎల్లో మాత్రమే రోహిత్ శర్మ స్ట్రయిక్ రేటు 130కి పైగా నమోదైంది. 2019 సీజన్ నుంచి ముంబయి ఇండియన్స్‌కు రెగ్యులర్‌గా రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తున్నాడు. రోహిత్ శర్మ సగటు 27.9గా ఉండగా, స్ట్రయిక్‌రేట్ 127.7గా ఉంది. అయితే ఈ గణాంకాలు రోహిత్ శర్మ సత్తా, సామర్థ్యాలకు గీటురాయి కాదనే విషయం అందరికీ తెలుసు.
2019 నుంచి అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మ 982 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సగటు 32.73, స్ట్రయిక్‌రేట్ 144. అయితే, భారత్‌కు ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఈ పరుగులు చేశాడు. ముంబయి ఇండియన్స్‌కు సైతం రోహిత్ శర్మ ఇదే స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో మార్టిన్ గప్టిల్ తర్వాత అంతటి విజయవంతమైన ఓపెనర్ రోహిత్ శర్మ. ఈ ఫార్మాట్లో రోహిత్ శర్మ 25 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. అందులో నాలుగు సార్లు మూడంకెల స్కోర్లు అందుకున్నాడు. రోహిత్ శర్మ కంటే ఎక్కువ శతకాలు మరో బ్యాటర్ టీ20ల్లో సాధించలేదు. అందుకే రోహిత్ శర్మ ఓపెనర్‌గా అత్యంత విజయవంతమైన ఆటగాడిగా ఉండేవాడనే మాట వాడాల్సి వస్తోంది. ఐపీఎల్ జట్టులో పోషించే పాత్ర ఓపెనింగ్. అయినా, ఇక్కడ రోహిత్ శర్మ ఇబ్బంది పడుతున్నాడు. అందుకు కారణం.. ముంబయి ఇండియన్స్ తరఫున అతడు యాంకర్ రోల్ పాత్ర పోషించాల్సి వస్తోంది. ముంబయి ఇండియన్స్‌కు నాయకత్వ బాధ్యతలు మరో కారణం. చివరి వరకు బ్యాటింగ్ చేయగల బ్యాటర్లు ముంబయి ఇండియన్స్‌కు అవసరమని తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ చేతిలో ఓటమి అనంతరం రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. రోహిత్ వ్యాఖ్యలు ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ దుస్థితిని అద్దం పడుతోంది.
భారత జట్టులో రోహిత్ శర్మ పాత్ర, బాధ్యత వేరు. అతడు అక్కడ యాంకర్ రోల్ పోషించాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యతలు విరాట్ కోహ్లి చూసుకుంటాడు. కెఎల్ రాహుల్ సైతం కొన్నిసార్లు ఆ పాత్ర పోషిస్తాడు. సహజ శైలిలో ఆడేందుకు రోహిత్ శర్మ పూర్తి స్వేచ్ఛ అతడికి ఉంటుంది. కానీ ముంబయి ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మకు స్వేచ్చగా ఆడేందుకు అవకాశం లేదు!. గత సీజన్లలో ముంబయి ఇండియన్స్‌కు బలమైన మిడిల్ ఆర్డర్ ఉండేది. పంజాబ్ కింగ్స్,సన్‌రైజర్స్ హైదరాబాద్‌లకు భిన్నమైన పరిస్థితి ఉండేది. కెఎల్ రాహుల్, డెవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్‌లు ఇన్నింగ్స్ చివరి వరకు ఆడాల్సిన పరిస్థితి ఉండగా.. రోహిత్ శర్మ స్చేచ్ఛగా ఆడేవాడు. కానీ ఈ సీజన్లో ఆ పరిస్థితి లేదు. 2019 సీజన్ నుంచి రోహిత్ శర్మ బ్యాటింగ్ భాగస్వాముల బ్యాటింగ్ సగటు 50.3. ఈ ఘనత రోహిత్ శర్మకు దక్కుతుంది. రోహిత్ శర్మ భాగస్వామ్యులకు మించిన బ్యాటింగ్ సగటు మరో బ్యాటర్‌కు లేదు. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ సహచరులకు కల్పించిన స్వేచ్ఛ అటువంటిది!. నెమ్మదైన బ్యాటింగ్‌కు తరచుగా విమర్శలు ఎదుర్కొనే కెఎల్ రాహుల్ సగటున 31.4 పరుగులకు ఓ భాగస్వామి వికెట్ కోల్పోగా.. కేన్ విలియమ్సన్ 28.8 పరుగులకు వికెట్ కోల్పోయాడు.
ఐపీఎల్లో పృథ్వీ షా, జోశ్ బట్లర్, శిఖర్ ధావన్, సంజు శాంసన్‌లు టాప్ ఆర్డర్లో మెరుపు బ్యాటింగ్‌లోనైనా, యాంకర్ పాత్రలోనైనా విజయవంతమయ్యారు. విచిత్రంగా ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ శిబిరంలో రోహిత్ శర్మ ఈ రెండు పాత్రల్లోనూ మెరువటం లేదు. 2019 సీజన్ నుంచి ముంబయి ఇండియన్స్ తరఫున కేవలం ఏడు మ్యాచుల్లోనే రోహిత్ శర్మ ఆ జట్టుకు అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కీర్తి గడించిన రోహిత్ శర్మ.. ఇకనైనా బ్యాటర్‌గా సహజ శైలిలో ప్రభావం చూపించాల్సిన అవసరం ఉంది. వరుస పరాజయాలు చవిచూస్తున్న ముంబయి ఇండియన్స్‌కు బ్యాటర్ రోహిత్ శర్మ విశ్వరూపం అవసరం అవశ్యం.